Mutual Funds: ప్ర‌తి నెలా ఆదాయం పొంద‌డానికి SWP స‌రైన‌దేనా?

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత నెల నెలా ఆదాయం పొంద‌డానికి త‌గిన ఆర్ధిక ప్ర‌ణాళిక‌లు అవ‌స‌రం.

Updated : 02 Jul 2022 16:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగాలు చేసే వారికి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే ముందు వ‌ర‌కు ఉపాధి ద్వారా నెల నెలా ఆదాయం వ‌స్తుంది. కానీ, ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం ఇప్పుడు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగాల‌లో ఉద్యోగాలు చేసేవారికి స్వ‌ల్ప‌మొత్తంలో పెన్ష‌న్ మాత్ర‌మే వ‌స్తుంది. అయితే, ఉద్యోగాలు చేసేవారు ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత వారు అనుభ‌వించే జీవ‌న విధానంలో పెద్ద‌గా మార్పులు ఉండ‌వు. ఖ‌ర్చులు దాదాపు అలాగే ఉంటాయి. అందువల్ల ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత నెల నెలా ఆదాయం పొంద‌డానికి త‌గిన ఆర్థిక ప్ర‌ణాళిక‌లు అవ‌స‌రం. వారు సరిపడా ఆదాయ వ‌న‌రు సృష్టించుకోవాలి. అందుకుగాను వారికి సిస్ట‌మాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్‌ (SWP) నెల నెలా ఆదాయం పొంద‌డానికి స‌రిగ్గా స‌రిపోతుంది.

ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వారికే కాకుండా సీనియ‌ర్ సిటిజ‌న్‌లు లేదా స్థిర‌మైన ఆదాయాన్ని ప్ర‌తి నెలా నిర్దిష్ట తేదీకి కోరుకునేవారు సిస్ట‌మాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్‌ (SWP) అనువైన ఎంపిక‌గా ఉంటుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక అనేది ఒక వ్య‌క్తి త‌న జీవితంలో ప్రారంభంలోనే ఆలోచించి చేసుకోవాల్సిన ఆర్థిక ల‌క్ష్యాల్లో కీల‌క‌మైన అంశం. పెట్టుబ‌డిదారు ముందుగా ఒక ఫండ్‌లో కొంత మొత్తాన్ని పెట్టుబ‌డి పెట్టాలి. SWP  సాయంతో ఒక ఫండ్ నుంచి క్ర‌మ‌మైన వ్య‌వ‌ధిలో నిర్ణీత మొత్తాన్ని ఉప‌సంహ‌ర‌ణ చేసుకునే అవ‌కాశం ల‌భిస్తుంది.

అధిక మొత్తంలో న‌గ‌దు గ‌ల‌వారు ఒకేసారి మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెట్టి నెల నెలా నిర్దిష్ట మొత్తంలో న‌గ‌దును ఉప‌సంహ‌ర‌ణ చేసుకోవ‌డాన్ని సిస్ట‌మాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్‌గా పేర్కొంటారు. ఈ ప్లాన్‌ ముఖ్యంగా సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు నెల నెలా ఆర్థిక అవ‌స‌రాల‌ను తీర్చే మంచి ఆర్థిక వ‌న‌రుగా చెప్పొచ్చు. ఇందులో విత్‌డ్రా చేసుకోగా మిగిలే న‌గ‌దు మొత్తానికి అప్ప‌టి లాభాలను బ‌ట్టి కొద్ది కొద్ది మొత్తాలు యాడ్ అవుతూనే ఉంటాయి. దీంతో మ‌రిన్ని నెల‌ల‌కు ఈ న‌గ‌దు మొత్తాన్ని వాడుకోవ‌చ్చు. వాడుకునే మొత్తం స‌రిపోక‌పోతే విత్‌డ్రా మొత్తాన్ని పెంచుకోవ‌చ్చు. ఉప‌సంహ‌ర‌ణ‌లు పెట్టుబ‌డిదారులు ఎంచుకున్న తేదీల్లో నెల‌వారీ, త్రైమాసికం, అర్ధ సంవ‌త్స‌రం లేదా వార్షికంగా ఉప‌సంహ‌ర‌ణ‌కు కూడా అనుమ‌తి ఉంటుంది.

ఉప‌సంహ‌ర‌ణ మొత్తం నెల నెలా ఖ‌ర్చుల‌కు స‌రిపోయే విధంగా ఏర్పాటు చేసుకోవ‌చ్చు. జీవ‌నశైలిలో మార్పులు, జీవిత ల‌క్ష్యాలు, ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా న‌గ‌దు ప్ర‌వాహ అవ‌స‌రాల‌ను కాలానుగుణంగా పునఃప‌రిశీలించ‌వ‌చ్చు. ఈ SWP మీ ఆదాయ అవ‌స‌రాల‌కు, న‌గ‌దు ప్ర‌వాహానికి ఒక మార్గం చూపెడుతుంది.

SWP.. సిస్ట‌మాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)కి వ్య‌తిరేక దిశ‌లో ప‌నిచేస్తుంది. SIPలో మీ బ్యాంక్ ఖాతా నుంచి మ్యూచువ‌ల్ ఫండ్‌కు స్థిర‌మైన మొత్తం క్ర‌మం త‌ప్ప‌కుండా బ‌దిలీ అవుతుంది. దీన్ని SIP అంటారు. అదే మ్యూచువ‌ల్ ఫండ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి నిర్దిష్ట కాలానికి, నిర్దిష్ట మొత్తంలో న‌గ‌దు బ‌దిలీ కావ‌డాన్ని సిస్ట‌మాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్‌ (SWP) అంటారు.

పెట్టుబ‌డిదారుల‌కు వారి ఆర్థిక అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి, న‌గదు ప్ర‌వాహాల‌ను కోరుకునే వారికి SWP ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒక పెట్టుబ‌డిదారుడు SWPని ఎంచుకున్న‌పుడు అత‌డు కొన్ని మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల‌ను రీడీమ్ చేయ‌డం ద్వారా కొన‌సాగుతున్న పెట్టుబ‌డి నుంచి త‌న సొంత డ‌బ్బును క్ర‌మ‌పద్ధతిలో స్వీక‌రిస్తాడు. అంటే.. మీ మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల మొత్తంలో కొంత భాగం మీరు పేర్కొన్న తేదీలో చెల్లింపు మొత్తాన్ని ఇవ్వ‌డానికి విక్ర‌యిస్తారు.

SWP ఎంపిక‌ను ఉప‌యోగిస్తున్న‌ప్పుడు, ఉప‌సంహ‌రించిన యూనిట్ల లాభాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ప‌న్ను విధించినందున స్థిర వ‌డ్డీతో పోలిస్తే దీనిలో ప‌న్ను త‌క్కువ‌గా ఉంటుంది. పెట్టుబ‌డిదారునిగా మీరు మొత్తాన్ని ఒకేసారి ఉప‌సంహ‌ర‌ణ చేయ‌కుండా, అనేక సార్లు, అనేక వ్య‌వ‌ధుల‌లో ఉప‌సంహ‌రించ‌డం వ‌ల్ల సంప‌ద సృష్టి అంత‌ర్గ‌తంగా ప‌నిచేస్తూనే ఉంటుంది. దీనివ‌ల్ల దీర్ఘ‌ కాలం పాటు ఆర్థిక ప్ర‌యోజ‌నం పొందుతారు.

దీర్ఘకాలం కోసం SWP చేయాలనుకునే వారు ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. మంచి రాబడితో పాటు నెల నెలా కొంత మొత్తాన్ని పొందుతూ ఉంటారు. అయితే, ఇందులో రిస్క్ ఉంటుందని గమనించండి. ఒకోసారి పెట్టుబడికి నష్టాలూ రావచ్చు. స్వల్పకాలం కోసం అయితే లిక్విడ్ లేదా ఇతర డెట్ ఫండ్స్ వంటివి ఎంచుకోవచ్చు. వీటిలో రిస్క్ తక్కువ. పూర్తిగా రిస్క్ లేని రాబడి కోరుకునే వారు బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ పధకాలు ఎంచుకోవచ్చు.

చివరిగా: ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వారికి SWP ఒక గొప్ప ఎంపిక‌. భ‌విష్య‌త్‌ ఆర్థిక అవ‌స‌రాల‌ను తీర్చుకోవ‌డానికి మీరు చేయ‌వ‌ల‌సింది ఏమిటంటే ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికే ఒక ఏక మొత్త‌ నిధిని సృష్టించుకోవ‌డం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని