Sudha Murty: ప్రధాని అత్తగారినంటే.. అక్కడ ఎవరూ నమ్మలేదు: సుధామూర్తి

బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌ అత్తగారినంటే.. లండన్‌ అధికారులు నమ్మలేదని తెలిపారు ప్రముఖ రచయిత్రి సుధామూర్తి (Sudha Murty). ఓ టీవీ షోలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు.

Updated : 15 May 2023 17:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murty) సతీమణిగానే గాక.. రచయిత్రి, వితరణశీలిగా ఎంతో మందికి సుపరిచితురాలు సుధామూర్తి (Sudha Murty). పైగా బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak)కు స్వయానా అత్తగారు కూడా..! అయినప్పటికీ నిరాడంబరతకు ఆమె మారుపేరు. కోట్లాది రూపాయల డబ్బు, పలుకుబడి ఉన్నా.. ఆమె కట్టుబొట్టూ చూస్తే సాధారణ మధ్యతరగతి గృహిణిలాగే ఉంటారు. అందుకేనేమో తాను ప్రధాని అత్తగారినంటే యూకేలో ఎవరూ నమ్మలేదని చెప్పారు సుధామూర్తి. ఇటీవల ఆమె ప్రముఖ బాలీవుడ్‌ టాక్‌షో ‘ది కపిల్ శర్మ షో (The Kapil Sharma Show)’లో పాల్గొని.. తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా తన వస్త్రధారణ కారణంగా లండన్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె బయటపెట్టారు. ‘‘ ఇటీవలే నేను యూకే వెళ్లాను. అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు నా రెసిడెన్షియల్‌ అడ్రస్‌ గురించి అడిగారు. ‘లండన్‌లో ఎక్కడ ఉంటారు?’ అని ప్రశ్నించారు. అప్పుడు మా అక్క కూడా నాతో పాటే ఉంది. నా కుమారుడు యూకేలోనే ఉంటాడు. కానీ అతడి పూర్తి అడ్రసు నాకు తెలియదు. దీంతో నేను నా అల్లుడు రిషి సునాక్‌ నివాసమైన 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ (10 Dowing Street)ను అడ్రస్‌గా రాశాను. అది చూడగానే ఇమ్మిగ్రేషన్ అధికారి నన్ను ఎగాదిగా చూసి.. ‘జోక్‌ చేస్తున్నారా?’ అని అడిగారు. నేను నిజమే అని చెప్పినా వారు నమ్మినట్లు నాకు అన్పించలేదు. నా లాంటి సింపుల్‌ మహిళ ప్రధాని అత్తగారంటే అక్కడ ఎవరూ నమ్మలేదు’’ అని నాటి సంఘటనను సుధామూర్తి (Sudha Murty) గుర్తుచేసుకున్నారు.

ఇదీ చదవండి: నారాయణమూర్తి హీరోలా ఉంటాడనుకున్నా: సుధామూర్తి

ఇదే షోలో సుధామూర్తి తన వైవాహిక జీవితం గురించి కూడా ఆమె పంచుకున్నారు. పెళ్లికాక ముందు నారాయణమూర్తిని మొదటిసారి చూసిన సందర్భాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆయన హీరోలా ఉంటారేమోనని తాను అనుకున్నట్లు చెప్పారు. ‘‘నారాయణ మూర్తి మా పెళ్లప్పుడు ఎంత బరువు ఉండేవారో.. ఇప్పటికీ అలాగే ఉన్నారు. నాకు వంట సరిగా రాదు. అందుకే ఆయన అలా ఉండిపోయారు’’ అంటూ నవ్వులు పూయించారు.  ఈ షోలో సుధామూర్తి (Sudha Murty)తో పాటు బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌, నిర్మాత గునీత్‌ మోంగా కూడా పాల్గొన్నారు.

1978లో సుధామూర్తి, నారాయణమూర్తి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి కుమార్తె అక్షతా (యూకే ప్రధాని రిషి సునాక్‌ సతీమణి), కుమారుడు రోహన్‌ ఉన్నారు.సుధామూర్తి సేవలకు గానూ ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆమెను ‘పద్మభూషణ్‌’ పురస్కారంతో సత్కరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని