Life Insurance: జీవిత బీమాలో స‌రెండ‌ర్ విలువ అంటే ఏమిటి?

మెచ్యూరిటీ తీరకముందే పాలసీని సరెండర్ చేస్తే పాలసీదారుడికి వచ్చే మొత్తాన్నే పాలసీ సరెండర్ విలువ అంటారు.

Updated : 05 Apr 2022 16:04 IST

జీవిత బీమా అనేది దీర్ఘ‌కాల ప్ర‌ణాళిక‌. అయితే, వివిధ కార‌ణాల‌తో కొన్ని సార్లు పాల‌సీని మ‌ధ్య‌లోనే స‌రెండ‌ర్ చేయాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా సాంప్ర‌దాయ‌క పాల‌సీలైన ఎండోమెంట్ పాల‌సీలు.. బీమా, పెట్టుబ‌డుల క‌ల‌యిక‌తో వ‌స్తాయి. అందువ‌ల్ల ప్రీమియం ఎక్కువ‌గా ఉంటుంది. ఒక‌వేళ తాము తీసుకున్న పాల‌సీ లాభ‌దాయ‌కంగా లేదనిపించినా, ప్రీమియం చెల్లించ‌డం భారం అవుతున్నా పాల‌సీని నిలిపివేస్తుంటారు. ఇలా.. మెచ్యూరిటీ కంటే ముందే పాల‌సీని ర‌ద్దు చేసుకుంటే అప్ప‌టి వ‌ర‌కు పాల‌సీదారుడు చెల్లించిన మొత్తం నుంచి కొంత మొత్తాన్ని తిరిగి పాల‌సీదారునికి చెల్లిస్తారు. దీన్నే పాల‌సీ స్వాధీన విలువ (సరెండర్‌ వాల్యూ) అంటారు.

పాలసీ స్వాధీనం చేసిన తర్వాత.. పాల‌సీదారుడు అప్ప‌టి వ‌ర‌కు చెల్లించిన ప్రీమియంల ఆధారంగా సరెండర్ విలువ‌ లెక్కిస్తారు. అద‌నంగా, ఛార్జీలు కూడా ఉంటాయి. ఇది అన్ని బీమా సంస్థ‌ల‌కు ఒకేలా ఉండ‌దు. మీరు ఎంచుకున్న బీమా సంస్థ నియ‌మాల‌కు అనుగుణంగా చార్జీలు వ‌ర్తిస్తాయి. 

స‌రెండ‌ర్ విలువ..
మెచ్యూరిటీ తీరకముందే పాలసీని బీమా సంస్థ‌కు స్వాధీనం చేస్తే పాలసీదారుడికి వచ్చే మొత్తాన్నే స్వాధీన‌ విలువ అంటారు. ఈ స‌రెండ‌ర్ విలువ రెండు ర‌కాలుగా ఉంటుంది. మొద‌టిది గ్యారెంటీడ్ స‌రెండ‌ర్ వాల్యూ, రెండోది స్పెష‌ల్ స‌రెండ‌ర్ వాల్యూ. 

గ్యారెంటీడ్ స‌రెండ‌ర్ విలువ‌..
పాల‌సీ తీసుకుని మూడేళ్లు పూర్తైన త‌ర్వాత పాల‌సీ వెన‌క్కి ఇస్తున్న‌ప్పుడు మాత్ర‌మే గ్యారెంటీడ్ స‌రెండ‌ర్ విలువ‌ను చెల్లిస్తారు. అంటే, పాల‌సీదారుడు పాల‌సీ ర‌ద్దు చేసే స‌మ‌యానికి మూడు వార్షిక ప్రీమియంలు చెల్లించి ఉండాలి. పాల‌సీకి సంబంధించి అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలలో 30 శాతం చొప్పున గ్యారంటీడ్ సరెండర్ విలువను లెక్కిస్తారు. పైగా మొద‌టి సంవ‌త్స‌రం ప్రీమియం, రైడ‌ర్ల కోసం చెల్లించిన అద‌న‌పు మొత్తాన్ని కూడా మిన‌హాయిస్తారు. 

ఉదాహరణకి, చరణ్ అనే వ్య‌క్తి రూ. 3 ల‌క్ష‌ల హామీ మొత్తంతో ఎండోమెంట్ పాల‌సీని తీసుకున్నాడు. మొద‌టి మూడు సంవ‌త్స‌రాల ప్రీమియం రూ. 30 వేలు ( సంవ‌త్స‌రానికి రూ. 10 వేల చొప్పున‌) చెల్లించిన త‌ర్వాత పాల‌సీ స‌రెండ‌ర్ చేయాల‌నుకున్నాడు. ఒక‌వేళ చ‌ర‌ణ్ పాల‌సీ ర‌ద్దు చేసుకుంటే రూ. 6 వేలు మాత్ర‌మే వెన‌క్కి వ‌స్తాయి. 

ఎలాగంటే.. చ‌ర‌ణ్ మూడు వార్షిక ప్రీమియంలు రూ. 30 వేలు చెల్లించ‌న‌ప్పటికీ మొద‌టి వార్షిక ప్రీమియంను మిన‌హాయించి త‌ర్వాతి రెండు సంవ‌త్స‌రాల‌కు చెల్లించిన ప్రీమియం రూ. 20 వేల పైన మాత్ర‌మే సరెండ‌ర్ విలువ లెక్కిస్తారు. రూ. 20000*30/100 =  రూ. 6000. 

స్పెష‌ల్ స‌రెండ‌ర్ విలువ‌..
స్పెష‌ల్ స‌రెండ‌ర్ విలువ‌ను తెలుసుకునేందుకు ముందుగా 'పెయిడ్ అప్ విలువ‌' గురించి తెలుసుకోవాలి. పాల‌సీదారుడు కొన్ని ప్రీమియంలు చెల్లించిన త‌ర్వాత‌..చెల్లించవలసిన ప్రీమియంలను చెల్లించడం ఆపేశాడనుకుందాం. ప్రీమియం చెల్లింపులు నిలిపివేసిన త‌ర్వాత కూడా అతను తన పాలసీని కొన‌సాగించాల‌నుకుంటే.. బీమా సంస్థ పాలసీదారుడికి 'పెయిడ్ అప్' ఆప్షన్ ఇస్తుంది. దీని ప్ర‌కారం పాల‌సీ భ‌విష్య‌త్తులోనూ కొన‌సాగుతుంది. 

పాలసీలో పెయిడ్ అప్ విలువను ఎలా లెక్కించాలి?
ఉదాహరణకు రూ. 5 లక్షల హామీ మొత్తం కలిగిన 15 సంవత్సరాల కాల పరిమితి గల ఎండోమెంట్ పాలసీ కోసం మీరు 4 సంవత్సరాల ప్రీమియంను చెల్లించారనుకుంద్దాం. 5వ సంవత్సరంలో తదుపరి ప్రీమియంను చెల్లించడం మీకు ఇష్టం లేదు. అయినప్పటికీ పాలసీ ఇప్పటికీ కొనసాగుతుంది. దీనికి కారణం హామీ మొత్తాన్ని తగ్గించడం. పెయిడ్ అప్ విలువ అనేది క్రింది ఫార్ములాను ఉపయోగించి లెక్కించబడుతుంది.

పెయిడ్ అప్ విలువ = చెల్లించిన ప్రీమియంలు / చెల్లించవలసిన ప్రీమియంలు x హామీ మొత్తం
పైన తెలిపిన ఉదాహరణలో, పెయిడ్ అప్ విలువ = 4/15 x రూ. 5,00,000 = రూ. 1,33,333.

స్పెష‌ల్ స‌రెండ‌ర్ విలువ = [పెయిడ్ అప్ వాల్యు + బోనస్ (అప్పటి వరకు)] x స‌రెండ‌ర్ వాల్యు ఫేక్ట‌ర్‌
పైన తెలిపిన ఉదాహరణలో బోన‌స్ రూ. 1,00,000 అనుకుంటే.. స్పెష‌ల్ స‌రెండ‌ర్ విలువ = [రూ. 1,33,333 (పెయిడ్ అప్ విలువ) + రూ. 1,00,000 (బోన‌స్‌)] x 30/100(స‌రెండ‌ర్ వాల్యు ఫేక్ట‌ర్‌) = రూ. 70,000. 

స‌రెండ‌ర్ వాల్యు ఫేక్ట‌ర్‌ పాలసీ ని బట్టి, ప్రీమియం చెల్లించిన కాలపరిమితి ని బట్టి వేరు వేరుగా ఉంటుంది.

చివ‌రిగా..
జీవిత బీమా అనేది సంపాదించే వ్య‌క్తి ఆర్థిక ప్ర‌ణాళిక‌లో త‌ప్ప‌కుండా ఉండాలి. అయితే బీమా, పెట్టుబ‌డుల క‌ల‌క‌యితో వ‌చ్చే పాల‌సీల కంటే.. ట‌ర్మ్ పాల‌సీ ఎంచుకుంటే ప్రీమియం త‌క్కువ‌గా ఉంటుంది. అలాగే హామీ మొత్తం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది మీ త‌ర్వాత మీ కుటుంబానికి ఆర్థికంగా అండ‌గా ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని మీ ల‌క్ష్యానికి త‌గినట్లు పెట్టుబ‌డుల‌ను ఎంచుకుని మ‌దుపు చేస్తే మంచి రాబ‌డి పొంద‌వ‌చ్చు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని