SSY: బాలికల ఆర్థిక భవిష్యత్‌కు సుకన్య సమృద్ధి యోజన.. పూర్తి వివరాలివే..

sukanya samriddhi yojana Full details in telugu: కుమార్తె ఉన్న‌త విద్య‌కు, వివాహా అవ‌స‌రాల‌కు ఈ నిధి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

Updated : 30 Apr 2022 15:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుక‌న్య స‌మృద్ధి యోజ‌న (SSY) బాలిక‌ల‌కు ప్రత్యేకమైన‌ పెట్టుబ‌డి ప‌థ‌కం. ఈ ప‌థ‌కానికి వ‌డ్డీ రేటు ప్ర‌భుత్వం నిర్ణయిస్తుంది. ప్ర‌భుత్వ మ‌ద్ద‌తుతో కూడిన ఈ ప‌థ‌కం చాలా మంచి పొదుపు ప‌థ‌క‌మనే చెప్పాలి. బాలిక‌లు పెద్ద‌యిన త‌ర్వాత ఈ ప‌థ‌కంలో పొదుపు చేసిన సొమ్ములు పెళ్లికి మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అనుకుంటారు. కానీ, ఉన్నత విద్య‌కు కూడా ఈ మొత్తాన్ని ఉప‌యోగించొచ్చు. 10 ఏళ్ల‌లోపు బాలిక‌ల కోసం ప్ర‌భుత్వం 2014లో ఈ ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్ట‌డానికి ఒక సంవ‌త్స‌రంలో క‌నీస మొత్తం రూ.250, గ‌రిష్ఠంగా రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.

ఉదాహరణ: మీ కుమార్తెకు 3 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌పుడు సుక‌న్య స‌మృద్ది యోజ‌న ప‌థ‌కంలో పొదుపు ఆరంభించి 15 సంవ‌త్స‌రాల‌కు సంవ‌త్స‌రానికి రూ.1.50 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెడితే 7.60% వ‌డ్డీ రేటుతో దాదాపు రూ.44 ల‌క్ష‌ల వ‌ర‌కు నిధి జ‌మ‌వుతుంది. కుమార్తె ఉన్న‌త విద్య‌కు, వివాహ అవ‌స‌రాల‌కు ఈ నిధి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. విదేశ క‌ళాశాల‌లు కాకున్నా భార‌తీయ క‌ళాశాల‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకున్నట్టయితే ఈ నిధి స‌రిపోతుంది.

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న: బాలిక‌కు 10 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కు వారి త‌ల్లిదండ్రులు లేదా చ‌ట్ట‌ప‌ర‌మైన సంర‌క్ష‌కులు సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతాను తెర‌వొచ్చు. ఒక కుటుంబంలో ఇద్ద‌రు బాలిక‌ల వ‌ర‌కు ఖాతాలు ప్రారంభించొచ్చు.

లాభాలు: పోస్టాఫీసులో ఏ ఇత‌ర పధకం క‌న్నా కూడా సుక‌న్య స‌మృద్ధి యోజ‌న పథకంలోనే లోనే వ‌డ్డీ రేటు ఎక్కువ‌. ప్రస్తుతం 7.60% వ‌డ్డీ రేటుని ఈ ప‌థ‌కం ఖాతాదారుల‌కు అందిస్తోంది.

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కం మెచ్యూరిటీ వ్య‌వ‌ధి 21 సంవ‌త్స‌రాలు. పెట్టుబ‌డులు 15 సంవ‌త్స‌రాల పాటు చేయాలి. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన‌పుడు, ఖాతా మొత్తంలో 50% పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తిస్తారు. దీన్ని విద్యా ప్ర‌యోజ‌నాల కోసం ఉప‌యోగించ‌వ‌చ్చు. మెచ్యూరిటీ వ్య‌వ‌ధి 21 సంవ‌త్స‌రాలు అయిన‌ప్ప‌టికీ, 18 ఏళ్లు నిండిన త‌ర్వాత అమ్మాయి వివాహం చేసుకుంటే.. ఖాతా ముందుగానే మూసివేయొచ్చు. మొత్తం నిధిని ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. ఈ ఖాతాలో పెట్టుబ‌డుల‌కు 80సీ ప‌న్ను ప్ర‌యోజ‌నాలున్నాయి. వ‌డ్డీ, మెచ్యూరిటీ మొత్తం పూర్తిగా ప‌న్ను ర‌హితం.

ఇంజ‌నీరింగ్‌, మేనేజ్‌మెంట్ కోర్సులు, ఇత‌ర ప్రొఫెష‌న‌ల్ కోర్సులు చ‌ద‌వ‌డానికి బాలిక‌లు ఇష్ట‌ప‌డతారు. వారి చ‌దువుకు ఆర్థికంగా ఏ లోటూ రాకుండా ఉండాలంటే వాళ్ల పేరు మీద పోస్టాఫీసులో లేదా బ్యాంకులో సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతా ప్రారంభిస్తే మంచిది. ప్రస్తుతం కొన్ని విద్యా కోర్సుల‌కు 5 ల‌క్ష‌లు ఖ‌ర్చ‌యితే 15 ఏళ్ల త‌ర్వాత రూ.20-25 ల‌క్ష‌లు ఖ‌ర్చు అవ్వొచ్చు. ఆ స‌మ‌యంలో అమ్మాయి చ‌దువుకి ఈ ఖాతాలో సొమ్ము ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చు. త‌ల్లిదండ్రుల‌కు ఆర్థిక భరోసా ఉంటుంది.

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను లెక్క‌లోకి వేసుకుని వారి ద‌గ్గ‌రున్న పొదుపు చేసే సొమ్మును ముందు ప్ర‌భుత్వ హామీతో కాస్త అధిక వ‌డ్డీ వ‌చ్చే మంచి ప‌థ‌కం అయిన సుక‌న్య స‌మృద్ధితో పొదుపు మొద‌లుపెట్టాలి. ఆ త‌ర్వాత మీ ఆర్థిక వ‌న‌రుల‌ను బ‌ట్టి ఇతర పథకాల్లో కూడా పెట్టుబ‌డులు పెట్టొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని