dollar: డాలర్‌ నవ్వింది..! ప్రపంచానికి ముచ్చెమటలు..!

డాలర్‌ ఎన్నడూ లేని విధంగా బలపడుతోంది.. కానీ, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా లేదు.. ఆ దేశ జీడీపీ, ద్రవ్యోల్బణం సూచీలు ఆందోళనకరంగా ఉన్నాయి. మరోవైపు ప్రపంచ ప్రధాన కరెన్సీలు

Updated : 28 Sep 2022 13:59 IST

* రూపాయి విలువ రికార్డు స్థాయి పతనం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

డాలర్‌ ఎన్నడూ లేని విధంగా బలపడుతోంది.. కానీ, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా లేదు.. ఆ దేశ జీడీపీ, ద్రవ్యోల్బణం సూచీలు ఆందోళనకరంగా ఉన్నాయి. మరోవైపు ప్రపంచ ప్రధాన కరెన్సీలు విలువను కోల్పోతున్నాయి. ఇటీవల పౌండ్‌, యూరో వంటి కరెన్సీలు డాలర్‌తో పోలిస్తే భారీగా విలువ కోల్పోయాయి. మరో వైపు భారత రూపాయి పతనమై దాదాపు వారం వ్యవధిలోనే రూ.82 సమీపంలోకి చేరింది. వరుసగా ఏడు వారాల నుంచి భారత్‌ విదేశీ మారకపు నిల్వలు కుంగుతూ రెండేళ్ల అత్యల్పానికి చేరాయని ఇటీవల ఆర్బీఐ వెల్లడించడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. వాస్తవానికి గతేడాది నుంచి డాలర్‌ క్రమంగా బలపడుతూ వస్తున్నా.. ఇటీవల కాలంలో దీని వేగం పెరిగిపోయింది.

డాలర్‌ స్మైల్‌..!

ఆర్థికవేత్తలు, ఈక్విటీ వ్యూహకర్తలు ప్రస్తుతం డాలర్‌ పెరుగుదలను ‘డాలర్‌ స్మైల్‌’ థియరీతో అన్వయించి చూస్తున్నారు. ఈ సూత్రాన్ని ఐఎంఎఫ్‌ మాజీ ఆర్థికవేత్త స్టీఫెన్‌ జెన్‌ ప్రస్తావించారు. దీని ప్రకారం అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు గానీ లేదా అత్యంత బలహీనంగా (ద్రవ్యోల్బణం, భయాందోళనలు) ఉన్నప్పుడు గానీ.. ప్రపంచ వృద్ధి మందగించినప్పుడు గానీ.. డాలర్‌ విలువ బాగా పెరుగుతుంది. మదుపర్లు ప్రపంచ ఆర్థిక సవాళ్లు, అస్థిరత నుంచి తమ పెట్టుబడులను కాపాడుకోవడం కోసం డాలర్‌ను ఎంచుకొంటారు. సాధారణంగా డాలర్‌ పెరుగుదలను ‘డీఎక్స్‌వై’(DXY) సూచీ ఆధారంగా తెలుసుకొంటారు. ప్రస్తుతం దీని ప్రకారం డాలర్‌ డిమాండ్‌ గత 22 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఉందని అర్థమవుతోంది.

అమెరికా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. దీనికి తోడు ఆ దేశ కరెన్సీ డాలరే ప్రపంచంలో అతిపెద్ద రిజర్వు నగదుగా చలామణీ అవుతోంది. అంతర్జాతీయ వర్తకానికి ఇదే ఆక్సిజన్‌. ఐఎంఎఫ్‌ లెక్కల ప్రకారం 149 దేశాలు 7 ట్రిలియన్ల మేరకు డాలర్ల రిజర్వులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఏం జరిగినా అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తుంది. ప్రస్తుతం అమెరికా 40 ఏళ్లలోనే అతి తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. దీనిని అదుపు చేయడానికి ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచుకుంటూ పోతోంది. ఇది ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చనే భయాలు ఉన్నాయి. ఇది ప్రపంచంపై పెను ప్రభావం చూపించవచ్చు. డాలర్‌ విలువ తక్కువ ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు బలంగా ఉన్నాయి. ఉదాహరణకు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల సూచీ ఎంఎస్సీఐ ఈఎం 2021 ఫిబ్రవరిలో 1446 పాయింట్లు ఉండగా.. అక్కడి నుంచి 31శాతం కుంగి సెప్టెంబర్‌ 2022 నాటికి 906 పాయింట్లకు చేరింది. అదే సమయంలో డీఎక్స్‌వై 90 నుంచి 113 పాయింట్లకు చేరింది. 

డాలర్‌ విలువ పెరుగుదలకు కారణాలు

* అమెరికాలో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు

* అత్యధిక వడ్డీరేట్లను సుదీర్ఘ కాలం ఉంచుతామని ఫెడ్‌ ఛైర్మన్‌ జోరమ్‌ పావెల్‌ పేర్కొనడం

* ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే అమెరికా ఫెడ్‌ వేగంగా వడ్డీ రేట్లను పెంచుతోంది. మిగిలిన దేశాల వడ్డీరేట్లు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇది డాలర్‌కు బలంగా మారింది.

* సుదీర్ఘ కాలం నుంచి జరుగుతోన్న రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరత వైపు నెడుతోంది. ఇది చాలా కమోడిటీ మార్కెట్లలో ధరలను పెంచేస్తోంది. ఇది దవ్యోల్బణానికి దారి తీస్తోంది. ఐరోపాకు గ్యాస్‌ సరఫరా కోత భయాలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి.

* అమెరికా ఆర్థికంగా, సైనికంగా సూపర్‌ పవర్‌. అతిపెద్ద నగదు మార్కెట్‌. డాలర్‌ ప్రపంచ కరెన్సీ. ఇవన్నీ పెట్టుబడులకు అనుకూలమైన వేదికను సృష్టించాయి. ఫలితంగా డాలర్‌ విలువ పెరుగుతోంది.

కరుగుతున్న భారత్‌ ఫారెక్స్‌ రిజర్వు..

గత వారం రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం మన ఫారెక్స్‌ రిజర్వు కుంగి 545 బిలియన్‌ డాలర్లకు చేరింది. రష్యా యుద్ధం మొదలైన నాటితో పోలిస్తే ఏకంగా 86 బిలియన్‌ డాలర్ల మేరకు ఈ నిల్వలు కరిగిపోయాయి.

* భారత్‌ దిగుమతులు ఎగుమతుల కంటే ఎక్కువ. భారత్‌ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులే తీరుస్తున్నాయి. వీటికి డాలర్లలోనే చెల్లింపులు చేయాల్సి ఉండటం భారంగా మారింది.  డాలర్‌ పోటు తట్టుకోవడానికి ఇటీవల భారత్‌-సౌదీ రూపాయల్లో ట్రేడింగ్‌ చేయడంపై కూడా చర్చించాయి.

* పడిపోతున్న రూపాయి విలువ కాపాడేందుకు ఆర్‌బీఐ కొన్ని డాలర్లను విక్రయించాల్సిన పరిస్థితులు కూడా తలెత్తున్నాయి.

* ఫారెన్‌ పోర్టు ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి వైదొలగడం కూడా డాలర్‌ ధరను పెంచేస్తోంది. తాజాగా రూపాయి విలువ ఆల్‌టైమ్‌ కనిష్ఠమైన రూ.81.93కు చేరింది. కాకపోతే భారత ఎగుమతి దారులు ఈ పరిస్థితుల్లో లబ్ధిపొందుతారు. 

అమెరికా సహా ప్రపంచానికి ఇబ్బందే..

డాలర్‌ విలువ పెంపు అమెరికాకు అయాచిత వరమేమీకాదు. అమెరికా మల్టీ నేషనల్‌ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ. విదేశీ కరెన్సీల్లో సంపాదించిన మొత్తాన్ని డాలర్లలోకి మారిస్తే తక్కువ మొత్తం లభిస్తుంది. 

* అమెరికా ఎగుమతులు మరింత ఖరీదైనవిగా మారతాయి. ఇది అక్కడి దేశీయ తయారీదార్లకు శరాఘాతంగా మారుతుంది. 

* విదేశాల నుంచి అమెరికా వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోతోంది. వారి కరెన్సీలకు తక్కువ డాలర్లు లభించడమే దీనికి ప్రధాన కారణం. 

ఫారెక్స్‌ ఇబ్బందుల్లో యూకే..?

అమెరికా ఆత్మీయ దేశమైన యూకేలో కరెన్సీ సంక్షోభం తలెత్తే ముప్పు పొంచి ఉంది.  ఇటీవల బ్రిటన్‌ పౌండ్‌ విలువ రికార్డు స్థాయిలో పడిపోతోంది. దీనిని అడ్డుకోవడానికి కూడా బ్రిటన్‌ ఎదుట చాలా స్వల్ప మార్గాలు మాత్రమే ఉన్నాయి. జపాన్‌ వంటి దేశాలు సొంత కరెన్సీలను కొనుగోలు చేసి విలువను కాపాడుకొంటాయి. ఎందుకంటే వాటి వద్ద డాలర్లు విదేశీ కరెన్సీ నిల్వల రూపంలో ఉంటాయి. కానీ, బ్రిటన్‌కు ఆ అవకాశం లేదు. బ్రిటన్‌ వద్ద కేవలం 80 బిలియన్ల డాలర్ల మేరకు మాత్రమే ఫారెక్స్‌ నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలు కూడా 12 నెలల నుంచి పతనం అవుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పౌండ్‌ పతనాన్ని కాపాడటానికి ఇవి ఏమాత్రం చాలవు. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఆధారంగా ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉంటుంది. కానీ, విదేశీ రిజర్వుల పరిమాణాల్లో బ్రిటన్‌ది 18వ స్థానం. బ్రిటన్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో మొత్తం 43.8శాతం మాత్రమే డాలర్లు, యూరోలు. మిగిలినవి ఐఎంఎఫ్‌ రైట్స్‌, జపాన్‌ యెన్‌, చైనా యువాన్‌, బంగారం తదితర రూపంలో ఉన్నాయి. దీంతో పౌండ్‌ పతనం ఆపడంపై యూకే మల్లగుల్లాలు పడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని