Google: గూగుల్‌ ఉద్యోగుల పనితీరుపై సీఈఓ సుందర్‌ పిచాయ్‌ అసంతృప్తి?

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తమ కంపెనీ ఉద్యోగుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది....

Published : 12 Aug 2022 18:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తమ కంపెనీ ఉద్యోగుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన వారితో నేరుగా ప్రస్తావించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఉత్పత్తులు, సేవలను మరింత మెరుగుపరిచి కస్టమర్ల మన్ననలను చూరగొనడంపై దృష్టిసారించాలని పిచాయ్‌ సూచించారు.

గూగుల్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే కంపెనీ పనితీరు, ఉత్పాదకత ఆశించిన స్థాయిలో లేదని పిచాయ్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘‘గూగుల్‌లో చాలా మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ, వారిలో చాలా మంది సమర్థంగా పనిచేయడం లేదు’’ అని పిచాయ్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు మరింత శ్రద్ధగా, ఏకాగ్రతతో పనిచేసే వాతావరణాన్ని కంపెనీలో సృష్టించాలని సంస్థలోని ఉన్నతోద్యోగులను ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు పరోక్షంగా పిచాయ్‌ ఉద్యోగుల తొలగింపునకు సంకేతాలిచ్చారని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

2022 రెండో త్రైమాసికంలో గూగుల్‌ కార్పొరేట్‌ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. కంపెనీ లాభాలు, ఆదాయాలు బలహీనంగా నమోదయ్యాయి. కంపెనీ ఆదాయ వృద్ధిలో 13 శాతం తగ్గుదల నమోదైంది. తొలి త్రైమాసికంలోనూ కంపెనీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే పిచాయ్‌ ఉద్యోగుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో తమ ఉద్యోగ నియామకాల వేగాన్ని తగ్గించనున్నట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది. మరోవైపు సామర్థ్యం, నైపుణ్యాలకు అనుగుణంగా సిబ్బందిని పునర్‌వ్యవస్థీకరిస్తామని తెలిపింది. మరోవైపు ఆర్థిక మాంద్యం కూడా వచ్చే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు తప్పదన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు