Education Loan: విద్యా రుణాలపై సబ్సిడీలు

దేశంలో కొన్ని తరగతుల విద్యార్థులకు విద్యా రుణాల వడ్డీల్లో సబ్సిడీని అందజేసే పథకాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

Updated : 09 Dec 2022 16:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చదువుకు అయ్యే ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులకు, ఇతర ఖర్చులకు వారు భద్రపరచుకున్న నగదునే కాకుండా అప్పులు చేసి మరీ ఖర్చు పెడుతుంటారు. దీనికి తగ్గట్టుగా ఏటా విద్యా ద్రవ్యోల్బణం కూడా 10-12% పైనే ఉంటోంది. తమ వద్ద నగదు లేకున్నా సరే బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుంటున్నారు. బ్యాంకులు కూడా ఈ రుణాలను విరివిగానే ఇస్తున్నాయి. అయితే, విద్యా రుణాలపై ప్రభుత్వం కొన్ని వర్గాలకు వారి అర్హతలను బట్టి రాయితీలను ఇస్తోంది. ఈ రాయితీ పథకాలు పాతవే అయినప్పటికీ స్వదేశంలో, విదేశాల్లో విద్యా రుణాలు తీసుకుని విద్యనభ్యసించేవారు ఈ పథకాల గురించి తప్పక తెలుసుకోవాలి.

సెంట్రల్‌ సెక్టార్‌ వడ్డీ రాయితీ పథకం (Central Sector Interest Subsidy Scheme)

మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ 2009లో ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ వడ్డీ రాయితీ పథకం భారత్‌లోని సాంకేతిక/ ప్రొఫెషనల్‌ కోర్సులకు మాత్రమే వర్తిస్తుంది. విదేశాల్లో విద్య కోసం తీసుకునే రుణాలపై ఈ పథకం ద్వారా రాయితీని పొందలేరు. ఈ పథకం కొంత సమయానికి పూర్తి వడ్డీ రాయితీని అందిస్తుంది. అంటే, మారటోరియం వ్యవధిలో విధించే వడ్డీ మాఫీ చేస్తారు. ఈ పథకం అండర్‌ గ్రాడ్యుయేట్‌ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు ఒకసారి మాత్రమే వర్తిస్తుంది. దీనికింద ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు చేసినవారు కూడా అర్హులే. పూచీకత్తు, థర్డ్‌-పార్టీ గ్యారెంటీ లేకుండా రూ.7.50 లక్షల వరకు తీసుకున్న విద్యా రుణాలకు ఈ పథకం కింద అర్హత ఉంటుంది. ఈ పథకంలో రాయితీని పొందేందుకు తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.4.50 లక్షలు మించకుండా ఉండాలి.

పధో పరదేశ్‌ విద్యా రుణ వడ్డీ రాయితీ పథకం (Padho Pardesh Education Loan Interest Subsidy Scheme)

2006లో ఏర్పాటైన ఈ పథకం నోటిఫైడ్‌ మైనారిటీ కమ్యూనిటీలలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు విదేశాల్లో మెరుగైన ఉన్నత విద్యావకాశాలను అందించడానికి, వారి ఉపాధిని మెరుగుపరచడానికి వడ్డీ రాయితీని అందిస్తుంది. Masters, M.Phil/Ph.Dలో విదేశీ విద్య అధ్యయనాలలో చేరిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. ఒకసారి మాత్రమే ఈ పథకం కింద అర్హత ఉంటుంది. విద్యార్థులు తమ అధ్యయనానికి సంబంధించి ఒకటో ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. మారటోరియం వ్యవధిలో వడ్డీ మాఫీ చేస్తారు. మారటోరియం వ్యవధి ముగిసిన తర్వాత, విద్యార్థులు బకాయి ఉన్న రుణ మొత్తంపై వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. ఈ పథకానికి అర్హత పొందాలంటే.. తల్లిదండ్రుల ఆదాయం, ఉద్యోగం ఉన్న విద్యార్థుల ఆదాయం ఏడాదికి రూ.6 లక్షలకు మించకూడదు.

డా.అంబేడ్కర్‌ సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ సబ్సిడీ

ఈ పథకం ఇతర వెనుకబడిన తరగతుల (OBC), ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (EBC) విద్యార్థులకు విద్యాపరమైన పురోగతిని ప్రోత్సహిస్తోంది. విదేశాల్లో Masters, M.Phil/Ph.D చదివే విద్యార్థులకు విద్యా రుణాలపై మారటోరియం కాలానికి చెల్లించాల్సిన వడ్డీపై సబ్సిడీ ఉంటుంది. వడ్డీ రాయితీ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కాంపిటెంట్‌ అథారిటీ జారీ చేసిన OBC కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. OBC అభ్యర్థుల మొత్తం ఇంటి ఆదాయం ప్రస్తుత క్రీమిలేయర్‌ ప్రమాణాలను మించకూడదు. EBC అభ్యర్థులకు ఆదాయ పరిమితి ఏడాదికి రూ.2.50 లక్షలు. విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.

చివరిగా: భారత్‌లో ప్రొఫెషనల్‌ లేదా టెక్నికల్‌ కోర్సులను అభ్యసించడానికి రూ.7.50 లక్షల వరకు విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు సెంట్రల్‌ సెక్టార్‌ వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుంది. జాతీయ మైనారిటీల కమిషన్‌ చట్టం, 1992లోని సెక్షన్‌ 2(సి) ప్రకారం మైనారిటీలుగా ప్రకటించిన కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులకు పధో పరదేశ్‌ వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుంది. ఇతర వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు డాక్టర్‌ అంబేడ్కర్‌ సెంట్రల్‌ సెక్టార్‌ వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మధ్య కాలంలో కొన్ని తరగతుల విద్యార్థులకు ఓ మోస్తరు నుంచి భారీ రుణాలను అందజేస్తున్నాయి. వీటిని కూడా విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు