SVB crisis: ఎస్‌వీబీ పతనంతో టెక్‌ రంగంలో పెద్ద సంక్షోభం: ఇజ్రాయెల్‌ ప్రధాని

SVB crisis: ఎస్‌వీబీ పతనంతో మొత్తం టెక్‌ రంగంలోనే పెద్ద సంక్షోభం తలెత్తిందని నెతన్యాహు అన్నారు. దీని వల్ల ప్రభావితమయ్యే  ఇజ్రాయెల్‌ టెక్‌ కంపెనీలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Published : 12 Mar 2023 10:52 IST

రోమ్‌: బ్యాంకింగ్‌ షేర్ల పతనానికి కారణమవుతున్న సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (SVB crisis) విషయంపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదంతం మొత్తం సాంకేతిక రంగంలోనే తీవ్ర సంక్షోభాన్ని సృష్టించిందని వ్యాఖ్యానించారు. 2008 వాషింగ్టన్‌ మ్యూచువల్‌ తర్వాత అమెరికన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఇదే అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా (SVB crisis) చెబుతున్న విషయం తెలిసిందే.

‘‘నేను అమెరికా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతనాన్ని చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాను. ఇది టెక్‌ ప్రపంచంలో పెద్ద సంక్షోభానికి దారితీసింది. ఇజ్రాయెల్‌ టెక్‌ రంగంలోని నిపుణులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను. దీని వల్ల ఇజ్రాయెల్‌ టెక్‌ కంపెనీలు, ఉద్యోగులపై ఏదైనా ప్రభావం ఉందేమో విశ్లేషిస్తున్నాం. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే వారిని రక్షించడానికి కావాల్సిన బాధ్యతాయుతమైన చర్యలు తీసుకుంటాం. నగదు ప్రవాహానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ఇజ్రాయెల్‌ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా, స్థిరంగా ఉంది’’ అని నెతన్యాహు అన్నారు.

ప్రస్తుతం నెతన్యాహు రోమ్‌ పర్యటనలో ఉన్నారు. స్వదేశానికి తిగిరి వచ్చిన వెంటనే దేశ ఆర్థిక మంత్రితో పాటు కేంద్ర బ్యాంకు గవర్నర్‌తో చర్చిస్తామని తెలిపారు. ఎస్‌వీబీతో ఆర్థిక సంబంధాలు ఉన్న ఇజ్రాయెల్‌ టెక్ కంపెనీలకు నిధుల సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

శాంతాక్లారా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థే సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌. అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్‌ ఇది. టెక్‌ ఆధారిత వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌లకు నిధులు అందించడం దీని ప్రత్యేకత. ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ తన పోర్ట్‌ఫోలియోలో నష్టాలను పూడ్చుకోవడం కోసం, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు 21 బిలియన్‌ డాలర్ల సెక్యూరిటీలను విక్రయించినట్లు.. 2.25 బిలియన్‌ డాలర్ల వాటా విక్రయాన్ని నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించింది. ఇక్కడి నుంచే బ్యాంకు వైఫల్య పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని