Swiggy Access: క్లౌడ్‌ కిచెన్‌ వ్యాపారానికి స్విగ్గీ గుడ్‌బై

ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా క్లౌడ్‌ కిచెన్‌ వ్యాపారం నుంచి నిష్క్రమించాలని స్విగ్గీ నిర్ణయించింది. ఈ మేరకు తమ స్విగ్గీ యాక్సెస్‌ను కిచెన్స్‌@కు విక్రయించింది.

Published : 03 Mar 2023 14:07 IST

దిల్లీ: వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఫుడ్‌ డెలివరీ వేదిక స్విగ్గీ (Swiggy) కీలక నిర్ణయం తీసుకుంది. తమ క్లౌడ్‌ కిచెన్‌ వ్యాపారం స్విగ్గీ యాక్సెస్‌ (Swiggy Access)ను కిచెన్స్‌@ (Kitchens@)కు విక్రయించినట్లు వెల్లడించింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా స్విగ్గీ (Swiggy) ఇప్పటికే 380 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.

తమ అంచనాలకు అనుగుణంగా వ్యాపార వృద్ధి కొనసాగడం లేదని స్విగ్గీ (Swiggy) సీఈఓ, సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష తెలిపారు. ఈ నేపథ్యంలో లాభదాయకతపై ప్రభావం చూపుతున్న పరోక్ష ఖర్చులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మౌలిక వసతులు, ఆఫీసు స్థలాలు, సదుపాయాల విషయంలో ఖర్చులను నియంత్రించే చర్యల్ని చేపట్టినట్లు గుర్తుచేశారు.

స్విగ్గీ యాక్సెస్‌ (Swiggy Access) 2017లో ప్రారంభమైంది. ఫుడ్‌ డెలివరీకి గిరాకీ ఉండి రెస్టరెంట్లు లేని ప్రాంతాల్లో ప్రత్యేకంగా డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేయడమే ఈ వ్యాపార లక్ష్యం. ఈ కేంద్రాల్లో ఆయా రెస్టరెంట్లు తమ కిచెన్‌లను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా రెస్టరెంట్లకు కూడా తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు అవకాశం ఏర్పడింది. 2017- 19 మధ్య స్విగ్గీ (Swiggy) ఈ వ్యాపారంపై రూ.175 కోట్లు పెట్టుబడి పెట్టింది. మరో రూ.75 కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు ప్రకటించింది. అలాగే 14 నగరాల్లో దాదాపు 10 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సైతం కొనుగోలు చేసింది. కానీ, కరోనా సంక్షోభంతో ప్రణాళికలన్నీ తలకిందులయ్యాయి. ప్రస్తుతం కేవలం నాలుగు నగరాల్లో మాత్రమే స్విగ్గీ యాక్సెస్‌ (Swiggy Access) కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

తాజా ఒప్పందం పూర్తయిన తర్వాత కిచెన్స్‌@లో స్విగ్గీ (Swiggy) వాటాదారుగా మారనుంది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ (Swiggy) రూ.3,628.9 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని