Systematic Transfer Plan: క్రమంగా బదిలీ చేద్దాం.. అధిక రాబడి ఆర్జిద్దాం!

Systematic Transfer Plan: మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి సిప్‌ ఒక్కటే కాదు.. STP అనే మార్గం కూడా అందుబాటులో ఉంది. క్రమంగా ఒక పథకం నుంచి మరో పథకంలోని నిధులను బదిలీ చేస్తూ రాబడి పొందొచ్చు.

Updated : 11 Oct 2022 12:15 IST

Systematic Transfer Plan: మ్యూచువ‌ల్ ఫండ్లలో క్రమానుగుత పెట్టుబ‌డుల‌ (SIP)తో పాటు క్రమానుగత బదిలీ ప‌థ‌కం (Systematic Transfer Plan- STP) కూడా ఉంది. దీనిపై చాలా మందికి పెద్దగా అవగాహన ఉండదు. మదుపర్ల రాబడిని మరింత వృద్ధి చేయడంలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరి STP ప్రయోజనాలేంటి? ఎవరికి సరిపోతుంది? వంటి వివరాలను చూద్దాం..!

మదుపర్లు తమ ఆర్థిక వనరులను ఒక పథకం నుండి మరొకదానికి తక్షణం, ఎటువంటి అవాంతరాలు లేకుండా మార్చుకోవడానికి STP ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బదిలీ క్రమానుగతంగా జరుగుతుంది. అధిక రాబడిని అందించినప్పుడు సెక్యూరిటీలకు మారడం ద్వారా మార్కెట్ ప్రయోజనాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలో మదుపర్ల ప్రయోజనాలను కాపాడుతుంది. తద్వారా నష్టాలను తగ్గిస్తుంది. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను మన ప్రమేయం లేకుండానే అధిక రాబడినిచ్చే పథకాల్లోకి దానికవే బదిలీ చేయడమే ఎస్‌టీపీ ప్రధాన లక్ష్యం. అయితే, ఎస్‌టీపీ ఒకే సంస్థ నిర్వహించే వివిధ పథకాల మధ్య బదిలీకి మాత్రమే అనుమతిస్తుంది. పలు సంస్థల మధ్య నిధుల బదిలీకి అవకాశం ఉండదు.

మూడు రకాల ఎస్‌టీపీ..

ఫ్లెక్సిబుల్ ఎస్‌టీపీ: ఇందులో అవసరమైనప్పుడు బదిలీ చేయవలసిన మొత్తం నిధులను మదుపర్లే నిర్ణయిస్తారు. మార్కెట్ అస్థిరత, స్కీమ్ పనితీరును బట్టి మదుపర్లు ప్రస్తుత ఫండ్‌ నుంచి మరో దానికి బదిలీ చేసుకోవచ్చు.

స్థిర ఎస్‌టీపీ: ఒక మ్యూచువల్ ఫండ్ నుండి మరొకదానికి బదిలీ చేయవలసిన మొత్తం స్థిరంగా ఉంటుంది.

మూలధన ఆధారిత ఎస్‌టీపీ: మార్కెట్‌ రాణించినప్పుడు ఒక ఫండ్‌లో వచ్చిన మొత్తం లాభాలు.. అధిక వృద్ధికి అవకాశం ఉన్న మరో పథకంలోకి బదిలీ అవుతాయి.

ఎస్‌టీపీ ఫీచర్స్‌ ఇవే..

సిస్టమేటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టడానికి సెబీ ఎలాంటి కనీస మొత్తాన్ని నిర్దేశించలేదు. అయితే, చాలా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు కనీస పెట్టుబడిని రూ.12,000గా నిర్ణయించాయి. కనీసం ఆరు నిధుల బదిలీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌పై ఎంట్రీ లోడ్ వర్తించదు. అయితే ప్రతి బదిలీపై ఎగ్జిట్ లోడ్ ఛార్జ్ ఉంటుంది. నిధుల రిడెంప్షన్/బదిలీ సమయంలో గరిష్ఠంగా రెండు శాతం ఎగ్జిట్‌ రుసుముగా వసూలు చేస్తారు. అయితే, లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్‌కి నిధులను బదిలీ చేయడం వల్ల ఎగ్జిట్ లోడ్ కింద ఎటువంటి ఛార్జీలు ఉండవు.

ఎస్‌టీపీ ప్రయోజనాలు..

అధిక రాబడి: మార్కెట్ల ఒడుదొడుకుల సమయంలో మరింత లాభదాయకమైన ఫండ్లలోకి మారడం ద్వారా అధిక రాబడిని పొందేందుకు STPలు అనుమతిస్తాయి. ఈ పద్ధతిలో మార్కెట్ ప్రయోజనాన్ని పొందడం వల్ల సెక్యూరిటీల క్రయవిక్రయాల నుంచి వచ్చే లాభాలు పెరుగుతాయి.

స్థిరత్వం: స్టాక్ మార్కెట్‌లో అస్థిరత ఎక్కువగా ఉన్న సమయంలో మదుపర్లు తమ నిధులను STP ద్వారా డెట్ ఫండ్స్‌ లేదా ఇతర మనీ మార్కెట్ సాధనాల్లోకి బదిలీ చేసుకోవచ్చు. ఫలితంగా సురక్షితమైన పెట్టుబడి పథకాల్లోకి నిధులు వెళతాయి. సాపేక్షంగా అధిక రాబడిని పొందేందుకు వీలు కలుగుతుంది.

పోర్ట్‌ఫోలియోలో సమతుల్యత: ఈక్విటీ, డెట్ సాధనాల మిశ్రమంతో పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు బ్యాలెన్స్‌ చేసుకోవడానికి ఎస్‌టీపీ మెరుగైన సాధనం. రిస్క్, రిటర్న్‌ల మధ్య కూడా సమతుల్యత ఏర్పడుతుంది. పెద్దగా నష్టభయాన్ని భరించలేని వారి నిధుల్ని డెట్‌ పథకాల్లోకి.. రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధపడే వారి మదుపును ఈక్విటీల్లోకి బదిలీ చేసేందుకు వీలుంటుంది.

పన్ను విధింపు: సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ కింద ప్రతి బదిలీకి మూలధన లాభాలు వచ్చినట్లయితే పన్ను మినహాయింపులు ఉంటాయి. ఒకవేళ అటువంటి మ్యూచువల్ ఫండ్స్ నుంచి 3 సంవత్సరాల ముందే పెట్టుబడిని ఉపసంహరించుకుంటే స్వల్పకాలిక మూలధన లాభాల కింద వర్తించే 15 శాతం పన్ను నుంచి మినహాయింపు పొందొచ్చు. అయితే, దీర్ఘకాలిక మూలధన లాభాల నుంచీ పన్ను మినహాయింపులను పొందే అవకాశం ఉన్నప్పటికీ.. అది మదుపర్ల వార్షిక ఆదాయంపై ఆధారపడి ఉంటుంది.

ఎస్‌టీపీ ఎవరికి సరిపోతుంది?

పరిమిత ఆర్థిక వనరులను కలిగి ఉండి.. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల అధిక రాబడి ఆర్జించాలనుకునేవారికి ఎస్‌టీపీలు అనువుగా ఉంటాయి. అలాగే మార్కెట్ల హెచ్చుతగ్గుల సమయంలో సురక్షితమైన డెట్‌ సాధనాల్లోకి నిధులను బదిలీ చేసి నష్టాల్ని పరిమితం చేసుకోవడానికీ ఇవి సరిపోతాయి.

ఈ విషయాలు గుర్తుంచుకోండి..

ఎస్‌టీపీలను దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. ఫలితంగా తక్షణమే అధిక రాబడి కావాలనుకునేవారికి ఇవి సరిపోవు. మరోవైపు ఈ తరహా పథకాల్లో పెట్టుబడి పెట్టే ముందు స్టాక్‌ మార్కెట్‌పై కనీస అవగాహన ఉండాలి. తద్వారా సూచీల కదలికల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకనుగుణంగా నిధులను బదిలీ చేసుకోవచ్చు. ఫలితంగా రాబడిని పెంచుకోవడానికి వీలు కలుగుతుంది. రాబడిని లెక్కించేటప్పుడు ఎగ్జిట్ లోడ్, పన్ను మినహాయింపులను పరిగణనలోకి తీసుకోవాలి. రిస్క్‌ తక్కువే అయినప్పటికీ.. పూర్తిగా ఉండదని మాత్రం చెప్పలేం.

(గమనిక: మ్యూచువల్‌ ఫండ్లలో రాబడి స్టాక్‌ మార్కెట్‌ కదలికలకు అనుగుణంగా ఉంటుంది. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మదుపు చేయాలా.. వద్దా.. అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని