Swiggy ad: హోలీ యాడ్‌పై నెటిజన్ల ఫైర్.. వెనక్కి తగ్గిన స్విగ్గీ!

Swiggy holi ad: హోలీ సందర్భంగా స్విగ్గీ రూపొందించిన ఓ యాడ్‌ వివాదాస్పదమైంది. దీనిపై ఓ వర్గం ప్రజలు అభ్యంతరం తెలపడంతో సదరు యాడ్‌ను స్విగ్గీ తొలగించింది.

Updated : 07 Mar 2023 20:04 IST

స్విగ్గీ తొలగించిన యాడ్‌ ఇదే..

దిల్లీ: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ (Swiggy) ఓ వివాదంలో చిక్కుకుంది. హోలీని (Holi ad) పురస్కరించుకుని రూపొందించిన ఓ యాడ్‌ దీనికి కారణమైంది. దీనిపై ఓ వర్గం ప్రజల నుంచి సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తమవ్వడంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. బిల్‌బోర్డుపై సదరు యాడ్‌ను స్విగ్గీ తొలగించింది.

ఫుడ్‌ డెలివరీతో పాటు కిరాణా సరకులను ఇన్‌స్టామార్ట్‌ పేరిట స్విగ్గీ డెలివరీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఓ యాడ్‌ను రూపొందించింది. అందులో చుట్టూ హోలీ రంగులు, మధ్యలో రెండు కోడిగుడ్ల చిత్రాలను ఉంచింది. ‘గుడ్లను ఆమ్లెట్‌ వేసుకోవడానికి వినియోగించండి.. కానీ ఎవరి తలమీదా కొట్టడానికి కాదు’ అని అర్థం వచ్చేలా ప్రకటనను రూపొందించింది. హోలీకి సంబంధించిన సరకులను ఇన్‌స్టామార్ట్‌లో తెప్పించుకోండి అని పేర్కొంది. దీనికి #BuraMatKhelo అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసింది.

దిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఏర్పాటు చేసిన ఈ యాడ్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో #HinduphobicSwiggy అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు వెల్లువెత్తాయి. స్విగ్గీని బాయ్‌కాట్‌ చేయాలని పిలుపులు ఊపందుకున్నాయి. ఇతర పండగల విషయంలో స్విగ్గీ ఇలాంటి ప్రకటనలు ఎందుకు ఇవ్వదంటూ వీహెచ్‌పీ నేత సాధ్వీ ప్రాచీ అభ్యంతరం వ్యక్తంచేశారు. అన్ని మతాలను గౌరవించాలని, హోలీ ప్రకటనను తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ట్వీట్‌చేశారు. బిల్‌ బోర్డులపై వివాదాస్పదమైన ప్రకటనలు ఇచ్చి లక్షలాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నందుకు స్విగ్గీ క్షమాపణ చెప్పాలని యూపీకి చెందిన భాజపా మాజీ ఎమ్మెల్యే అరుణ్‌ కుమార్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. దీనిపై స్విగ్గీ అధికారికంగా స్పందించనప్పటికీ.. సంబంధిత బిల్లు బోర్డు యాడ్‌ను మాత్రం తొలగించినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని