Alain Berset: బ్యాంకు పతనమైనంత మాత్రాన.. స్విట్జర్లాండ్‌ మునిగిపోయినట్లు కాదు..!

కేవలం ఒక బ్యాంకు పతనమైనంత మాత్రాన స్విట్జర్లాండ్‌ మొత్తం మునిగిపోయినట్లు కాదని ఆ దేశ అధ్యక్షుడు అలైన్‌ బెర్సెట్‌ ఉద్ఘాటించారు.

Published : 11 Apr 2023 23:05 IST

బెర్న్‌: దివాలా అంచున్న ఉన్న స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ బ్యాంకు క్రెడిట్‌ సూయిజ్‌ను (Credit Suisse) యూబీఎస్‌ (UBS) టేకోవర్‌ చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇలా అత్యవసరంగా చర్యలు తీసుకోవడంపై స్విస్‌ ప్రభుత్వంపై అక్కడి చట్టసభ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్రెడిట్‌ సూయిజ్‌-యూబీఎస్‌ ఒప్పందంపై ప్రభుత్వం ఎందుకు మధ్యవర్తిత్వం వహించిందని మండిపడ్డారు. దీనిపై స్పందించిన స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు అలైన్‌ బెర్సెట్‌.. కేవలం బ్యాంకు పతనమైనంత మాత్రాన స్విట్జర్లాండ్‌ మొత్తం మునిగిపోయినట్లు కాదని ఉద్ఘాటించారు.

‘క్రెడిట్‌ సూయిజ్‌ పతనమైనంత మాత్రాన స్విట్జర్లాండ్‌ మొత్తం మునిగిపోయినట్లు కాదు. అది కేవలం బ్యాంకు సంభవించిన నష్టం. అతిపెద్ద బ్యాంకు అయినప్పటికీ అది కేవలం బ్యాంకు మాత్రమే. అంతకుమించి కాదు’ అని పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు అలైన్‌ బెర్సెట్‌ స్పష్టం చేశారు. క్రెడిట్‌ సూయిజ్‌-యూబీఎస్‌ విలీనం విషయంపై జరిగిన చర్చ సందర్భంగా అధ్యక్షుడు బెర్సెట్‌ ఈ విధంగా స్పందించారు.

స్విట్జర్లాండ్‌లో 160 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న అతిపెద్ద బ్యాంకు క్రెడిట్‌ సూయిజ్‌. ఇటీవల ఈ బ్యాంక్‌ పతనం అంచులకు చేరడంతో ఐరోపా బ్యాంకులన్నీ బెంబేలెత్తిపోయాయి. అమెరికాలో ఎస్‌వీబీ, సిగ్నేచర్‌ బ్యాంకులు దివాలా తీసిన నేపథ్యంలో.. రంగంలోకి దిగిన స్విస్‌ ప్రభుత్వం యూబీఎస్‌తో చర్చించి క్రెడిట్‌ సూయిజ్‌ బ్యాంక్‌ను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంది. చివరకు 3.25 బి. డాలర్లతో క్రెడిట్‌ సూయిజ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు యూబీఎస్‌ ప్రకటించింది. మరోవైపు బ్యాంకింగ్‌ సంక్షోభం నుంచి బయటపడేందుకే ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి వచ్చిందని ఆర్థికమంత్రి ఇటీవల స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని