Health Insurance: ఆరోగ్య బీమాలో సబ్‌ లిమిట్స్‌తో షాక్‌ తగలొచ్చు.. జాగ్రత్త!

ఉప-పరిమితులతో అధిక మొత్తంలో ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ కొంత మొత్తం సొంతంగా ఖర్చుపెట్టాల్సి రావచ్చు.

Published : 26 Nov 2022 18:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య బీమా ప్రస్తుతం తప్పనిసరి అవసరంగా మారింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు డబ్బు కోసం ఇబ్బంది పడకుండా ఆరోగ్య బీమా సాయపడుతుంది. చాలా మంది పాలసీనయితే కొనుగోలు చేస్తున్నారు కానీ పాలసీకి వర్తించే నియమనిబంధనలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఒక్కోసారి అధిక మొత్తంలో బీమా కవరేజీ ఉన్నా క్లెయిం సమయంలో కొంత జేబు నుంచి ఖర్చు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా పాలసీకి వర్తించే ఉప-పరిమితులతో (సబ్‌- లిమిట్స్‌) ఈ సమస్య వస్తుంది. కాబట్టి భవిష్యత్‌లో ఇబ్బంది పడకుండా ఉప-పరిమితుల గురించి తెలుసుకోవడం మంచిది.

ఉప-పరిమితులు అంటే..?

ఏదైనా వ్యాధి కారణంగా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే వైద్యం కోసం అయ్యే ఖర్చును ఎంత వరకు చెల్లించాలో ముందుగానే నిర్ణయించడమే ఉప-పరిమితి. బీమా సంస్థ ముందుగా నిర్ణయించిన మేరకు మాత్రమే ఖర్చులను చెల్లిస్తుంది. బీమాదారుడు మిగిలిన మొత్తాన్ని స్వయంగా చెల్లించాలి. అంటే బీమా సంస్థ బాధ్యతను ఉప-పరిమితులు తగ్గిస్తాయి.

ఉదాహరణకు.. సురేష్‌ ఐదేళ్ల క్రితం రూ. 5 లక్షల బీమా మొత్తంతో ప్రసూతి వైద్య ఖర్చులను కూడా కవర్‌ చేసే పాలసీ తీసుకున్నాడు. దీని కోసం ఏడాదికి రూ.12 వేల ప్రీమియం చెల్లిస్తున్నాడు. ప్రస్తుతం అతడి భార్య మొదటి బిడ్డ ప్రసవం కోసం ఆసుప్రతిలో చేరగా అయిన ఖర్చు రూ. 80 వేలు. ఇందులో రూ. 50 వేలు మాత్రమే బీమా సంస్థ కవర్‌ చేస్తుందని, మిగిలినవి తనే చెల్లించాలని తెలిసి అతడు షాకయ్యాడు. ఎందుకంటే ప్రసూతి ఖర్చులపై బీమా పాలసీలో రూ.50 వేల సబ్‌-లిమిట్‌ ఉంది. దీంతో రూ.5 లక్షల కవరేజీ ఉన్నా.. ఉప-పరిమితి నియమం ఉండడం వల్ల సురేష్‌ రూ.30 వేలు తన పొదుపు నుంచి చెల్లించాల్సి వచ్చింది. అంతేకాకుండా ప్రసూతి ఖర్చులకు నాలుగు సంవత్సరాల వరకు వెయిటింగ్‌ పీరియడ్‌ ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల పాలసీ తీసుకునే ముందే ఈ నిబంధనలను తెలుసుకోవాలి. 

ఉప-పరిమితి వీటిపై వర్తించవచ్చు..

గది అద్దెపై: సాధారణంగా ఆరోగ్య బీమాలో గది అద్దె కూడా కవరవుతుంది. ఒకవేళ గది అద్దెపై ఉప-పరిమితి ఉంటే.. పాలసీలో పేర్కొన్న నిర్దిష్ట మొత్తం/శాతం వరకే గది అద్దె చెల్లిస్తారు. అంతకంటే ఎక్కువగా ఉంటే మిగిలిన మొత్తాన్ని పాలసీదారుడే చెల్లించాలి. ఉదాహరణకు ఆరోగ్య బీమా ప్లాన్‌లో రోజుకు చెల్లించే గది అద్దెపై రూ.2000 వేలు పరిమితి ఉందనుకుందాం. మీరు ఆసుపత్రిలో చేరినప్పుడు రూ.4000 గది అద్దె ఛార్జ్‌ చేస్తే.. పై రెండు వేల రూపాయిలు మీరే చెల్లించుకోవాలి. కొన్ని పాలసీలు బీమా హామీ మొత్తంలో గది అద్దెను 1 శాతానికి పరిమితం చేస్తాయి. అంటే మీకు రూ.5 లక్షల పాలసీ ఉంటే.. రూ. 5000 వరకు మాత్రమే గది అద్దె చెల్లిస్తాయి. 

ఒక్కోసారి ఆసుపత్రి గది రకాన్ని కూడా ఉప-పరిమితి కిందకి తీసుకురావచ్చు. సాధారణ రూమ్‌, ఏసీ రూమ్‌, జాయింట్‌ రూమ్‌, ప్రైవేట్‌ రూమ్‌ ఇలా వివిధ రకాల గదులు ఉంటాయి. జాయింట్‌గా లేదా సాధారణంగా ఉండే గదులను పాలసీకి లింక్‌ చేయవచ్చు. అంతేకాకుండా ఎంచుకునే గది రకంతో పాటు వైద్యుడి సంప్రదింపుల ఛార్జీలు, నర్స్ ఛార్జీలు వంటివి కూడా పెరుగుతాయని గమనించాలి. కాబట్టి, వీలైనంత వరకు ఉప పరిమితి లో పేర్కొన్న గదిని మాత్రమే ఎంచుకోవడం మంచిది. ఒకవేళ ఏసీ, ప్రైవేటు గదులను పాలసీకి చేర్చాలంటే అదనపు ప్రీమియం చెల్లించాలని బీమా సంస్థలు కోరవచ్చు.

కొన్ని చికిత్సలపై: కొన్ని చికిత్సలకు అయ్యే ఖర్చులపై ఉప-పరిమితులను చేర్చుతారు. దీంతో కవరేజీ మొత్తం అధికంగా ఉన్నా.. ఆయా వ్యాధుల చికిత్సలకు పాలసీలో పేర్కొన్న మేరకు మాత్రమే కవరేజీ లభిస్తుంది. పైన తెలిపిన విధంగా ప్రసూతి చికిత్సలతో పాటు కంటిశుక్లం, మోకాలు సర్జరీ, కీమోథెరపీ వంటి వాటికి ఎక్కువగా ఉప-పరిమితులు వర్తిస్తుంటాయి. అనారోగ్యాల జాబితా, ఉప-పరిమితులు అన్ని పాలసీలకు ఒకేలా ఉండవు. కాబట్టి పాలసీ తీసుకునేముందు వీటిని తప్పనిసరిగా చూడాలి.  

ఇతర ఖర్చులు: ఐసీయూ, అంబులెన్స్‌ ఛార్జీలు, ఇంటి వద్ద చికిత్సలు, ఓపీడీ తదితర వాటిపైనా బీమా సంస్థలు ఉప-పరిమితులను విధించే అవకాశం ఉంది. కొన్ని పాలసీలు ఆసుపత్రిలో చేరక ముందు, చేరిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు అయిన ఖర్చులను చెల్లిస్తాయి. వీటిపై కూడా పరిమితిలు విధించే అవకాశం ఉంది. 

చివరిగా..

బీమా ప్రీమియం తగ్గించుకునేందుకు చాలా మంది ఉప-పరిమితులు ఉన్నప్పటికీ పాలసీ కొనుగోలు చేస్తుంటారు. అయితే వీటి వల్ల ఆసుపత్రిలో చేరినప్పుడు చేతి నుంచి ఖర్చుపెట్టక తప్పకపోవచ్చు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఉప-పరిమితులు లేని, లేదా తక్కువగా ఉన్న పాలసీని ఎంచుకోవడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని