
Stock market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. వడ్డీ రేట్ల పెంపునకు ఫెడ్ సంకేతాలివ్వడంతో గురువారం భారీ నష్టాలు చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో కనిష్ఠాల వద్ద నేడు పరిమిత స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం ఉంది. గురువారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి.
దేశీయంగా చూస్తే గతకొన్ని రోజుల ట్రెండ్‌ను కొనసాగిస్తూ.. గురువారం కూడా విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) రూ.6,266.75 కోట్లు విలువ చేసే అమ్మకాలకు దిగారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DII) రూ.2,881.32 కోట్లు విలువ చేసే షేర్లు కొన్నారు. మరోవైపు దేశంలో కరోనా వ్యాప్తి స్థిరత్వానికి చేరుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో కేసులు తగ్గుముఖం పట్టడంతో వారాంతపు ఆంక్షల్ని ఎత్తివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్, బలమైన త్రైమాసిక ఫలితాలు వంటి పరిణామాలు కూడా నేడు మార్కెట్లను ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం 9:39 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 594 పాయింట్ల లాభంతో 57,871 వద్ద, నిఫ్టీ 189 పాయింట్లు లాభపడి 17,300 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.10 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క మారుతీ మినహా దాదాపు అన్ని షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, విప్రో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడుతున్న వాటిలో ఉన్నాయి.
నేడు వార్తల్లో ఉండే అవకాశం ఉన్న స్టాక్‌లు...
* లారస్ ల్యాబ్స్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి లారస్ ల్యాబ్స్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను నిరాశపరిచాయి. త్రైమాసిక ఆదాయం రూ.1,029 కోట్లు, నికరలాభం రూ.154 కోట్లు మాత్రమే నమోదయ్యాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.1,288 కోట్లు, నికరలాభం రూ.273 కోట్లు ఉండటం గమనార్హం. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 20 శాతం, నికరలాభం 44 శాతం తగ్గింది.
* టీవీఎస్ మోటార్: స్విట్జర్లాండ్‌కు చెందిన అతిపెద్ద ఇ-బైక్ కంపెనీ అయిన స్విస్ ఇ-మొబిలిటీ గ్రూప్ ఏజీ(ఎస్‌ఈఎమ్‌జీ)లో 75 శాతం వాటాను టీవీఎస్ మోటార్ కంపెనీ కొనుగోలు చేసింది. 100 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.750 కోట్లు) నగదును ఇందు కోసం వెచ్చించింది. ఐరోపాలో కార్యకలాపాలను విస్తరించడానికి కట్టుబడి ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
* కెనరా బ్యాంక్: డిసెంబరు త్రైమాసికంలో కెనరా బ్యాంక్ నికర లాభం రెట్టింపునకు పైగా పెరిగి రూ.1,502 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం పెరగడం, కేటాయింపులు తగ్గడం ఇందుకు తోడ్పడింది.
* పీఎన్బీ లాభం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్టాండలోన్ నికరలాభం రెట్టింపుకంటే అధికంగా రూ.1126.78 కోట్లకు చేరింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.23,298.53 కోట్ల నుంచి రూ.22,026.02 కోట్లకు తగ్గింది. స్థూల నిరర్థక ఆస్తులు 12.99 శాతం నుంచి 12.88 శాతానికి తగ్గితే, నికర ఎన్పీఏలు 4.03శాతం నుంచి 4.90 శాతానికి పెరిగాయి.
* సెంట్రమ్: కంపెనీ అనుబంధ సంస్థ యునిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. పీఎంసీ బ్యాంకుకు చెందిన 110 శాఖల్ని తన ఆధ్వర్యంలోకి తీసుకుంది.
* మోతీలాల్ ఓస్వల్: కంపెనీ ఒక్కో షేరుకు రూ.7 మధ్యంతర డివిడెండును ప్రకటించింది.
* ఈరోజు త్రైమాసిక ఫలితాలు వెల్లడించబోయే కంపెనీలు: ఎల్అండ్టీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, వేదాంత, 3ఐ ఇన్ఫోటెక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బజాజ్ హెల్త్‌కేర్, భారత్ ఎలక్ట్రానిక్స్, బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్, కేర్ రేటింగ్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చంబల్ ఫర్టిలైజర్స్, కెమ్‌ప్లాస్ట్ సన్మార్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, డిక్సన్ టెక్నాలజీస్, ఇన్ఫో ఎడ్జ్, టాటా కాఫీ.