Credit Card: స్టూడెంట్ క్రెడిట్ కార్డు.. ఎవ‌రు అర్హులు?

విద్యార్థుల‌ ఆర్థిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఈ క్రెడిట్ కార్డుల‌ను రూపొందించి అందిస్తున్నాయి.  

Updated : 24 Aug 2022 14:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు (Credit card) వాడ‌కం స‌ర్వ‌సాధార‌ణమైపోయింది. క్రెడిట్ కార్డు వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తున్న దృష్ట్యా చాలా మంది వీటిని వాడుతున్నారు. సాధార‌ణంగా ఆదాయం ఉన్న వారికి మాత్ర‌మే కార్డు జారీ సంస్థ‌లు/బ్యాంకులు క్రెడిట్ కార్డుల‌ను ఆఫ‌ర్ చేస్తుంటాయి. కానీ కొన్ని బ్యాంకులు విద్యార్థుల‌కు కూడా క్రెడిట్ కార్డుల‌ను అందిస్తున్నాయి. విద్యార్థుల‌ ఆర్థిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఈ క్రెడిట్ కార్డుల‌ను రూపొందించి కాలేజీ లెవ‌ల్ విద్యార్థుల‌కు అందిస్తున్నాయి. 

అర్హ‌త‌

విద్యార్థుల‌కు సంపాద‌న ఉండ‌దు కాబ‌ట్టి సాధార‌ణంగా స్టూడెంట్ క్రెడిట్ కార్డుల‌కు ఆదాయం అర్హ‌తగా చూడ‌రు. కానీ, ద‌ర‌ఖాస్తుదారు వ‌య‌సు 18 సంవ‌త్స‌రాల‌కు పైబ‌డి ఉండాలి. ఇత‌ర‌ అర్హ‌త ప్ర‌మాణాలు వేరు వేరు బ్యాంకులకు వేరు వేరుగా ఉండొచ్చు. స్టూడెంట్ క్రెడిట్ కార్డులు భార‌త్‌లో ప‌రిమితంగానే అందుబాటులో ఉన్నాయి. విద్యా రుణాల రూపంలో బ్యాంకులు/ఆర్థిక సంస్థ‌లు విద్యార్థుల‌కు ఆర్థికంగా స‌హాయ‌ప‌డుతున్నాయి. వీటికి తోడు సెక్యూర్ క్రెడిట్ కార్డులు, స్టూడెంట్ ఫారెక్స్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి.

క్రెడిట్ కార్డు కోసం బ్యాంకుకి స‌మ‌ర్పించాల్సిన‌ ప‌త్రాలు..

  • పాన్‌/ప్ర‌భుత్వం జారీచేసిన ఏదైనా ఫోటోతో కూడిన‌ గుర్తింపు ప‌త్రం
  • ఆధార్/ప్ర‌భుత్వ ఆమోదం ఉన్న నివాస ధ్రువ ప‌త్రం
  • పుట్టిన తేదీ ధ్రువీక‌ర‌ణ కోసం జ‌న్మ న‌మోదు ప‌త్రం
  • కాలేజీ యాజ‌మాన్యం జారీచేసిన గుర్తింపు కార్డు లేదా కాలేజీలో చ‌దువుతున్న‌ట్లు ధ్రువీక‌రించే ఎన్‌రోల్‌మెంట్ రుజువు
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి?

ద‌ర‌ఖాస్తు విధానం మీరు ఎంచుకునే క్రెడ‌ట్ కార్డును బ‌ట్టి ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉంటే క్రెడిట్ కార్డును జారీచేస్తున్నాయి. మ‌రికొన్ని బ్యాంకులు త‌మ బ్యాంకులలో విద్యారుణం ఉన్న‌వారికి క్రెడిట్ కార్డు ఆఫ‌ర్ చేస్తున్నాయి.

యాడ్‌-ఆన్ కార్డు..

మీరు 18 సంవ‌త్స‌రాలు నిండిన వారైతే, కుటుంబంలో సంపాదించే వ్య‌క్తి సాధార‌ణ క్రెడిట్ కార్డుకి అనుబంధంగా యాడ్‌-ఆన్ కార్డు కోసం దర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. బేసిక్ కేవైసీ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించ‌డం ద్వారా ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ సుల‌భంగా పూర్త‌వుతుంది. యాడ్‌-ఆన్ కార్డుల‌లో బిల్లు చెల్లింపు బాధ్య‌త ప్రాథ‌మిక కార్డుదారునిపై ఉంటుంది.

సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్‌..

ఇందుకోసం మీరు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను తెర‌వాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే మీకు బ్యాంకులో ఎఫ్‌డీ ఖాతా ఉంటే.. దాని ఆధారంగా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు కోసం దర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

స్టూడెంట్ లోన్ ఉన్న‌వారు..

ఇప్ప‌టికే బ్యాంకులో విద్యారుణం తీసుకుని ఉంటే.. మీరు స్టూడెంట్ క్రెడిట్ కార్డును పొంద‌వ‌చ్చు. దీనికి ఉదాహ‌ర‌ణ ఎస్‌బీఐ అందించే ఎస్‌బీఐ స్టూడెంట్ ప్ల‌స్ అడ్వాంటేజ్ క్రెడిట్ కార్డు.

స్టూడెంట్ కార్డు ఫీచ‌ర్లు..

  • ఇత‌ర క్రెడిట్ కార్డుల‌తో పోలిస్తే.. స్టూడెంట్ కార్డుల‌పై బ్యాంకులు ఆఫ‌ర్ చేసే క్రెడిట్ ప‌రిమితి త‌క్కువ‌గా ఉంటుంది. స్టూడెంట్ కార్డులు స‌గ‌టున రూ. 15 వేల ప‌రిమితితో వ‌స్తాయి. కార్డు హోల్డ‌ర్లు ప‌రిమితికి మించి ఖ‌ర్చు చేయ‌కుండా ఇది నియంత్రిస్తుంది. 
  • స్టూడెంట్ క్రెడిట్ కార్డుల కాల‌ప‌రిమితి సాధార‌ణంగా 5 సంవ‌త్స‌రాలు ఉంటుంది. 
  • ఒక‌వేళ విద్యార్థులు క్రెడిట్ కార్డు పోగొట్టుకుంటే.. ఉచితంగా/నామ‌మాత్ర‌పు రుసుముల‌తో డూప్లికేట్ కార్డును పొంద‌వ‌చ్చు.
  • చాలా వ‌ర‌కు స్టూడెంట్ క్రెడిట్‌ కార్డుల‌ను జాయినింగ్ ఫీజు లేకుండానే జారీ చేస్తారు. వార్షిక రుసుము కూడా చాలా త‌క్కువ‌గా ఉంటుంది. విద్యార్థులు సుల‌భంగా నిర్వ‌హించ‌గ‌లిగేలా రుసుములు ఉంటాయి.
  • ద‌ర‌ఖాస్తు ప్ర్ర‌క్రియ కూడా సుల‌భంగానే ఉంటుంది. క‌నీస ప‌త్రాల‌ను ఇచ్చి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిచేయ‌వ‌చ్చు. 
  • కార్డు ఉప‌యోగించి చేసే ఖ‌ర్చుపై రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు వంటివి ల‌భిస్తాయి. 
  • కార్డుదారులు తమ కార్డు వాడుతున్న సమయంలో ఎప్పుడైనా.. కావాల్సిన ప్ర‌తాల‌ను ఇచ్చి స్టూడెంట్ కార్డు నుంచి సాధార‌ణ క్రెడిట్ కార్డుకు అప్‌గ్రేడ్ చేసుకోవ‌చ్చు. 

చివ‌రిగా..

ఈ కార్డుల‌తో విద్యార్థులు వారి ఖర్చుల‌ను సుల‌భంగా నిర్వ‌హించ‌వ‌చ్చు. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖ‌ర్చుపై రివార్డు పాయింట్లు ల‌భిస్తాయి. కాబ‌ట్టి స్టూడెంట్ స్థాయి నుంచే ఖ‌ర్చుల‌ను స‌మ‌ర్థ‌ంగా నిర్వ‌హించ‌గలుగుతారు. మంచి క్రెడిట్ స్కోరు కూడా సాధించ‌గులుగుతారు.

గ‌మ‌నిక‌: స్టూడెంట్ క్రెడిట్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేవారికి ఆదాయ ధ్రువీక‌ర‌ణ అవ‌స‌రం ఉండ‌దు. చ‌దువుకుంటూనే ఉద్యోగం కూడా చేస్తున్న విద్యార్థులకు కొన్ని బ్యాంకులు రెగ్యుల‌ర్ క్రెడిట్ కార్డును ఆఫ‌ర్ చేస్తుంటాయి. ఇటువంటి కార్డు తీసుకునేవారు ఆదాయ ధ్రువ ప‌త్రాలు (శాల‌రీ స్లిప్‌, ఐటీఆర్‌, బ్యాంకు స్టేట్‌మెంట్ వంటివి) చూపించాలి. బ్యాంకు/క్రెడిట్ జారీ సంస్థ‌ను అనుస‌రించి, ఎంచుకున్న కార్డును బ‌ట్టి క్రెడిట్ కార్డు ఫీచ‌ర్లు కూడా మారుతుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని