Suven pharma: సువెన్‌ ఫార్మా చేతికి సపల ఆర్గానిక్స్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సపల ఆర్గానిక్స్‌ అనే సంస్థలో 67.5% వాటాను సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ కొనుగోలు చేసింది. రూ.229.5 కోట్లు చెల్లించి ఈ వాటా దక్కించుకున్నట్లు సువెన్‌ ఫార్మా వెల్లడించింది.

Published : 14 Jun 2024 02:07 IST

రూ.229.5 కోట్ల పెట్టుబడితో 67.5% వాటా కొనుగోలు  

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సపల ఆర్గానిక్స్‌ అనే సంస్థలో 67.5% వాటాను సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ కొనుగోలు చేసింది. రూ.229.5 కోట్లు చెల్లించి ఈ వాటా దక్కించుకున్నట్లు సువెన్‌ ఫార్మా వెల్లడించింది. సపల ఆర్గానిక్స్‌లో మిగిలిన వాటాను 2026-27 ఆర్థిక సంవత్సరం తర్వాత కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తద్వారా ఈ కంపెనీ సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌కు పూర్తిగా సొంతం అవుతుంది. సపల ఆర్గానిక్స్‌ 2022-23లో రూ.85 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది. ఈ సంస్థ సీడీఎంఓ పద్ధతిలో అలిగో డ్రగ్స్, న్యూక్లిక్‌ యాసిడ్‌ బిల్డింగ్‌ బ్లాక్స్‌ (స్పెషలైజ్డ్‌/ మోడిఫైడ్‌ అమిడిటెస్, న్లూకియోసైడ్స్, డ్రగ్‌ డెలివరీ కాంపౌండ్స్‌), సూడోరిడిన్‌  ఔషధాలు ఉత్పత్తి చేస్తోంది. హైదరాబాద్‌లోని ఐడీఏ- మల్లాపూర్, ఫేజ్‌-2లో ఈ సంస్థ యూనిట్లు ఉన్నాయి. న్యూక్లిక్‌ యాసిడ్‌ ఆధారిత చికిత్సలతో రోగులు త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉందని సువెన్‌ ఫార్మా ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ అన్నస్వామి వైధీష్‌ అన్నారు. ఈ ప్రత్యేక ఔషధాలను ఉత్పత్తి చేస్తున్న సపల ఆర్గానిక్స్‌ను సొంతం చేసుకోవడం ద్వారా, తమ ఔషధాల శ్రేణి విస్తరిస్తుందని అన్నారు. సపల ఆర్గానిక్స్‌ వ్యవస్థాపకుడు పి.ఎల్లారెడ్డికి న్యూక్లిక్‌ యాసిడ్‌ కెమిస్ట్రీలో ఎంతో అనుభవం ఉంది. ఆర్థిక, సాంకేతిక సత్తా ఉన్న సువెన్‌ ఫార్మాతో కలిసి పనిచేయడం వల్ల సపల ఆర్గానిక్స్‌ సత్వర వృద్ధి సాధిస్తుందని ఎల్లారెడ్డి పేర్కొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని