రుణం తీసుకోండి... నైపుణ్యం పెంచుకోండి!

వివిధ రంగాల్లో ప‌నిచేసే వారు త‌మ త‌మ నైపుణ్యాల‌ను అభివృద్ధి ప‌రుచుకునేందుకు భార‌త ప్ర‌భుత్వం ఓ చ‌క్క‌ని అవ‌కాశం క‌ల్పిస్తోంది. అదే నైపుణ్యాభివృద్ధి ప‌థ‌కం. దీని ప్ర‌కారం అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు రుణం పొందేందుకు వీలుంటుంది. ఆర్‌బీఐ సూచించిన బ్యాంకులు ఈ రుణాన్ని మంజూరు చేస్తాయి.

Published : 16 Dec 2020 16:53 IST

నైపుణ్యాల‌ను అభివృద్ధి చేసుకోవాల‌ని ఆశించే వారి కోసం బ్యాంకులు అందించే రుణాల‌పై స‌మ‌గ్ర వివ‌ర‌ణ‌

వివిధ రంగాల్లో ప‌నిచేసే వారు త‌మ త‌మ నైపుణ్యాల‌ను అభివృద్ధి ప‌రుచుకునేందుకు భార‌త ప్ర‌భుత్వం ఓ చ‌క్క‌ని అవ‌కాశం క‌ల్పిస్తోంది. అదే నైపుణ్యాభివృద్ధి ప‌థ‌కం. దీని ప్ర‌కారం అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు రుణం పొందేందుకు వీలుంటుంది. ఆర్‌బీఐ సూచించిన బ్యాంకులు ఈ రుణాన్ని మంజూరు చేస్తాయి.

అర్హ‌త‌:
పారిశ్రామిక శిక్ష‌ణా కేంద్రాలు, పాలిటెక్నిక్ సంస్థ‌లు, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఎడ్యుకేష‌న్ బోర్డుల గుర్తింపు పొందిన శిక్ష‌ణా సంస్థ‌లు,కేంద్ర నైపుణ్యాభివృద్ది కార్పొరేష‌న్‌తో భాగ‌స్వామ్యం క‌లిగిన శిక్ష‌ణా కేంద్రాలలో శిక్ష‌ణ పొందుతున్న అభ్య‌ర్థులు ఈ రుణం పొందేందుకు అర్హులు.

రుణ ప‌రిధిలోకి వ‌చ్చే ఖ‌ర్చులు:
* ట్యూష‌న్ / కోర్సు ఫీజు
* ప‌రీక్ష రుసుము, గ్రంథాల‌య రుసుము, ప్ర‌యోగ‌శాల రుసుము, కాష‌న్ డిపాజిట్‌, పుస్త‌కాల ఖ‌ర్చులు,
* ప‌రిస్థితుల‌ను బ‌ట్టి వ‌స‌తి కోసం అయ్యే ఖ‌ర్చులు
* కోర్సుకు అవ‌స‌ర‌మయ్యే ఇత‌ర వ‌స్తువుల ఖ‌ర్చులు
రుణ మొత్తం:
రూ. ఐదు వేల నుంచి మొద‌లుకొని రూ. ల‌క్షా యాభై వేల వ‌ర‌కూ ఈ ప‌థ‌కం కింద రుణం మంజూరు చేస్తారు. ఈ త‌ర‌హా రుణాల‌పై ఎటువంటి మార్జిన్ ఉండ‌దు.  అంటే మొత్తం రుణాన్ని బ్యాంకే మంజూరు చేస్తుంది. ఈ రుణాల‌కు ఎటువంటి పూచీక‌త్తు అవ‌స‌రం లేదు.

వ‌డ్డీ,  ఇత‌ర రుసుములు:
బ్యాంకులను బ‌ట్టి రుణాల‌పై వ‌సూలు చేసే వ‌డ్డీ రేట్ల‌లో స్వ‌ల్ప మార్పులు ఉండ‌వ‌చ్చు. ప్ర‌స్తుతానికి వ‌డ్డీ రేట్లు 11-12 శాతం మ‌ధ్య‌లో ఉన్నాయి. ఈ రుణానికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు వ‌సూలు చేయ‌రు.

రుణ తిరిగి చెల్లింపు:
రుణాల‌ను తిరిగి చెల్లించేందుకు రుణ‌గ్ర‌హీత‌ల‌కు త‌గినంత గ‌డువు ఇస్తారు. సంవ‌త్స‌రం లోపు కోర్సుల‌కు - కోర్సు పూర్తి చేసిన 6 నెల‌ల వ‌ర‌కూ,  సంవ‌త్స‌రం పైబ‌డిన కోర్సుల‌కు - కోర్సు పూర్తి చేసిన 12 నెల‌ల మార‌టోరియం పీరియ‌డ్ ఉంటుంది. ఈ కాలంలో సాధార‌ణ వ‌డ్డీ వ‌సూలు చేస్తారు. 
రుణ మొత్తాన్ని బ‌ట్టి చెల్లింపు గ‌డువును నిర్ణ‌యిస్తారు.

* రూ. 50 వేల వ‌ర‌కూ - 3 సంవ‌త్స‌రాలు
* రూ. 50 వేల నుంచి రూ. ల‌క్ష వ‌ర‌కూ - 5 సంవ‌త్స‌రాలు
* రూ. ల‌క్ష పైన - 7 సంవ‌త్స‌రాలు
ముంద‌స్తు చెల్లింపు:
రుణ గ్ర‌హీత ఎటువంటి ముంద‌స్తు రుసుములు లేకుండా రుణాన్ని తిరిగి చెల్లించ‌వ‌చ్చు. ప్ర‌మాదం / మ‌ర‌ణం  / వైక‌ల్యం కార‌ణంగా విద్యార్థి కోర్సు పూర్తిచేయ‌లేకపోతే శిక్ష‌ణా సంస్థ నుంచి మిగిలిన శిక్ష‌ణా కాలానికి సంబంధించిన సొమ్మును ప్రొరేటా రీయింబ‌ర్స్‌మెంట్ ప‌ద్ద‌తిలో వెన‌క్కి తీసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థుల‌కు ప‌రిమితి మేర‌కు రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తాయి. ఈ రుణంతో నైపుణ్యాన్ని అభివృద్ది ప‌రుచుకొని స‌రైన ఉపాధిని పొంద‌వ‌చ్చు. కోర్సు ద్వారా స్వ‌యం ఉపాధి  / ఉద్యోగం పొందిన విద్యార్థులు వీలైనంత త్వ‌ర‌గా రుణాన్ని తీర్చివేస్తే మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని