SVB Crisis: 116 ఏళ్ల భారత బ్యాంకుపై ఎస్‌వీబీ సంక్షోభ ప్రభావం!

SVB Crisis: ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న 116 ఏళ్ల కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ సైతం ఎస్‌వీబీ పతనం ప్రభావాన్ని చవిచూస్తోంది.

Published : 12 Mar 2023 12:28 IST

ముంబయి: సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతనం (SVB Crisis) ఇప్పుడు టెక్‌ ప్రపంచంలో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇప్పటికే అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లలో బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీగా పడిపోయాయి. అయితే, ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న 116 ఏళ్ల కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ సైతం ఎస్‌వీబీ పతనం ప్రభావాన్ని చవిచూస్తోంది. 

ఎస్‌వీసీ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ ముంబయి కేంద్రంగా పనిచేస్తోంది. అయితే, దీని పేరు కూడా ఎస్‌వీబీలాగా ఉండడంతో కొంత మంది ఈ బ్యాంకుపై వదంతులు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎస్‌వీసీ స్వయంగా ట్విటర్‌ వేదికగా తెలిపింది. శాంతాక్లారా కేంద్రంగా పనిచేస్తున్న ఎస్‌వీబీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఎస్‌వీసీ వివరణ ఇచ్చింది. నిరాధార వదంతులపై తమ సభ్యులు, కస్టమర్లు, ఇతర స్టేక్‌హోల్డర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎస్‌వీబీ ఉదంతాన్ని ఆసరగా చేసుకొని కొంతమంది తమ బ్రాండ్‌ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఇలా వదంతులు సృష్టిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తమకు పూర్తి హక్కు ఉందని హెచ్చరించింది.

శాంతాక్లారా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థే సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌. అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్‌ ఇది. టెక్‌ ఆధారిత వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌లకు నిధులు అందించడం దీని ప్రత్యేకత. ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ తన పోర్ట్‌ఫోలియోలో నష్టాలను పూడ్చుకోవడం కోసం, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు 21 బిలియన్‌ డాలర్ల సెక్యూరిటీలను విక్రయించినట్లు.. 2.25 బిలియన్‌ డాలర్ల వాటా విక్రయాన్ని నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించింది. ఇక్కడి నుంచే బ్యాంకు వైఫల్య పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. మాతృసంస్థ ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ షేర్లు 35 ఏళ్లలోనే అత్యంత అధ్వానంగా ముగిశాయి. గురువారం ఏకంగా 60% క్షీణించడంతో 80 బిలియన్‌ డాలర్ల నష్టం వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని