Stock Market Closing Bell: వరుసగా నాలుగో వారమూ లాభాలే.. నిఫ్టీ @ 17,699

Stock Market Closing Bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి...

Published : 12 Aug 2022 16:01 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. దీంతో వరుసగా నాలుగో వారం సూచీలు లాభాలను ఆర్జించాయి. జనవరి తర్వాత ఇంత సుదీర్ఘంగా లాభాలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు ఓ గంట తర్వాత కోలుకొని లాభాల్లోకి ఎగబాకాయి. అక్కడి నుంచి ఓ పరిమిత శ్రేణిలో కదలాడుతూ చివరకు లాభాల్లో స్థిరపడ్డాయి. నిన్నటి భారీ లాభాల నేపథ్యంలో కీలక కౌంటర్లలో అమ్మకాలు కొనసాగాయి. మరోవైపు ఈరోజు సాయంత్రం ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అలాగే అమెరికాలో వారాంతపు నిరుద్యోగ క్లెయిమ్స్ పెరగడం సూచీలను ఒకింత కలవరానికి గురి చేశాయి. 

* నిఫ్టీ ఉదయం 17,659.65 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,724.65 వద్ద గరిష్ఠాన్ని, 17,597.85 కనిష్ఠాన్ని తాకింది. చివరకు 40.60 పాయింట్ల లాభంతో 17,699.60 వద్ద స్థిరపడింది. 59,235.98 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 59,538.08 - 59,113.01 మధ్య కదిలింది. చివరకు 130.18 పాయింట్ల లాభంతో 59,462.78 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.65 వద్ద నిలిచింది.

* సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్‌, మారుతీ, ఎల్‌అండ్‌టీ, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.

మార్కెట్‌లోని ఇతర విశేషాలు..

* జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆయిల్‌ ఇండియా లాభాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 3 శాతానికి పైగా లాభపడ్డాయి. చివరకు 1.17 శాతం లాభంతో రూ.190.15 వద్ద స్థిరపడ్డాయి. 

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పేజ్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభాలు వార్షిక ప్రాతిపదికన రూ.10 కోట్ల నుంచి రూ.207 కోట్లకు పెరిగాయి. అదే సమయంలో ఆదాయం రెండింతలు పెరిగి రూ.1,341.6 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్లు ఈరోజు ఓ దశలో 2.47 శాతం ఎగబాకి రూ.50,350 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 0.31 శాతం లాభంతో రూ.49,162.35 వద్ద ముగిసింది.

* గ్రీవ్స్‌ కాటన్‌ సైతం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బలమైన కార్పొరేట్‌ ఫలితాలను ప్రకటించింది. దీంతో కంపెనీ షేర్లు ఈరోజు ఓ దశలో 7.46 శాతం పెరిగి రూ.177.70 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరకు 4.21 శాతం లాభపడి రూ.172.20 వద్ద స్థిరపడింది.

* స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్ రెన్యూవబుల్‌ ఎనర్జీలో షాపూర్జీ పలోంజీ తమ వాటాల్లో 1.25 శాతం విక్రయించనున్నట్లు ప్రకటించింది. దీంతో స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ షేర్లు ఇంట్రాడేలో 4 శాతానికి పైగా కుంగాయి. చివరకు 4.22 శాతం నష్టంతో రూ.276.80 వద్ద స్థిరపడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని