Stock market: సూచీల్లో కొనసాగుతున్న లాభాల పరంపర 

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.....

Updated : 18 Jan 2022 09:51 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లకు సోమవారం సెలవు. ఆసియా మార్కెట్‌ సూచీలు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. దేశీయ సూచీల్లో గతకొన్ని రోజులుగా ప్రీ-బడ్జెట్‌ ర్యాలీ కొనసాగుతోంది. దీనికి తోడు మూడో త్రైమాసిక ఫలితాల సీజన్‌ కూడా సానుకూలంగా ఉండడంతో సూచీలు బలంగా ముందుకు సాగుతున్నాయి. నేడు బజాజ్‌ ఫైనాన్స్‌ క్యూ3 ఫలితాలు వెలువడనున్నాయి. మరోవైపు టెక్ మహీంద్రా రూ.2,800 కోట్లు విలువ చేసే కొనుగోళ్లను ప్రకటించింది. ఇక ఐపీఓ నిబంధనల్ని సెబీ మరింత కఠినతరం చేయడం కూడా నేడు సూచీలకు కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే దేశీయ మార్కెట్ సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అయితే, ఈ నెలలో ఇప్పటికే రెండు ప్రధాన సూచీలు 5 శాతానికి పైగా పెరిగిన నేపథ్యంలో గరిష్ఠాల వద్ద ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 145 పాయింట్ల లాభంతో 61,454 వద్ద.. నిఫ్టీ (Nifty) 35 పాయింట్లు లాభపడి 18,344 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.38 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 సూచీలో సన్‌ఫార్మా, ఐటీసీ, కోల్‌ఇండియా, టెక్‌ మహీంద్రా, ఐఓసీ, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్‌, బ్రిటానియా షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఐషర్‌ మోటార్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మారుతీ, శ్రీసిమెంట్స్‌, గ్రాసిమ్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

నేడు వార్తల్లో ఉండే అవకాశం ఉన్న స్టాక్‌లు...

* టెక్‌ మహీంద్రా: ఐటీ సంస్థ టెక్‌ మహీంద్రా.. ఐరోపాకు చెందిన కామ్‌ టెక్‌ కంపెనీ ఐటీలో (సీటీసీ) 100 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు సోమవారం ప్రకటించింది. ఈ సంస్థతో పాటు మరో 2 ఇన్సూర్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో 25 శాతం వాటాల్ని కూడా కలిపి 33 కోట్ల యూరోలు (సుమారు రూ.2,800 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలిపింది.

* టాటా పవర్‌ : కంపెనీ 100 మెగావాట్ల సామర్థ్యం గల రెండు రిన్యూవబుల్‌ ఎనర్జీ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చింది.

* ఐఐఎఫ్‌ఎల్‌: కంపెనీ జనవరి 27న సమావేశమై మధ్యంతర డివిడెండుపై నిర్ణయం ప్రకటించనుంది.

* హెచ్‌ఎఫ్‌సీఎల్‌ : కంపెనీ క్యూ3 ఫలితాలు వెలువడడ్డాయి. ఆదాయం 8.29 శాతం పెరిగి రూ.1215.21 కోట్లకు చేరింది. నికర లాభాలు మాత్రం 5.81 శాతానికి పడిపోయాయి. ఎబిట్‌డా (EBITDA) మార్జిన్లు 110 బేసిస్‌ పాయింట్లు తగ్గింది.

* కేర్‌ ఎడ్జ్‌ ‌: జనవరి 28న మధ్యంతర డివిడెండుపై కంపెనీ ప్రకటన చేయనుంది.

* చోలమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ : పేస్‌విఫ్‌తో కంపెనీ షేర్‌హోల్డర్ల అగ్రిమెంట్‌, షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకొంది. రూ.450 కోట్లకు మించకుండా అందులో పెట్టుబడులు పెట్టనుంది.

* తత్వ చింతన్‌ ఫార్మా కెమ్‌: క్యూ3 రిజల్ట్స్‌లో కంపెనీ ఆదాయం రూ.104.6 కోట్లకు పెరిగింది. వార్షిక ప్రాతిపదికన 31 శాతం వృద్ధి సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని