IRCTC Package: ₹20 వేలకే గుజరాత్‌ ట్రిప్‌.. స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ, ద్వారక దర్శనం.. వివరాలు ఇవే..!

IRCTC tour package: గుజరాత్‌లోని మ్యూజియం, ప్యాలెస్‌లతో పాటు పలు పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది.

Updated : 01 Sep 2023 10:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గుజరాత్‌ అనగానే సబర్మతీ ఆశ్రమం.. నర్మదా నదీ తీరంలోని ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’.. ద్వారక వంటివి గుర్తొస్తాయి. వీటన్నింటినీ ఒకే ట్రిప్‌లో కవర్‌ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే. గుజరాత్‌లోని పర్యాటక స్థలాలను వీక్షించడం కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ‘సుందర్‌ సౌరాష్ట్ర’ పేరుతో  కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది.  హైదరాబాద్‌ నుంచి ఈ ప్రయాణం మొదలవుతుంది. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లుగా ఈ టూర్‌ కొనసాగుతుంది. సికింద్రాబాద్‌తో పాటు గుల్బర్గా, కళ్యాణ్‌, పుణె, సోలాపుర్‌ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. ప్రయాణం అనంతరం ఆయా రైల్వే స్టేషన్లలో దిగొచ్చు. ప్రతి బుధవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. అక్టోబరు 18 నుంచి మీ ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

రైలు ప్రయాణం ఇలా...

  • సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌-పోర్‌బందర్‌ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నం. 19201) రైలు బయల్దేరుతుంది.
  • రెండో రోజు ఉదయం 11 గంటలకు వడోదరా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ ముందుగా ఏర్పాటు చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. కాసేపు సేద తీరాక మధ్యాహ్నం స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ (ఐక్యతా మూర్తి)ని వీక్షించి తిరిగి వడోదరా చేరుకుంటారు. రాత్రి అక్కడే బస ఉంటుంది.
  • మూడో రోజు లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ని వీక్షించి అహ్మదాబాద్ బయల్దేరుతారు. అక్కడ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి అహ్మదాబాద్‌లో బస ఉంటుంది.
  • నాలుగో రోజు సబర్మతీ ఆశ్రమాన్ని చూసి రాజ్‌కోట్‌కి పయనమవుతారు.  మధ్యాహ్నం రాజ్‌కోట్ చేరుకోగానే  హోటల్‌కు తీసుకెళ్తారు.  సాయంత్రం వాట్సన్ మ్యూజియం, గాంధీ మ్యూజియం, స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ రాత్రి రాజ్‌కోట్‌లో బస ఉంటుంది.
  •  ఐదోరోజు ద్వారక పయనమవుతారు. మార్గం మధ్యలో సమయం ఉంటే జామ్‌నగర్‌ సందర్శనకు తీసుకెళ్తారు. హోటల్‌లో విశ్రాంతి తీసుకున్నాక బెట్‌ ద్వారకను సందర్శిస్తారు. ఆ రాత్రి ద్వారకలోనే రాత్రి బస ఉంటుంది.
  • ఆరో రోజు ద్వారకాదీశ్‌ ఆలయాన్ని, సోమనాథ్‌ జ్యోతిర్లింగాలయాన్ని దర్శించుకొని పోర్‌బందర్‌ చేరుకుంటారు. 
  • ఏడో రోజు అర్ధరాత్రి 00:50 గంటలకు సికింద్రాబాద్‌-పోర్‌బందర్‌ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నం.19201 )లో తిరిగి సికింద్రాబాద్‌కు పయనమవుతారు.
  • ఎనిమిదో రోజు ఉదయం 8:20 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ చేరుకోవటంతో మీ టూర్‌ పూర్తవుతుంది.

సోమనాథ్‌ ఆలయం

ప్యాకేజీలో ఉండేవి ఇవీ..

  • యాత్రకు వెళ్లి రావడానికి రైలు టికెట్లు (3 ఏసీ, స్లీపర్‌ ఎంపికను బట్టి) ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంటాయి. 
  • ఏసీ గదిలో బస, ఏసీ రవాణా సదుపాయం ఉంటుంది.
  • నాలుగు రోజులు ఉదయం టిఫిన్‌, రాత్రి భోజనం ఐఆర్‌సీటీసీయే చూసుకుంటుంది.
  • ప్రయాణ బీమా సదుపాయం ఉంటుంది. 
  • టూర్‌ ప్యాకేజీలో ఉండే సందర్శనా ప్రదేశాల రుసుముల బాధ్యత ఐఆర్‌సీటీసీదే.

వీటి బాధ్యత మీదే..

  • రైలు ప్రయాణంలో ఆహారాన్ని మీరే ఏర్పాటు చేసుకోవాలి.
  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే యాత్రికులే చెల్లించాలి.
  •  బోటింగ్‌, గుర్రపు స్వారీకి యాత్రికులే రుసుము వెచ్చించాలి.
  • టూర్‌ గైడ్‌ సదుపాయం ఉండదు.

ద్వారకాదీష్‌ ఆలయం

ప్యాకేజీ వివరాలు ఇవీ.. (టికెట్‌ ధర ఒక్కొక్కరికీ)..

  • 1-3 ముగ్గురు వ్యక్తులు బుక్‌ చేసుకుంటే.. స్టాండర్ట్‌లో (స్లీపర్‌ బెర్త్‌), రూమ్‌ సింగిల్ షేరింగ్ అయితే రూ.50,200, ట్విన్ షేరింగ్‌కు రూ.26,310, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.20,060. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.15,420, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.13,810 చెల్లించాలి. అంటే ట్రిపుల్‌ షేరింగ్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే టికెట్‌ ప్రారంభ ధర రూ.20 వేలు అవుతుంది. 
  • కంఫర్ట్‌లో (థర్డ్‌ ఏసీ బెర్త్‌) సింగిల్ షేరింగ్‌కు రూ.52,990, ట్విన్ షేరింగ్‌కు రూ.29,100, ట్రిపుల్ షేరింగ్ అయితే రూ. 22,850 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌ అయితే రూ.18,210, అలాగే విత్ అవుట్ బెడ్ అయితే రూ.16,600 చెల్లించాలి.
  • నలుగురు నుంచి ఆరుగురు కలిసి బుక్‌ చేసుకుంటే ఒక రకం ప్యాకేజీ ఛార్జీలు వర్తిస్తాయి. స్టాండర్ట్‌లో (స్లీపర్‌ బెర్త్‌)  డబుల్‌ షేరింగ్‌కు రూ.13,840, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.11,710 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ. 15,420, విత్ అవుట్ బెడ్ అయితే రూ.13,810 చెల్లించాలి.
  • అదే కంఫర్ట్‌లో (థర్డ్‌ ఏసీ)  డబుల్‌ షేరింగ్‌కు రూ.23,410, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.20,440 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌ అయితే రూ. 18,210, విత్ అవుట్ బెడ్ అయితే రూ.16,600 చెల్లించాలి. ఎక్కువ మంది కలిసి ప్రయాణిస్తే టికెట్‌ ధరలు రూ.11,710 నుంచే ప్రారంభమవుతాయి.
  • ఏదైనా కారణం చేత 15 రోజుల ముందు ప్రయాణం రద్దు చేసుకుంటే ఒక్కో టికెట్‌కు కేన్సలేషన్‌ కింద రూ.250 ఛార్జీగా వసూలు చేస్తారు. అదే 8-14 రోజుల ముందు రద్దు చేసుకుంటే 25 శాతం, 4-7 రోజుల ముందు రద్దు చేసుకుంటే 50 శాతం మీ టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. అయితే, ప్రయాణానికి నాలుగు రోజుల ముందు రద్దుచేసుకొంటే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.
  • ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం IRCTC Tourism వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని