KPMG survey: నియంత్రణ పటిష్ఠమైనా మోసాలు తగ్గట్లేదు: కేపీఎంజీ సర్వే

నియంత్రణ చర్యల్లో పలు మార్పులు చేసినా, మోసాల సంఖ్య తగ్గడం లేదని తమ సర్వేలో పాల్గొన్న వాళ్లలో ఎక్కువ మంది వెల్లడించినట్లు కేపీఎంజీ వెల్లడించింది.

Published : 16 Jun 2024 02:57 IST

దిల్లీ: నియంత్రణ చర్యల్లో పలు మార్పులు చేసినా, మోసాల సంఖ్య తగ్గడం లేదని తమ సర్వేలో పాల్గొన్న వాళ్లలో ఎక్కువ మంది వెల్లడించినట్లు కేపీఎంజీ వెల్లడించింది. వినియోగదారు సంబంధిత రంగాల్లోని (ఎఫ్‌ఎమ్‌సీజీ, వినియోగ వస్తువులు, వ్యవసాయం, రిటైల్, ఇ-కామర్స్‌) పలు సంస్థల నుంచి 75 మందికి పైగా ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయాలు సేకరించారు. ఆ వివరాలు ఇలా.. 

  • నియంత్రణపరమైన మార్పులు చోటుచేసుకున్నా మోసాల సంఖ్య తగ్గలేదని వీళ్లలో 79 శాతం మంది వెల్లడించారు. కేవలం 21 శాతం మంది ఈ మార్పులు కారణంగా మోసాల సంఖ్య తగ్గినట్లు తెలిపారు. 
  • సంగ్రహణ, విక్రయాలు, పంపిణీ, ఇ-కామర్స్‌ విభాగాల్లో ఎక్కువగా మోసాలు జరిగేందుకు ఆస్కారం ఉందని సర్వేలో ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. 
  • మోసాల కారణంగా సంస్థ పేరు- ప్రతిష్ఠలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని 72 శాతం మంది వెల్లడించగా.. ఆర్థికపరంగా కలిగే నష్టాలు కూడా సంస్థలపై ప్రభావం చూపుతాయని 16 శాతం మంది చెప్పారు. 
  • మోసాల గుర్తింపు, నియంత్రణకు సాంకేతికత ఆధారిత హెచ్చరిక సంకేత వ్యవస్థ ఏర్పాటే అత్యంత సరైన చర్య అని భావిస్తున్నట్లు 61 శాతం మంది తెలిపారు. 
  • ‘వినియోగ సంబంధిత రంగాల్లో గణనీయ మార్పులు చోటుచేసుకోవడమే కాకుండా వేగవంత వృద్ధి నమోదవుతోంది. అదే సమయంలో మోసాల సంఖ్య కూడా ఈ రంగాల్లో బాగానే పెరుగుతున్నాయి. ఈ మోసాల కారణంగా సంస్థలకు ఆర్థికపరంగా నష్టాలు వాటిల్లుతున్నాయి’ అని కేపీఎంజీ పార్ట్‌నర్‌ (ఫోరెన్సిక్‌ సర్వీసెస్‌) ముస్తఫా సుర్కా తెలిపారు. సాంకేతికతతో పాటు బలమైన పర్యవేక్షణా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంపై పెట్టుబడులు పెట్టడం ద్వారా క్రమక్రమంగా ఈ మోసాలను సంస్థలు నియంత్రించుకునే వీలుంటుందని సుర్కా అభిప్రాయపడ్డారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని