Gold: బుల్‌ను మించిన బంగారం

ప్రస్తుత సంవత్సరం తొలి అర్ధభాగంలో అటు స్టాక్‌ మార్కెట్, ఇటు బంగారం సానుకూలతలనే అందించాయి. ఈ రెండింటిలో పెట్టుబడి పెట్టిన మదుపర్లకు మంచి లాభాలే వచ్చాయి.

Updated : 07 Jul 2024 09:33 IST

నిఫ్టీ 50 కంటే పసిడిపై ఎక్కువ ప్రతిఫలం
జనవరి-జూన్‌లో 14%
ఎన్‌ఎస్‌ఈ ప్రామాణిక సూచీ రాణించింది 11 శాతమే

ప్రస్తుత సంవత్సరం తొలి అర్ధభాగంలో అటు స్టాక్‌ మార్కెట్, ఇటు బంగారం (Gold) సానుకూలతలనే అందించాయి. ఈ రెండింటిలో పెట్టుబడి పెట్టిన మదుపర్లకు మంచి లాభాలే వచ్చాయి. అయితే ఎన్‌ఎస్‌ఈ ప్రామాణిక సూచీ అయిన నిఫ్టీ 50కి మించి సంప్రదాయ పెట్టుబడి సాధనమైన పసిడి (Gold) అధిక ప్రతిఫలాలను ఇవ్వడమే ఇక్కడ విశేషం. జనవరి-జూన్‌లో నిఫ్టీ-50 సూచీ 11% లాభపడితే.. బంగారం 14% ప్రతిఫలాలను మదుపర్లకు అందించింది. 

రెండూ భిన్న పెట్టుబడి సాధనాలు

పసిడిని (Gold) సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తుంటారు. మరోవైపు ఈక్విటీలు నష్టభయంతో కూడుకున్నవి. ఆర్థిక వ్యవస్థ రాణించడం, రాజకీయ స్థిరత్వం లాంటి అంశాలు స్టాక్‌ మార్కెట్‌కు సానుకూలం. అధిక ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి, తక్కువ వడ్డీ రేట్ల లాంటి పరిస్థితులు, బంగారం ధర పెరిగేందుకు తోడ్పడతాయి. ఈ ఏడాదిలో పసిడి (Gold) ధరకు కలిసొచ్చిన అంశాలేమిటంటే.. 

  • అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కీలక రేట్లను అమెరికా తగ్గించొచ్చనే అంచనాలు.
  • కొన్ని దిగ్గజ దేశాల కేంద్రీయ బ్యాంకులు పసిడిని (Gold) దూకుడుగా కొనుగోలు చేస్తుండం.(ఉదాహరణకు 2023 డిసెంబరు 29 నాటికి ఆర్‌బీఐ వద్ద 49.328 బిలియన్‌ డాలర్ల విలువైన పసిడి (Gold) నిల్వలు ఉండగా.. ఈ ఏడాది జూన్‌ 7 నాటికి ఇవి 56.982 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరాయి.)
  • చైనా 18 నెలలుగా భారీగా పసిడిని కొనుగోలు చేయడం.  
  • అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్థిక అనిశ్చితులు.

ఈ జోరు ఎందాకా?

పసిడి జోరు మున్ముందూ కొనసాగే అవకాశం ఉందని చాలా మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలం పొందేందుకు, పసిడి ఓ ఉత్తమ పెట్టుబడి మార్గంగా చెబుతున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్రీయ బ్యాంకుల పసిడి కొనుగోళ్లు, స్థూల ఆర్థిక అనిశ్చితులు కొనసాగనుండటం; అమెరికా ఫెడ్‌ కీలక రేట్లను తగ్గించే అవకాశం ఉండటం, చైనాలో అధిక గిరాకీ పరిస్థితులు లాంటివి పసిడికి మున్ముందూ కలిసి వస్తాయని విశ్లేషిస్తున్నారు.  

ఇవి కీలకం

‘గత అయిదేళ్లలో దేశీయంగా పసిడి ధరలు రెట్టింపు అయ్యాయి. 2003 నుంచి చూస్తే, బంగారం ధర 980 శాతానికి పైగా పెరిగింది. లోహ రూపంలో కొనడానికైనా.. పెట్టుబడి అవసరాల కోసమైనా పసిడికి గిరాకీ స్థిరంగా కొనసాగుతోంద’ని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కమొడిటీస్‌ విభాగ హెడ్‌ హరీశ్‌ వి చెబుతున్నారు. అంతర్జాతీయ విపణుల్లో పసిడికి కొన్ని ప్రతికూలతలూ ఎదురయ్యే అవకాశం ఉన్నందున, ఇకపై పసిడి ధర మరీ ఎక్కువగా పెరిగే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. పరిమిత శ్రేణికి లోబడే ధరలు కదలాడొచ్చని అంచనా వేస్తున్నారు. 

త్వరలో 10 గ్రాములు రూ.78,000కు

‘భారత విపణిలో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర త్వరలోనే రూ.78,000ను తాకే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు (31.10 గ్రా.) పసిడి ధర 2,500 డాలర్ల దిశగా అడుగులు వేయొచ్చ’ని ఏంజెల్‌ వన్‌ లిమిటెడ్‌లో కరెన్సీ, వ్యవసాయేతర కమొడిటీల పరిశోధన విభాగానికి చెందిన పార్థమేశ్‌ మాల్యా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 10 గ్రాముల పసిడి ధర రూ.74,000 దరిదాపుల్లో ఉంది.

పెట్టుబడుల్లో 10-15% పెట్టడం మేలు

మదుపర్లు తమ పెట్టుబడుల్లో 10-12 శాతాన్ని పసిడికి కేటాయించాలని హరీశ్‌ సూచిస్తున్నారు. ధర దిద్దుబాటు అయిన సమయంలో పసిడి కొనుగోలుకు మొగ్గు చూపడం మంచిదని సలహా ఇస్తున్నారు. పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండాలంటే కనీసం 15 శాతమైనా పసిడిపై పెట్టాలని మాల్యా అంటున్నారు. పసిడి ధరలు పెరగడం వల్ల ఆభరణాలు తనఖా పెట్టుకుని, అధిక రుణం పొందే వీలు ఏర్పడటమే కాకుండా, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యలభ్యత పెరిగేందుకు దోహదం చేస్తోందని యునిమోనీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సీఈఓ, డైరెక్టర్‌ కృష్ణన్‌ చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు