Swiggy: స్విగ్గీ మరో కీలక నిర్ణయం.. డెలివరీ బాయ్స్‌కు బంపర్‌ ఆఫర్‌

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ(Swiggy) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా ఇప్పటికే పలు చర్యలు

Updated : 25 Apr 2022 18:36 IST

న్యూదిల్లీ: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ(Swiggy) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న స్విగ్గీ ఇప్పుడు డెలివరీ బాయ్స్‌ పూర్తి స్థాయి ఉద్యోగులుగా మారే అవకాశం కల్పిస్తానంటోంది. నిర్వహణ సంబంధిత స్థాయిలో ఉద్యోగావకాశాలను ఇవ్వడమే కాకుండా స్థిరమైన ఆదాయం, అదనపు ప్రయోజనాలను అందిస్తామని వెల్లడించింది. ప్రస్తుతం స్విగ్గీ(Swiggy) డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తున్న వారు ‘స్టెప్‌-ఎ హెడ్‌’ కార్యక్రమం కింద ఈ ఉద్యోగాల్లో చేరవచ్చు.

‘‘డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లే మా సంస్థకు వెన్నెముక అని స్విగ్గీ ఎప్పటికీ నమ్ముతుంది. దేశవ్యాప్తంగా 2.7లక్షల మంది మహిళలు/పురుషులకు ఆదాయావకాశాలు కల్పించింది. చదువుకుంటూ, ఉద్యోగం చేస్తూ పార్ట్‌టైమ్‌ జాబ్‌గా లేదా అదనపు ఆదాయ వనరుగా స్విగ్గీ(Swiggy)లో పనిచేస్తున్నారు. అలాంటి వారి కోసం మేము మరిన్ని అవకాశాలు కల్పించాలనుకుంటున్నాం. ‘స్టెప్‌-ఎ హెడ్’ పేరుతో సంస్థ నిర్వహణ స్థాయిలో వైట్‌ కాలర్‌ ఉద్యోగులుగా మారే అవకాశం అందిస్తున్నాం’’ అని సంస్థ నిర్వహణ ఉపాధ్యక్షుడు మిహిర్‌ రాజేశ్‌ షా తెలిపారు.

స్విగ్గీ కల్పిస్తున్న ఫుల్‌టైమ్‌ జాబ్‌లో పనిచేయాలంటే డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లో డిగ్రీ పట్టభద్రులై ఉండాలి. అంతేకాకుండా చక్కటి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఫ్లీట్‌ మేనేజర్స్‌గా వివిధ రకాల పాత్రలు పోషించాల్సి ఉంటుంది. డెలివరీ బాయ్స్‌ లాగిన్‌ అవర్స్‌, డెలివరీ క్యాన్సిలేషన్స్‌, సమస్యల పరిష్కారం, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల కోసం ప్రత్యేక ప్రాజెక్టులపై పనిచేయాల్సి ఉంటుంది.  డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌ నుంచి 20శాతం మందిని ఫ్లీట్‌మేనేజర్స్‌గా నియమించుకోవాలని స్విగ్గీ యోచిస్తోంది. అత్యధిక కాలం స్విగ్గీ(Swiggy) కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం కల్పించనుంది. 

దేశవ్యాప్తంగా స్విగ్గీకి 2.7లక్షల మంది డెలివరీ పార్టనర్‌లు ఉన్నారు. ఇప్పటికే సంస్థ  వీరికి అనేక ప్రయోజనాలు కల్పిస్తోంది. ప్రమాద బీమా, మెడికల్‌ కవర్‌, పర్సనల్‌ లోన్స్‌, న్యాయ సలహా, కొవిడ్‌ ఇన్‌కమ్‌ సపోర్ట్‌, ఎమర్జెన్సీ సపోర్ట్‌, ప్రమాదం/అనారోగ్యం బారిన పడిన వారికి ఆదాయం వచ్చేలా సహకారం ఇలా అనేక ఇతర సౌకర్యాలను అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని