Sudha Murty: 30 ఏళ్లు.. మేమిద్దరం ఏ వెకేషన్‌కు వెళ్లలేదు: సుధామూర్తి

ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murty) సతీమణిగానే గాక.. రచయిత్రి, వితరణశీలిగా ఎంతో మందికి సుపరిచితురాలు సుధామూర్తి (Sudha Murty). ఇటీవల ప్రముఖ బాలీవుడ్‌ టాక్‌షో ‘ది కపిల్ శర్మ షో’లో ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించారు.

Published : 23 May 2023 01:51 IST

ముంబయి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి(Infosys founder Narayana Murthy) సతీమణి సుధామూర్తి(Sudha Murthy) ఇటీవల ప్రముఖ బాలీవుడ్‌ టాక్‌షో ‘ది కపిల్ శర్మ షో (The Kapil Sharma Show)’లో పాల్గొని.. తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె తన భర్తతో కలిసి 30 ఏళ్లపాటు ఏ వెకేషన్‌కు వెళ్లలేదని ఆ సందర్భంగా తెలిపారు.

‘1981లో నారాయణ మూర్తి ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. ఆ తర్వాత ఆయనకు పనే జీవితమైంది. ఆ సంస్థను ఉన్నతశిఖరాలకు చేర్చాలని నిర్విరామంగా కృషి చేశారు. ఆయన ఎప్పుడూ బిజీగా ఉండటంతో 30 ఏళ్లపాటు మేమిద్దరం కలిసి ఒక్క వెకేషన్‌కు కూడా వెళ్లలేదు. అన్నేళ్లు సెలవులే లేవు. ఆయన సంవత్సరంలో 220 రోజులు అధికారిక ప్రయాణాలు చేస్తూనే ఉండేవారు. ఇంటికి సంబంధించిన విషయాలను పూర్తిగా నాపైనే వదిలేశారు. ఆయన పట్టించుకుంటారని నేను ఊహించలేదు కూడా. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలిసేది కాదు. పిల్లలిద్దరి బాధ్యతను పూర్తిగా నేనే తీసుకున్నా. మా పిల్లలు బయటకు వెళ్లిపోయిన తర్వాత నా పనుల గురించి నారాయణ మూర్తి(Narayana Murthy)కి అర్థమైంది’ అని సుధామూర్తి వెల్లడించారు.

అలాగే తాను జీవితంలో ఒక స్థాయికి చేరడం వెనక తన తండ్రి పాత్ర ఎంతో ఉందని సుధామూర్తి(Sudha Murthy) గుర్తుచేసుకున్నారు. ఆమె తండ్రి పేరు ఆర్‌హెచ్‌ కులకర్ణి. ఆయనొక సర్జన్‌. సాంకేతిక విభాగాలు అబ్బాయిలకు చెందినవి మాత్రమేననే భావన ప్రబలంగా ఉన్న సమయంలో తనను ఇంజినీరింగ్ చదివించేందుకు తన తండ్రి ఎంతో పోరాటం చేశారన్నారు. ‘గత నెల నేను పుణెలోని టెల్కో సంస్థకు వెళ్లాను. ఇప్పుడు దానిపేరు టాటా మోటార్స్‌. దాదాపు 40-50 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్లాను. ప్రస్తుతం 300 మంది మహిళలు పనిచేస్తున్నారు. నేను టాటా గ్రూప్‌లో మొదటి మహిళా ఇంజినీర్‌గా చేరడం వెనక నా తండ్రి కృషి ఉంది. ఆయన వల్లే అదంతా సాధ్యమైంది’ అని ఆమె తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని