Tulsi Tanti: ‘విండ్‌మ్యాన్ ఆఫ్‌ ఇండియా’ తులసీ తాంతీ ఇకలేరు

విండ్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచిన ప్రముఖ వ్యాపార వేత్త తులసీ తాంతీ కన్నుమూశారు. 1995లో సుజ్లాన్‌ ఎనర్జీ అనే కంపెనీని స్థాపించి భారత పవన విద్యుదుత్పత్తి రంగంలో ఉన్న అవకాశాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు.

Published : 02 Oct 2022 14:54 IST

దిల్లీ: ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ సుజ్లాన్‌ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసీ తాంతీ (64) కన్నుమూశారు. ఆయనకు భార్య గీతా, కుమారుడు ప్రణవ్‌, కుమార్తె నిధి ఉన్నారు. గుండెపోటుతో ఆయన శనివారం సాయంత్రం మరణించినట్లు కంపెనీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అహ్మదాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశం ముగించుకొని తిరిగొచ్చిన ఆయన పుణెలో ఉండగా ఛాతిలో నొప్పిగా ఉన్నట్లు డ్రైవర్‌కు చెప్పారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరారు. అక్కడికి చేరుకునే లోపే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మన దేశంలో పవన విద్యుదుత్పత్తి రంగంలో ఉన్న అవకాశాల్ని చాటిచెప్పిన తులసీ తాంతీని భారత ‘విండ్‌ మ్యాన్‌’గా వ్యవహరిస్తుంటారు. 1995లోనే సుజ్లాన్‌ ఎనర్జీని స్థాపించి అనతికాలంలో దాన్ని గ్లోబల్‌ సంస్థలతో పోటీపడేలా తీర్చిదిద్దారు. ఆయన నాయకత్వంలోనే సుజ్లాన్‌ 19.4 గిగావాట్ల సామర్థ్యం, 34 శాతం మార్కెట్‌ వాటాతో భారత్‌లోనే అతిపెద్ద పవన విద్యుదుత్పత్తి సంస్థగా ఎదిగింది. దాదాపు 17 దేశాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమెరికాలోనూ 2 గిగావాట్ల వ్యవస్థాపక సామర్థ్యాన్ని సాధించింది. 2003లో తొలిసారి ఈ కంపెనీకి అగ్రరాజ్యం నుంచి ఆర్డర్ వచ్చింది. మిన్నెసోటాలో 24 టర్బైన్ల ఏర్పాటుకు ‘డాన్‌మర్‌ అండ్‌ అసోసియేట్స్‌’ నుంచి ప్రాజెక్టు లభించింది. ఈ రంగంలోకి రావడానికి ముందు తాంతీ వస్త్ర వ్యాపారంలో ఉండేవారు. దాన్ని ఆయన 2001లో విక్రయించారు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 1958లో తులసీ తాంతీ జన్మించారు. గుజరాత్‌ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం వ్యాపారంలోకి ప్రవేశించిన ఆయన 1995లో సుజ్లాన్‌ ఎనర్జీని స్థాపించారు. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ రూ.8,535.9 కోట్లు. బెల్జియం కేంద్రంగా పనిచేస్తున్న ‘జెడ్‌ఎఫ్‌ విండ్‌ పవర్‌ యాంట్వర్‌పెన్‌’కూ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ‘భారత విండ్‌ టర్బైన్‌ తయారీదారుల సమాఖ్య’కు అధ్యక్షుడిగానూ పనిచేశారు. తాంతీ మరణంపై సుజ్లాన్‌ కంపెనీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ కష్టకాలంలో అత్యంత అనుభవం కలిగిన డైరెక్టర్ల బోర్డు, సీనియర్‌ యాజమాన్యం మద్దతుతో కంపెనీ ముందుకు సాగుతుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. తాంతీ కలల్ని నిజం చేసేందుకు కృషి చేస్తామని తెలిపింది.

తాంతీ మరణంపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సహా పలువురు వ్యాపార ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘తులసీ తాంతీ గొప్ప దార్శనికుడు. దేశ ఆర్థిక ప్రగతికి ఆయన ఎంతో కృషి చేశారు. భారత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో తోడ్పాటునందించారు. ఆయన అకాల మరణం నన్ను కలచివేసింది. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని