SSY: సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతా ఈ విషయాలు తెలుసుకోండి..

ఈ ఖాతాలో మ‌దుపు చేయ‌డం అనేది దీర్ఘ‌కాల పెట్టుబ‌డిగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Updated : 21 Jul 2022 18:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుక‌న్య స‌మృద్ధి యోజ‌న (SSY) కేంద్ర ప్ర‌భుత్వ హామీతో కూడిన పొదుపు ప‌థ‌కం. ఈ ప‌థకం కింద 10 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌స్సు ఉన్న అమ్మాయి పేరుతో త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కులు బ్యాంకు/పోస్టాఫీసులో ఖాతా తెర‌వొచ్చు. అమ్మాయికి 21 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు లేదా 18 ఏళ్ల త‌ర్వాత వివాహం జ‌రిగినా ఖాతాను ముగించ‌వ‌చ్చు. అయితే, అమ్మాయి 18 ఏళ్ల త‌ర్వాత సొంతంగా ఖాతాను నిర్వ‌హించుకోవ‌చ్చు. పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలికంగా మంచి రాబ‌డిని అందిస్తాయి.

వ‌డ్డీ రేటు: సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతాకు వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌భుత్వం ప్ర‌తీ త్రైమాసికానికి (3 నెల‌ల‌కు) స‌మీక్షిస్తుంది. ఈ జులై-సెప్టెంబ‌ర్ త్రైమాసికానికి వ‌డ్డీ రేటు సంవ‌త్స‌రానికి 7.60%గా నిర్ణయించారు. ఇది ఇత‌ర ప్ర‌భుత్వ పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్ల క‌న్నా కూడా ఎక్కువే.

ప‌న్ను మిన‌హాయింపు: హామీ ఇచ్చిన వ‌డ్డీ రేటుతో పాటు సెక్ష‌న్ 80సీ కింద సంవ‌త్స‌రానికి రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం కూడా ఉంది.

క‌నీస‌, గ‌రిష్ఠ డిపాజిట్: SSY ఖాతాలో సంవ‌త్స‌రానికి క‌నీసం రూ. 250 డిపాజిట్ చేయ‌వ‌చ్చు. గ‌రిష్ఠ డిపాజిట్ ప‌రిమితి ఏడాదికి రూ.1.50 ల‌క్ష‌లు. అయితే, ప్ర‌తి ఏడాది క‌నీసం రూ. 250 మ‌దుపు చేయ‌డం తప్ప‌నిస‌రి. ఏ సంవ‌త్స‌రంలోనైనా క‌నీస పెట్టుబ‌డి రూ.250 జ‌మ చేయ‌క‌పోతే ఖాతా నిరుపయోగంగా మారుతుంది. ఆ తర్వాతి సంవ‌త్స‌రం కనీస మొత్తంతో పాటు రూ.50 జ‌రిమానాగా చెల్లించి ఖాతాను పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చు.

ముందస్తు ఉపసంహరణ: మెచ్యూరిటీ వ్య‌వ‌ధికి ముందు, అమ్మాయి 18 ఏళ్లు పైబ‌డిన త‌ర్వాత లేదా 10వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త సాధించిన త‌ర్వాత మాత్ర‌మే ఉప‌సంహ‌ర‌ణకు అనుమ‌తి ఉంటుంది. ఎందుకంటే ఉన్న‌త విద్య‌కు సంబంధించి ఖ‌ర్చుల‌కు ఉప‌సంహ‌ర‌ణకు అనుమ‌తి ఉంటుంది. మెచ్యూరిటీ వ్య‌వ‌ధికి ముందు, ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రిలో ఖాతాలో ఉన్న న‌గ‌దు నిల్వ‌లో 50% మాత్ర‌మే ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి ఉంటుంది.

ఖాతాను ఎలా తెర‌వొచ్చు?
మీ స‌మీపంలోని పోస్టాఫీసు లేదా ప‌బ్లిక్/ప్రైవేట్ రంగ బ్యాంకులో సుక‌న్య స‌మృద్ధి యోజ‌న (SSY) దర‌ఖాస్తు ఫారం పూర్తి చేసి ఇవ్వ‌వ‌చ్చు. దర‌ఖాస్తు ఫార‌ంతో పాటు త‌ల్లిదండ్రుల/స‌ంర‌క్ష‌కుల ఆధార్, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, ఓట‌రు ఐడీ ఏదైనా ఒక గుర్తింపు ప‌త్రాన్ని కేవైసీగా స‌మ‌ర్పించాలి. అమ్మాయి జ‌న‌న  ధ్రువీకరణ ప‌త్రం జిరాక్స్ కాపీని స‌మ‌ర్పించాలి.

ఖాతాను డిజిట‌ల్‌గా ఎలా తెర‌వొచ్చు?
SSY ఖాతా తెరిచే దర‌ఖాస్తు ఫార‌ంను ఆర్‌బీఐ వెబ్‌సైట్‌, ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌, ఎస్‌బీఐ, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా వంటి ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల వెబ్‌సైట్‌లు లేదా ప్రైవేట్ రంగ బ్యాంకులైన ఐసీఐసీఐ, యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల వెబ్‌సైట్‌ల నుండి డౌన్‌లోడ్ చేయ‌వ‌చ్చు. ఫారం అన్ని వెబ్‌సైట్‌ల‌లో ఒకే విధంగా ఉంటుంది.

ఫార‌మ్‌లో తెల‌పాల్సిన కొన్ని ముఖ్య‌మైన వివ‌రాలు..

  • అమ్మాయి పేరు
  • ఖాతా తెరిచే త‌ల్లిదండ్రులు/స‌ంర‌క్ష‌కుల పేరు
  • ప్రారంభ డిపాజిట్ మొత్తం
  • అమ్మాయి పుట్టిన తేదీ, అమ్మాయి జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రం (అందులో స‌ర్టిఫికెట్ నంబ‌ర్‌, జారీ చేసిన తేదీ మొద‌లైన‌వి ఉండాలి)
  • త‌ల్లిదండ్రుల/స‌ంర‌క్ష‌కుల గుర్తింపు ప‌త్రం (ఆధార్‌)
  • ప్ర‌స్తుత, శాశ్వ‌త చిరునామా
  • త‌ల్లిదండ్రుల / స‌ంర‌క్ష‌కుల పాన్ నంబరు

గుర్తుంచుకోవ‌ల‌సిన విష‌యాలు..

  • ఒక కుటుంబంలో ఇద్ద‌రు అమ్మాయిల కోసం వేర్వేరుగా ఖాతాల‌ను తెర‌వొచ్చు.
  • అమ్మాయి ఎన్ఆర్‌ఐ అయిన‌ట్ల‌యితే, లేదా ఆమె భార‌త పౌర‌స‌త్వాన్ని కోల్పోయినా SSY ఖాతా మూసివేస్తారు.
  • SSY పై రుణం తీసుకోలేరు.
  • ఈ ఖాతా వ‌డ్డీ రాబ‌డిపై ప‌న్ను లేదు.
  • ప్రాణాంత‌క అనారోగ్యం, ప్రాథ‌మిక ఖాతాదారుడు (అమ్మాయి) మ‌ర‌ణించ‌డం వంటి కార‌ణాల‌తో SSY ఖాతా గ‌డువుకు ముందే మూసివేయ‌వ‌చ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని