Loans pay off: వేగంగా రుణాల‌ను తీర్చాలంటే...

అవసరాల కోసం తీసుకున్న అప్పుల్ని త్వరగా తీర్చడానికి ఏం చేయాలంటే... 

Updated : 20 Jun 2021 19:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌-19 ప్ర‌జ‌ల ఆరోగ్యాన్నే కాకుండా ఆర్థిక ప‌రిస్థితినీ దెబ్బ‌తీసింది. ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌లు విధించ‌డం, కొన్ని సంస్థలు వేత‌నాలు త‌గ్గించ‌డం, వ్యాపారాలు మూత‌ప‌డ‌డం లేదా స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో చాలామంది ఆదాయం త‌గ్గింది. దీంతో  గతంలో తీసుకున్న రుణాల‌ను ప్ర‌ణాళిక ప్ర‌కారం చెల్లించాల‌నుకున్న వారు కూడా స‌రైన స‌మ‌యానికి చెల్లించ‌లేక‌, ఆర్థికంగా ఒత్తిడికి గుర‌వుతున్నారు. ఇలాంటి ఇబ్బందుల‌ను మీరూ ఎదుర్కుంటున్నారా? అయితే ఇటువంటి ప‌రిస్థితులలో రుణాల‌ను స‌రిగ్గా నిర్వ‌హించేందుకు ఒక ప్ర‌ణాళిక అవ‌స‌రం. దీని కోసం ముఖ్యంగా ఒత్తిడికి గురుకాకుండా మ‌నోధైర్యంతో ఉండాలి. 

* నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం క‌ష్ట స‌మ‌యంలో రుణాల‌ను తెలివిగా మేనేజ్ చేయాలి. ఇందుకు రెండు స్ట్రాట‌జీలు ఉన్నాయి. మొద‌టిది చాలా మంది సాధార‌ణంగా అనుస‌రించే స్ట్రాట‌జీ. వ‌డ్డీ ఆధారంగా రుణాల‌ను రెండు భాగాలుగా విభ‌జించ‌డం. ఈ విధానంలో అధిక వ‌డ్డీ రుణాల‌ను ఒక కేట‌గిరికి, త‌క్కువ వ‌డ్డీ రుణాల‌ను మ‌రొక కేట‌గిరిలోకి తీసుకుంటారు. ముందుగా అధిక వ‌డ్డీ రుణాల‌పై దృష్టి సారించాలి.

ఉదాహ‌ర‌ణ‌కు... క్రెడిట్ కార్డు, వ్య‌క్తిగ‌త రుణాల్లో వ‌డ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. ముందుగా వీటిని క్లియ‌ర్ చేయాల్సి ఉంటుంది. దీంతో వ‌డ్డీ రూపంలో ఎక్కువ మొత్తం బ‌య‌టికి పోకుండా ఉంటుంది.

* మ‌రికొంత మందికి రివ‌ర్స్ స్ట్రాటజీ బాగా ప‌నిచేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ స్ట్రాట‌జీ ప్ర‌కారం అధిక వ‌డ్డీ రుణాల‌కు బ‌దులుగా సుల‌భంగా తీర్చ‌గ‌ల చిన్న చిన్న రుణాల‌ను ముందుగా క్లియ‌ర్ చేయాల్సి ఉంటుంది. 

ఉదాహ‌ర‌ణ‌కు... ఒక వ్య‌క్తికి రూ.35 వేల వినియోగ వ‌స్తువ‌ల రుణం (క‌న్జ్యూమ‌ర్ డ్యూర‌బుల్ లోన్), రూ.ల‌క్ష క్రెడిట్ కార్డు రుణం ఉంద‌నుకుందాం. క్రెడిట్ కార్డు రుణానికి బ‌దులు ముందుగా వినియోగ వ‌స్తువుల రుణాన్ని తీర్చాలి. 

* పై విధంగా చేయ‌డం వ‌ల్ల రుణ‌గ్ర‌హీత మిగిలిన రుణాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ‌గ‌ల‌డ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక మిగిలిన అన్ని రుణాల‌ను తీర్చేందుకు త‌క్కువ వ‌డ్డీతో ఎక్కువ మొత్తం రుణం తీసుకోవ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు... మీకు కారు, వ్య‌క్తిగ‌త, క్రెడిట్ కార్డు, గృహ రుణాలు ఉన్నాయ‌నుకుందాం. గృహ రుణం తీసుకున్న బ్యాంకు నుంచి టాప్‌-అప్ లోన్ తీసుకుని మిగిలిన రుణాలను (కారు, వ్య‌క్తిగ‌త‌, క్రెడిట్ కార్డు) క్లియ‌ర్ చేయ‌చ్చు.

* ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇత‌ర సెక్యూరిటీల‌లో డిపాజిట్లు ఉన్నవారు వాటిపై రుణాల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చు. క్రెడిట్ కార్డు, వ్య‌క్తిగ‌త రుణాల పోలిస్తే, వాటి ద్వారా త‌క్కువ వ‌డ్డీకే రుణాలు ల‌భిస్తాయి. 

ఈ రెండు స్ట్రాట‌జీల‌లో ఏది మీకు స‌రిపోతుందో మీరే నిర్ణ‌యించుకోవాలి. ఎక్కువ సంఖ్య‌లో రుణాలు ఉండి, స‌రైన స‌మ‌యంలో తీర్చ‌లేక‌పోతే భవిష్య‌త్తులో అప్పుల ఊబిలో చిక్కుకుపోయి, ఇబ్బందులు ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంద‌నే విషయం గుర్తుంచుకోండి. ప్ర‌ణాళిక ప్ర‌కారం తెలివిగా రుణాల తిరిగి చెల్లింపు ప్ర‌క్రియ‌ను పూర్తి చేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని