Stock Market: బుల్‌ను పడేసిన బేర్‌.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తీవ్ర ఊగిసలాటలో ఉన్నాయి. ఈ ఉదయం భారీ లాభాల్లో ఉన్న సూచీలు.. మధ్యాహ్నానికి అమాంతం నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం

Updated : 16 Jun 2022 13:44 IST

ముంబయి: అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తీవ్ర ఊగిసలాటలో ఉన్నాయి. ఈ ఉదయం భారీ లాభాల్లో ఉన్న సూచీలు.. మధ్యాహ్నానికి అమాంతం నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మరింత పతనమయ్యాయి. సెన్సెక్స్‌ ఏకంగా 800 పాయింట్లు కోల్పోయి 52వేల మార్క్‌ కిందకు దిగజారింది. నిఫ్టీ కూడా 250 పాయింట్లు నష్టపోయింది. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో సెన్సెక్స్‌ 828.76 పాయింట్లు పతనమై 51,,712.63 వద్ద, నిఫ్టీ 260 పాయింట్ల నష్టంతో 15,431.25 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. రియల్టీ, లోహ రంగ సూచీలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి.

ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపునకు అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. అమెరికా మార్కెట్లు నిన్న లాభాలతో ముగిశాయి. దీంతో దేశీయ సూచీలు కూడా ఈ ఉదయం భారీ లాభాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉండటంతో కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో ఒక దశలో సెన్సెక్స్‌ ఏకంగా 600 పాయింట్లు పెరిగింది. అయితే, ఆ జోరు ఎంతోసేపు నిలవలేదు.

మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో పాటు అమెరికాలో మాంద్యం, ద్రవ్యోల్బణ భయాలు, దేశీయంగా కరోనా ఉద్ధృతి మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి. దీంతో ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు.. భారీగా నష్టాల్లోకి జారుకున్నాయి. నేటి సెషన్‌లో సెన్సెక్స్‌ దాదాపు 1400పాయింట్లకు పైగా కదలాడిందంటే మార్కెట్ల ఊగిసలాటను అర్థం చేసుకోవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని