Supertech | దివాలా తీసిన రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ కంపెనీ.. 25 వేలమంది బయ్యర్లపై పిడుగు!

ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ సూపర్‌టెక్‌ సంస్థ దివాలా తీసినట్లు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) ప్రకటించింది.

Updated : 25 Mar 2022 17:42 IST

దిల్లీ: ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ సంస్థ దివాలా తీసినట్లు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) ప్రకటించింది. బకాయిలు చెల్లించడంలో సదరు సంస్థ విఫలమైందంటూ యూనియన్‌ బ్యాంక్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ మేరకు NCLT దిల్లీ బెంచ్‌ శుక్రవారం తీర్పు వెలువరించింది. హితేశ్‌ గోయల్‌ను దివాలా ప్రక్రియ పరిష్కార నిపుణుడిగా (IRP) నియమించింది. ఈ తీర్పుతో సుమారు 25 వేల గృహ కొనుగోలుదారులపై ప్రభావం పడనుంది. మరోవైపు NCLT ఇచ్చిన తీర్పుపై జాతీయ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (NCLAT) ను ఆశ్రయించనున్నట్లు సూపర్‌టెక్‌ గ్రూప్‌ తెలిపింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ పరిధిలోని నోయిడాలో సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ నిర్మించిన ట్విన్‌ టవర్స్‌ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు గతేడాది ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కంపెనీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తమకు బకాయిలు చెల్లింపులో కంపెనీ విఫలమైందంటూ NCLTని యూనియన్‌ బ్యాంక్‌ ఆశ్రయించింది. అయితే, మార్చి 17న కంపెనీ చేసిన వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ ప్రతిపాదనకు బ్యాంక్‌ నిరాకరించింది. దీంతో ఎగవేతదారుగా గుర్తించేందుకు కంపెనీ తరఫు న్యాయవాది అంగీకరించారు. ఆ రోజు తీర్పును రిజర్వ్‌ చేసిన బెంచ్‌.. తాజాగా తన తీర్పును వెలువరించింది.

సూపర్‌టెక్‌ కంపెనీ ప్రస్తుతం గురుగ్రామ్‌, ఘజియాబాద్‌, నోయిడా, గ్రేటర్‌ నోయిడాలోని పలు చోట్ల చేపట్టిన వివిధ ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో సుమారు 25వేల మంది గృహ కొనుగోలుదారులు తమ ఫ్లాట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ట్రైబ్యునల్‌ తీర్పుతో వీరిపై ప్రభావం పడనుంది. వీరంతా ట్రిబ్యునల్‌ నియమించిన ఐఆర్‌పీ వద్ద క్లెయిమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ తీర్పు వల్ల బయ్యర్లపై ఎలాంటి ప్రభావం ఉండబోదని సూపర్‌టెక్‌ గ్రూప్‌ చెబుతోంది. కొనుగోలుదారులకు కేటాయించిన యూనిట్లను అందజేస్తామని పేర్కొంది. గత ఏడేళ్లలో సుమారు 40వేల ఫ్లాట్లు విజయవంతంగా కొనుగోలుదారులకు అందజేశామని తెలిపింది. అలాగే, సూపర్‌ టెక్‌ గ్రూప్‌ కార్యకలాపాలపై ఈ తీర్పు ప్రభావం ఉండబోదని,  NCLT తీర్పుపై అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించనున్నట్లు వెల్లడించింది. సూపర్‌టెక్‌ లిమిటెడ్‌కు దాదాపు రూ.1200 కోట్లు అప్పులు ఉండగా.. ఒక్క యూనియన్‌ బ్యాంక్‌కు ఆ కంపెనీ రూ.150 కోట్లు చెల్లించాల్సి ఉంది.

ట్విన్‌ టవర్స్‌ కథ ఇదీ..

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని నోయిడాలో గల సెక్టార్‌ 93 ప్రాంతంలో సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ కంపెనీ 2009లో భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఈ భవనాల నిర్మాణ సమయంలో రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డరు పెడచెవిన పెట్టారు. దీంతోపాటు అధికారులతో చేతులు కలిపి నిబంధనలు పాటించలేదు. దీనిపై స్థానికంగా ఉన్న నలుగురు వ్యక్తులు ఓ లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్‌టెక్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. తొలుత వీరు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ టవర్లను వెంటనే కూల్చివేయాలని 2014 ఏప్రిల్‌లో హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సూపర్‌టెక్‌ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, స్టేటస్‌కో విధించారు. దాదాపు ఏడేళ్ల విచారణ అనంతరం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆ ట్విన్‌ టవర్లను సొంత ఖర్చులతో కూల్చేయాలని బిల్డర్‌ను ఆదేశించింది. మరోవైపు మే 22న ఈ టవర్లను కూల్చివేస్తామని నోయిడా అధికారులు ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని