Stock market: స్వల్ప శ్రేణికి సూచీలు పరిమితం

ఆద్యంతం స్వల్పశ్రేణిలో కదలాడిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. కీలక పరిణామాలు లేకపోవడం, బలహీన ఆసియా సంకేతాలు ప్రభావం చూపాయి. బ్యాంకింగ్, టెలికాం, స్థిరాస్తి షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది.

Published : 09 Jul 2024 03:10 IST

సమీక్ష

ద్యంతం స్వల్పశ్రేణిలో కదలాడిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. కీలక పరిణామాలు లేకపోవడం, బలహీన ఆసియా సంకేతాలు ప్రభావం చూపాయి. బ్యాంకింగ్, టెలికాం, స్థిరాస్తి షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పైసా తగ్గి 83.50 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.97% నష్టంతో 85.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

  • సెన్సెక్స్‌ ఉదయం 79,915 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా ఒడుదొడుకుల మధ్య కదలాడిన సూచీ, ఇంట్రాడేలో 79,731.83 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 36.22 పాయింట్లు తగ్గి 79,960.38 వద్ద ముగిసింది. నిఫ్టీ 3.30 పాయింట్లు కోల్పోయి 24,320.55 దగ్గర స్థిరపడింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 15 నష్టపోయాయి. టైటన్‌ 3.54%, అదానీ పోర్ట్స్‌ 1.65%, టాటా స్టీల్‌ 1.40%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.31%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.21%, ఎం అండ్‌ ఎం 1.08%, అల్ట్రాటెక్‌ 0.92%, టీసీఎస్‌ 0.91% నీరసపడ్డాయి. ఐటీసీ 2.27%, హెచ్‌యూఎల్‌ 1.55%, నెస్లే 1.14%, హెచ్‌సీఎల్‌టెక్‌ 0.92%, టాటా మోటార్స్‌ 0.87% లాభపడ్డాయి. 

పేటీఎం షేర్ల పరుగులు: పేటీఎంను 100 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8.30 లక్షలకోట్ల) కంపెనీగా చేయడమే లక్ష్యమని వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ ప్రకటించిన నేపథ్యంలో, ఆ కంపెనీ మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేర్లు పరుగులు తీశాయి. సోమవారం ఇంట్రాడేలో 9.87% దూసుకెళ్లిన షేరు రూ.479.70 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 8.12% లాభంతో రూ.472.05 వద్ద ముగిసింది. 

ఐపీఓ సమాచారం

  • వాహన, వ్యాపార రుణాలు ఇచ్చే ఎస్‌కే ఫైనాన్స్‌   రూ.2200 కోట్ల తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ప్రతిపాదనను  సెబీ తాత్కాలికంగా నిలిపివేసింది. 
  • ఐపీఓ ద్వారా నిధులు సమీకరణకు అకమ్స్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌కు సెబీ అనుమతి ఇచ్చింది. గోల్డ్‌ ప్లస్‌ గ్లాస్‌ ఇండస్ట్రీ, సీగాల్‌ ఇండియా, ఓరియెంట్‌ టెక్నాలజీస్‌ ఇష్యూలకు సైతం పచ్చజెండా ఊపింది.  
  • ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు ట్రక్‌ ఆపరేటర్ల డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ జింకా లాజిస్టిక్స్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్, సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ.550 కోట్ల తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 2.16 కోట్ల షేర్లను ప్రమోటర్లు, వాటాదార్లు విక్రయించనున్నారు.
  • అంబే లేబొరేటరీస్‌ ఎస్‌ఎంఈ ఐపీఓకు 173.18 రెట్ల స్పందన లభించింది. రిటైల్‌ విభాగంలో 195.06 రెట్ల స్పందన లభించింది.
  • సెమీకండక్టర్‌ డిజైన్‌ సేవల ప్రొవైడర్‌ ఎక్సెల్‌మ్యాక్స్‌ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేసినట్లు యాక్సెంచర్‌ వెల్లడించింది. లావాదేవీ విలువను ప్రకటించలేదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని