Stock Market Closing Bell: స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Closing Bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి...

Published : 18 Aug 2022 16:06 IST

ముంబయి: గురువారం ఆద్యంతం నష్టాల్లో పయనించిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఎట్టకేలకు చివరి అరగంటలో లాభాల్లోకి ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, గత వరుస సెషన్ల ర్యాలీ నేపథ్యంలో లాభాల స్వీకరణ మార్కెట్లను మధ్యాహ్నం వరకు కలవరపెట్టాయి. అయితే, చమురు ధరల తగ్గుదల, రూపాయి స్థిరంగా కొనసాగుతుండడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు, బలమైన కార్పొరేట్‌ ఫలితాల నేపథ్యంలో సూచీలకు దిగువ స్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో మధ్యాహ్నం తర్వాత సూచీలు క్రమంగా పుంజుకుంటూ వచ్చాయి.

నిఫ్టీ ఉదయం 17,898.65 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,968.45 వద్ద గరిష్ఠాన్ని, 17,852.05 కనిష్ఠాన్ని తాకింది. చివరకు 20.95 పాయింట్ల స్వల్ప లాభంతో 17,965.20 వద్ద స్థిరపడింది. 60,080.19 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 60,341.41 - 59,946.44 మధ్య కదిలింది. చివరకు 37.87 పాయింట్ల స్వల్ప లాభంతో 60,298.00 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.67 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ముగిశాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటన్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.

మార్కెట్‌లోని ఇతర విశేషాలు..

బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు ఈరోజు రాణించాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.3.5 లక్షల కోట్లు, అదానీ పవర్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.1.5 లక్షల కోట్లు దాటింది. ఇంట్రాడేలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 5 శాతానికి పైగా ఎగబాకి రూ.3,146 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి.

పాలసీబజార్‌ మాతృసంస్థ పీబీఫిన్‌టెక్‌ షేర్లు ఇంట్రాడేలో 4 శాతం మేర నష్టపోయాయి. చివరకు 1.54 శాతం దిగజారి రూ.563 వద్ద స్థిరపడింది. తమ కంపెనీ లాభాల్లో రావడానికి మరో 3-4 ఏళ్లు పట్టొచ్చని సంస్థ ప్రకటించడమే దీనికి కారణం.

హెచ్‌ఏఎల్‌ షేర్లు ఈరోజు ఇంట్రాడేలో రెండు శాతానికి పైగా లాభపడ్డాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోనూ తమ కార్యాలయం తెరవనున్నట్లు హెచ్‌ఏఎల్‌ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని