Stock Market Closing Bell: ఆద్యంతం లాభాలమయం.. సెన్సెక్స్‌ 59,300+

Stock Market Closing Bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ లాభాలతో ముగిశాయి...

Published : 11 Aug 2022 15:48 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో ఉదయం నుంచి ఎక్కడా లాభాల జోరు తగ్గలేదు. ఆరంభం నుంచీ కొనుగోళ్ల మద్దతు స్థిరంగా కొనసాగింది. అమెరికాలో ద్రవ్యోల్బణం జూన్‌తో పోలిస్తే దిగిరావడం సూచీల సెంటిమెంటును పెంచింది. పైగా అంచనాల కంటే కూడా తక్కువ నమోదు కావడం మార్కెట్లకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఇదే కారణంతో అంతర్జాతీయంగానూ అన్ని మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగాయి. మరోవైపు దేశీయంగానూ బలమైన కార్పొరేట్‌ ఫలితాలు, ముడి చమురు ధరలు దిగువ స్థాయిల్లో కొనసాగుతుండడం, డాలర్‌ ఇండెక్స్‌ దిగిరావడం సూచీలకు కలిపొచ్చింది. 

* నిఫ్టీ ఉదయం 17,711.65 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,719.30 వద్ద గరిష్ఠాన్ని, 17,631.95 కనిష్ఠాన్ని తాకింది. చివరకు 124.25  పాయింట్ల లాభంతో 17,659.00 వద్ద స్థిరపడింది. 59,320.45 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 59,484.99 - 59,251.14 మధ్య కదిలింది. చివరకు 515.31 పాయింట్లు లాభంతో 59,332.60 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.57 వద్ద ట్రేడయ్యింది.

* సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా, విప్రో, ఎస్‌బీఐ, టీసీఎస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటన్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐటీసీ, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్‌, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ నష్టపోయిన స్టాక్స్‌ జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విశేషాలు..

* కిర్లోస్కర్‌ న్యూమాటిక్‌ షేర్లు ఈరోజు ఏడు శాతం మేర లాభపడ్డాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభాల్లో 130.13 శాతం వృద్ధి నమోదు కావడమే ఇందుకు కారణం.

* జూన్‌ త్రైమాసికంలో వండర్‌లా హాలిడేస్‌ బలమైన కార్పొరేట్‌ ఫలితాలను ప్రకటించింది. నికర లాభాలు రూ.8.51 కోట్ల నుంచి రూ.64.38 కోట్లకు చేరాయి. దీంతో కంపెనీ షేర్లు ఈరోజు 20 శాతం పెరిగి రూ.334.95 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ని తాకాయి.

* ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పీబీ ఫిన్‌టెక్‌ (పాలసీబజార్‌) ఆదాయం 100 శాతం పెరిగిన నేపథ్యంలో కంపెనీ షేర్లు ఈరోజు ఇంట్రాడేలో 5 శాతానికి పైగా లాభపడ్డాయి.

* ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు ఈరోజు ఇంట్రాడేలో దాదాపు 2 శాతం మేర లాభపడి 52 వారాల గరిష్ఠానికి చేరాయి. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.ఆరు లక్షల కోట్లు దాటింది. ఈ ఘనత సాధించిన ఏడో భారత కంపెనీగా ఐసీఐసీఐ బ్యాంక్‌ నిలిచింది. ఈ కంపెనీ షేరు ఈ ఏడాది ఇప్పటి వరకు 17 శాతం ఎగబాకింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని