Stock market: 3 నెలల్లోనే రూ.50 లక్షల కోట్లు

రెండు రోజుల నష్టాల నుంచి బలంగా పుంజుకున్న సూచీలు, మంగళవారం జీవనకాల తాజా గరిష్ఠాలకు చేరాయి.

Published : 10 Jul 2024 02:51 IST

మదుపర్ల సంపద విలువ పెరిగిన తీరిది
2024 ఏప్రిల్‌ 8న రూ.400 లక్షల కోట్లు
2024 జులై 9న  రూ.451 లక్షల కోట్లు
జీవనకాల కొత్త గరిష్ఠాలకు సెన్సెక్స్, నిఫ్టీ 

రెండు రోజుల నష్టాల నుంచి బలంగా పుంజుకున్న సూచీలు, మంగళవారం జీవనకాల తాజా గరిష్ఠాలకు చేరాయి. విదేశీ కొనుగోళ్ల మద్దతుతో వాహన, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు రాణించాయి. కార్పొరేట్‌ కంపెనీల జూన్‌ త్రైమాసిక ఫలితాలపై సానుకూల అంచనాలు, రుతుపవనాల పురోగతి మార్కెట్లను నడిపించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి పైసా పెరిగి 83.49 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.51% నష్టంతో 85.31 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌ మినహా మిగతావి నష్టపోయాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.

  •  మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ మంగళవారం రూ.1.56 లక్షల కోట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన రూ.451.27 లక్షల కోట్లు (5.41 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది.
  •  సెన్సెక్స్‌ ఉదయం 80,107.21 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే జోరు కొనసాగించిన సూచీ, ఇంట్రాడేలో 80,397.17 వద్ద కొత్త గరిష్ఠాన్ని తాకింది. చివరకు 391.26 పాయింట్ల లాభంతో 80,351.64 వద్ద ముగిసింది. నిఫ్టీ 112.65 పాయింట్లు పెరిగి 24,433.20 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 24,443.60 దగ్గర రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది.
  •  సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 పరుగులు తీశాయి. ఐటీసీ 2.68%, సన్‌ఫార్మా 1.97%, టైటన్‌ 1.96%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.11%, నెస్లే 1.05%, ఎల్‌ అండ్‌ టీ 0.93% చొప్పున లాభపడ్డాయి. రిలయన్స్‌ 0.69%, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.44%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 0.39%, టాటా స్టీల్‌ 0.29% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. వాహన 2.17%, మన్నికైన వినిమయ వస్తువులు 2.01%, స్థిరాస్తి 1.23%, వినియోగ 1.21%, ఆరోగ్య సంరక్షణ 1%, యుటిలిటీస్‌ 0.76% రాణించాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్‌ తగ్గాయి. బీఎస్‌ఈలో 1960 షేర్లు లాభాల్లో ముగియగా, 1973 స్క్రిప్‌లు నష్టపోయాయి. 93 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. 320 షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌ను, 242 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.
  •  వాహన షేర్లకు భారీ గిరాకీ: పర్యావరణహిత వాహనాలను ప్రోత్సాహించేందుకు, హైబ్రిడ్‌ వాహనాలపై రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రద్దు చేయనుందన్న వార్తలతో వాహన షేర్లు వెలుగులోకి వచ్చాయి. మారుతీ సుజుకీ షేరు అత్యధికంగా 6.60% (రూ.794) లాభపడి రూ.12,820.20 వద్ద ముగిసింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా 2.51%, హీరో మోటోకార్ప్‌ 1.53%, టీవీఎస్‌ మోటార్‌ 1.36%, టాటా మోటార్స్‌ 1.24%, బజాజ్‌ ఆటో 0.18% చొప్పున లాభాలు నమోదు చేశాయి. బీఎస్‌ఈ వాహన సూచీ 2.17% పెరిగి 58,706.42 పాయింట్ల వద్ద ముగిసింది. 
  •  ఎల్‌ అండ్‌ టీ చేతికి భారీ ఆర్డర్‌: రెండు ఫ్లీట్‌ సపోర్ట్‌ నౌకల (ఎఫ్‌ఎస్‌ఎస్‌) నిర్మాణం కోసం హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ నుంచి ‘గణనీయ’ ఆర్డరు దక్కించుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ ప్రకటించింది. ఈ ఆర్డరు విలువ రూ.1000- 2500 కోట్లు ఉండొచ్చు.
  •  బెంగళూరుకు చెందిన సిలికాంచ్‌ సిస్టమ్స్‌ను రూ.183 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. ఈ కొనుగోలుతో ఫ్యాబ్‌లెస్‌ సెమీకండక్టర్‌ వ్యాపారంలో మరింత బలోపేతం కానున్నట్లు వెల్లడించింది. 
  •  అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలకు తోడ్పడేలా పలు ఉత్పత్తులను తీసుకొచ్చినట్లు బంధన్‌ బ్యాంక్‌ పేర్కొంది. లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌సీలు), రెమిటెన్స్, బ్యాంక్‌ గ్యారెంటీ, ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ కలెక్షన్‌ బిల్, బిల్‌/ఇన్‌వాయిస్‌ డిస్కౌంటింగ్‌ వంటివి ఇందులో ఉన్నాయి. 
  •  రూ.1.27 లక్షలు పెడితే రూ.11.81 లక్షలకు: బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై జీఎం పాలీప్లాస్ట్‌ షేరు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. 2020లో ఈ కంపెనీ ఐపీఓకు వచ్చింది. ఇష్యూ ధరను రూ.159గా నిర్ణయించారు. మదుపర్లు ఒక్కో లాట్‌ (800 షేర్ల)ను రూ.1.27 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. తాజాగా కంపెనీ 6:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను ప్రకటించింది. అంటే ప్రతి షేరుకు 6 షేర్లు అదనంగా వచ్చాయి. అంటే ఒక అప్పట్లో ఒక లాట్‌ తీసుకున్న వారి షేర్లు, ఇప్పుడు 5600కు చేరాయి. మంగళవారం షేరు రూ.211 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. దీంతో రూ.1.27 లక్షల పెట్టుబడి రూ.11.81 లక్షలకు చేరింది.

ఏడాదిలో రూ.150 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద 

మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ చరిత్రలోనే తొలిసారిగా రూ.450 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. గతేడాది జులైలో మదుపర్ల సంపద విలువ రూ.300 లక్షల కోట్లకు చేరగా, మార్కెట్ల జోరుతో ఏడాది వ్యవధిలోనే మరో రూ.150 లక్షల కోట్లు పెరిగింది.

  •  బీఎస్‌ఈలో రూ.21.51 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిలిచింది. టీసీఎస్‌ (రూ.14.44 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (రూ.12.45 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌ (రూ.8.78 లక్షల కోట్లు), భారతీ ఎయిర్‌టెల్‌ (రూ.8.16 లక్షల కోట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 
  •  సైబర్‌ మోసాలను అరికట్టేందుకు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థల్లో ‘సేఫ్టీ రింగ్‌’ పేరుతో కొత్త భద్రతా ఫీచర్‌ను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) తీసుకొచ్చింది. తమ టర్మ్‌ డిపాజట్లకు రోజువారీ పరిమితి, వీటిపై ఓవర్‌డ్రాఫ్ట్‌కు పరిమితి పెట్టుకునేందుకు ఖాతాదార్లకు ఈ సదుపాయం ఉపయోగ పడుతుందని బ్యాంక్‌ వివరించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని