Suzuki: భారత్‌లో సుజుకీ ₹10 వేల కోట్ల పెట్టుబడులు

భారత్‌లో విద్యుత్తు వాహనాలు (Electric Vehicles), వాటికి సంబంధించిన బ్యాటరీల తయారీకి 2026 నాటికి రూ.10,445 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించింది....

Published : 20 Mar 2022 14:36 IST

దిల్లీ: భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌’ (Suzuki) ఆదివారం ప్రకటించింది. విద్యుత్తు వాహనాలు (Electric Vehicles), వాటికి సంబంధించిన బ్యాటరీల తయారీకి 2026 నాటికి రూ.10,445 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గుజరాత్‌ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (MoU) కుదిరినట్లు తెలిపింది. జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద (Fumio Kishida), భారత ప్రధాని మోదీ (Modi) సమక్షంలో శనివారం దిల్లీలో జరిగిన ‘ఇండియా-జపాన్‌ ఎకానమిక్‌ ఫోరం’లో ఒప్పందంపై సంతకాలు చేసినట్లు పేర్కొంది.

స్వయంసమృద్ధి భారత్‌ లక్ష్య సాధనకు తమవంతు తోడ్పాటునందజేస్తామని సుజుకీ డైరెక్టర్‌, అధ్యక్షుడు తొషిహిరో సుజుకీ తెలిపారు. ఈ క్రమంలో చిన్న కార్లతో కర్బనరహిత లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తామన్నారు. బ్యాటరీ ఆధారిత విద్యుత్తు వాహనాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు తమ అనుబంధ సంస్థ ‘సుజుకీ మోటార్‌ గుజరాత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (SMG)’ రూ.7,300 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు. మరో రూ.3,100 కోట్లు 2025 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కేటాయిస్తామన్నారు.

ప్రస్తుతం గుజరాత్‌, హరియాణాలో ఉన్న సంప్రదాయ వాహన తయారీ కేంద్రాలకు ఏటా 22 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తే సామర్థ్యం ఉందని తొషిహిరో తెలిపారు. అదనంగా మరో 7.5 లక్షల వాహనాలు తయారీ సామర్థ్యం కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఇక తమ మరో అనుబంధ సంస్థ అయిన ‘మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌’ వాహన రీసైక్లింగ్‌కు రూ.45 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు.

భారత్‌లో వచ్చే ఐదేళ్లలో ఐదు ట్రిలియన్‌ యెన్‌ల (సుమారు రూ.3.20 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టనున్నట్టు జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద శనివారం ప్రకటించారు. రక్షణ, ఇంధన రంగంలో సహకారాన్ని పెంపొందించనున్నట్టు వెల్లడించారు. జపాన్‌ ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో భారత్‌కు విచ్చేసిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ‘భారత్‌-జపాన్‌ 14వ వార్షిక శిఖరాగ్ర సమావేశం’లో ప్రధానులిద్దరూ పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ‘ఫలప్రద చర్చలు’ జరిగినట్టు ప్రధాని కార్యాలయం (PMO) వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని