Stock Market: ఆద్యంతం లాభాలు.. 18,600 ఎగువకు నిఫ్టీ

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు అందుకు దోహదం చేశాయి.

Published : 13 Dec 2022 15:54 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల అండతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం ఆద్యంతం లాభాల్లో దూసుకెళ్లాయి. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు ఏ దశలోనూ తడబడలేదు. దేశీయంగా ద్రవ్యోల్బణం దిగిరావడం కూడా సూచీలకు కలిసొచ్చింది. సెన్సెక్స్‌ (Sensex) 402.73 పాయింట్ల లాభంతో 62,533.30 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) 110.85 పాయింట్ల లాభంతో 18,608.00 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.89 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌30 సూచీలో 24 షేర్లు లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. నెస్లే ఇండియా, టాటా స్టీల్‌, మారుతీ, టైటన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర అంశాలు..

మాక్రోటెక్‌ డెవలపర్‌ షేరు ఇంట్రాడేలో 7 శాతం నష్టపోయింది. గత ఏడాది వ్యవధిలో ఈ షేరు 25 శాతం కుంగింది. డిసెంబరు 12న కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ భేటీ అయ్యారు. 34.57 మిలియన్‌ ఈక్విటీ షేర్లను అర్హతగల సంస్థాగత మదుపర్లకు విక్రయించాలని నిర్ణయించారు. చివరకు స్టాక్‌ ఈరోజు 5.19 శాతం నష్టపోయి రూ.1,027 వద్ద స్థిరపడింది.

☛ కల్యాణ్‌ జువెలర్స్‌ ఇంట్రాడేలో 3 శాతం పుంజుకొని రూ.122.95 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. గత మూడు రోజుల్లో ఈ స్టాక్‌ 14 శాతం పెరిగింది. 2023లో భారీ ఎత్తున వ్యాపార విస్తరణ చేపట్టనున్నట్లు కంపెనీ ప్రకటించిన నేపథ్యంలో షేరు ర్యాలీ అవుతోంది. చివరకు ఈరోజు షేరు 0.29 శాతం లాభంతో రూ.119.35 వద్ద ముగిసింది.

☛ అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన తొలి 100 కంపెనీల జాబితాలో యెస్‌ బ్యాంక్‌ తిరిగి చోటు దక్కించుకుందది. గత మూడు రోజుల్లో ఈ స్టాక్‌ 30 శాతం పుంజుకుంది. మూలధన నిధుల సమీకరణకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే స్టాక్‌ దూసుకెళ్తోంది. ఈరోజు 13.74 శాతం పెరిగి రూ.24 వద్ద స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు