Stock Market Update: అంతర్జాతీయ మార్కెట్ల అండతో రాణించిన దేశీయ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండోరోజైన గురువారం లాభాలతో ముగిశాయి....

Updated : 07 Jul 2022 15:55 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండోరోజైన గురువారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. ఇటీవలి కనిష్ఠాల నేపథ్యంలో కొనుగోళ్ల మద్దతుతోపాటు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మార్కెట్లకు కలిసొచ్చింది. బుధవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియగా.. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలూ అదే బాటలో పయనించాయి. మరోవైపు గురువారం ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు దిగిరావడం సూచీల సెంటిమెంటును పెంచింది. రూపాయికి దన్నుగా నిలిచేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగడమూ మదుపర్లను ఉత్సాహపర్చిన అంశం.

ఉదయం సెన్సెక్స్‌ 54,146.68 వద్ద లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 54,254.79 - 53,927.26 మధ్య ట్రేడయ్యింది. చివరకు 427.49 పాయింట్లు లాభపడి 54,178.46 వద్ద ముగిసింది. 16,113.75 వద్ద లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన నిఫ్టీ 16,150.50 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని, 16,045.95 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 143.10 పాయింట్లు ఎగబాకి 16,132.90 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో టైటన్‌, టాటా స్టీల్‌, ఎల్అండ్‌టీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, విప్రో, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభపడ్డ వాటిలో ఉన్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు నష్టపోయాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు...

* నైకా మాతృసంస్థ ఎఫ్‌ఎస్‌ఎన్‌ కామర్స్‌ వెంచర్స్‌ షేర్లు ఇంట్రాడేలో 5 శాతం వరకు లాభపడ్డాయి. పురుషుల విభాగంలోనూ తమ ఇన్నర్‌వేర్‌ బ్రాండ్లను తీసుకురానున్నట్ల ప్రకటించడమే దీనికి కారణం.

* సిబ్బంది వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇండిగో షేర్లు ఈరోజు 2 శాతం మేర లాభపడ్డాయి.

* టైటన్‌ కంపెనీ షేర్లు ఈరోజు ఇంట్రాడేలో 7 శాతం ఎగబాకాయి. కంపెనీ విక్రయాలు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారీగా పెరిగినట్లు ప్రకటించిన నేపథ్యంలో షేర్లు రాణించాయి.

* టార్సన్స్‌ ప్రోడక్ట్స్‌ షేర్లు ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరాయి. గతవారం రోజుల్లో ఈ కంపెనీ షేర్లు 20 శాతానికి పైగా ఎగబాకాయి. రానున్న కొన్నేళ్లలో ల్యాబ్‌వేర్‌ మార్కెట్‌ గణనీయంగా వృద్ధి చెందనున్నట్లు ఇటీవల ఓ ప్రముఖ నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కంపెనీ షేర్లు భారీగా లాభపడుతున్నాయి.

* ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఏకీకృత ఉత్పత్తి 16 శాతం పెరిగింది. దీంతో కంపెనీ షేర్లు ఈరోజు ఓ దశలో దాదాపు 4 శాతం మేర లాభపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు