Stock market: సెన్సెక్స్‌కు స్వల్ప నష్టాలు

గరిష్ఠ స్థాయుల్లో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్, స్వల్ప నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ మాత్రం తాజా రికార్డు గరిష్ఠానికి చేరింది.

Published : 06 Jul 2024 02:24 IST

రూ.449.88 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
సమీక్ష

గరిష్ఠ స్థాయుల్లో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్, స్వల్ప నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ మాత్రం తాజా రికార్డు గరిష్ఠానికి చేరింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ షేర్లు రాణించగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు డీలాపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పైసా పెరిగి 83.49 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 87 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

 • మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ జీవనకాల గరిష్ఠమైన రూ.449.88 లక్షల కోట్లు (5.39 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది. సూచీలు మిశ్రమ ధోరణిలో ముగిసినా, శుక్రవారం మదుపర్ల సంపద రూ.2.58 లక్షల కోట్లు పెరిగింది. 
 • సెన్సెక్స్‌ ఉదయం 79,778.98 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. రోజులో ఎక్కువ భాగం నష్టాల్లోనే కదలాడిన సూచీ, ఇంట్రాడేలో 79,478.96 వద్ద కనిష్ఠానికి పడింది. ఆఖర్లో కోలుకున్న సూచీ, 53.07 పాయింట్ల వద్ద నష్టంతో 79,996.60 వద్ద ముగిసింది. నిఫ్టీ 21.70 పాయింట్లు పెరిగి 24,323.85 దగ్గర స్థిరపడింది ఇంట్రాడేలో ఈ సూచీ 24,168.85- 24,363 పాయింట్ల మధ్య కదలాడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్‌ 963.87 పాయింట్లు, నిఫ్టీ 313.25 పాయింట్ల చొప్పున లాభాలు నమోదుచేశాయి.
 • 52 వారాల గరిష్ఠానికి రిలయన్స్‌ షేరు: రిలయన్స్‌ జియో పబ్లిక్‌ ఇష్యూకు వస్తుందనే అంచనాల నేపథ్యంలో, గ్రూప్‌ ప్రధాన సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఇంట్రాడేలో 3% పెరిగి రూ.3197.65 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2.32% లాభంతో రూ.3180 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.55,286.61 కోట్లు పెరిగి రూ.21.58 లక్షల కోట్లకు చేరింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.23.82 లక్షల కోట్లుగా ఉంది.
 • స్థిరాస్తి విభాగాన్ని విభజించి, ప్రత్యేక సంస్థగా ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయనున్నట్లు ప్రకటించడంతో రేమండ్‌ షేరు  9.68% దూసుకెళ్లి రూ.3,226.70 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.3,484 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది.
 • సెన్సెక్స్‌ 30 షేర్లలో 13 నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 4.55%, టైటన్‌ 1.99%, టాటా స్టీల్‌ 0.85%, ఎం అండ్‌ ఎం 0.72% డీలాపడ్డాయి. ఎస్‌బీఐ 2.48%, రిలయన్స్‌ 2.32%, హెచ్‌యూఎల్‌ 2.01%, ఎన్‌టీపీసీ 1.86%, ఎల్‌ అండ్‌ టీ 1.52%, పవర్‌గ్రిడ్‌  1.21%, నెస్లే 1.15%, ఐటీసీ 1.11% లాభపడ్డాయి. 
 • ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.5,000 కోట్ల వరకు సమీకరించేందుకు వాటాదార్ల అనుమతి కోరనున్నట్లు టొరెంట్‌ పవర్‌ వెల్లడించింది. జులై 30న జరగనున్న కంపెనీ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో, ఈ ప్రతిపాదనకు అనుమతి తీసుకోనున్నారు. 
 • అమెరికా ఆర్థిక వ్యవస్థ జూన్‌లో కొత్తగా 2,06,000 ఉద్యోగాలు సృష్టించింది. మార్కెట్‌ అంచనా అయిన 1,91,000 కంటే ఇది ఎక్కువ. నిరుద్యోగ రేటు అంచనా 4 శాతం కాగా.. 4.1 శాతానికి పెరిగింది. 2021 డిసెంబరు తర్వాత ఇదే అత్యధిక నిరుద్యోగ రేటు.
 • కేవైసీ, రుణాలు- అడ్వాన్సులకు సంబంధించిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌పై రూ.1.31 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. 
 • ఎంక్యూర్‌ ఫార్మా ఐపీఓ ముగిసేసరికి 67.87 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,37,03,538 షేర్లను ఆఫర్‌ చేయగా, 92,99,97,390 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీ విభాగంలో 195.83 రెట్లు, ఎన్‌ఐఐల నుంచి 48.32 రెట్లు, రిటైల్‌ విభాగంలో  3.43 రెట్ల స్పందన నమోదైంది.
 • బన్సల్‌ వైర్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓకు చివరి రోజు 59.57 రెట్ల స్పందన దక్కింది. ఇష్యూలో 2,14,60,906 షేర్లను జారీ చేయనుండగా, 1,27,85,23,754 షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్‌లో 13.64 రెట్ల స్పందన వచ్చింది.
 • తగ్గిన ఫారెక్స్‌ నిల్వలు: జూన్‌ 28తో ముగిసిన వారానికి మన విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు 1.713 బి.డాలర్లు (దాదాపు రూ.14,000 కోట్లు) తగ్గి 651.99 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.54.10 లక్షల కోట్ల)కు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. అంతక్రితం వారం ఫారెక్స్‌ నిల్వలు 652.895 బి.డాలర్లుగా ఉన్నాయి. సమీక్షిస్తున్న వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 1.252 బి.డాలర్లు తగ్గి 572.881 బి.డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి నిల్వలు 427 మి.డాలర్లు క్షీణించి 56.528 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు (ఎస్‌డీఆర్‌లు) 35 మిలియన్‌ డాలర్లు తగ్గి 18.014 బిలియన్‌ డాలర్లకు చేరగా, ఐఎంఎఫ్‌ వద్ద దేశ నిల్వల స్థానం 1 మిలియన్‌ డాలర్లు పెరిగి 4.573 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు