Sula Vineyards IPO: 12న ‘సులా వైన్‌యార్డ్స్‌’ ఐపీఓ.. ధరల శ్రేణి ₹340-357

దేశంలో ఐపీఓల పర్వం కొనసాగుతోంది. డిసెంబరు 12న సులా వైన్‌యార్డ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభం కానుంది. దేశంలో ప్రముఖ వైన్‌ తయారీ సంస్థల్లో ఇదొకటి.

Published : 07 Dec 2022 18:08 IST

దిల్లీ: దేశంలో ప్రముఖ వైన్‌ తయారీ సంస్థ ‘సులా వైన్‌యార్డ్స్‌’ ఐపీఓ (Sula Vineyards IPO) డిసెంబరు 12న ప్రారంభం కానుంది. మూడురోజుల పాటు కొనసాగి 14న ముగియనుంది. ధరల శ్రేణిని రూ.340-357గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద రూ.960 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ఐపీఓలో పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) కింద షేర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు కలిపి మొత్తం 2.7 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఆఫర్‌ పూర్తిగా ఓఎఫ్‌ఎస్‌ అయిన నేపథ్యంలో ఐపీఓ ద్వారా సమకూరిన నిధులు కంపెనీకి వెళ్లబోవు. మదుపర్లు గరిష్ఠంగా 42 షేర్లకు (ఒక లాట్‌) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. కోటాక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, సీఎల్‌ఎస్‌ఏ ఇండియా, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ రకాల వైన్‌ వేరియంట్ల తయారీలో సులా వైన్‌యార్డ్స్‌ అగ్రస్థానంలో ఉంది. 13 రకాల బ్రాండ్ల పేరిట ఇది వైన్‌ను విక్రయిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో మొత్తం ఆరు తయారీ కేంద్రాలున్నాయి. 2022 సెప్టెంబరు 30తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో కంపెనీ PAT ఆదాయం రూ.30.51 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో అది రూ.4.53 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం 40.8 శాతం పెరిగి రూ.224.07 కోట్లకు చేరింది. రిలయన్స్‌ క్యాపిటల్‌ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్‌ కార్పొరేట్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ 2018లో తమ 19.05 శాతం వాటాను సులా వైన్‌యార్డ్స్‌కు రూ.256 కోట్లకు విక్రయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని