TATA Group: ఐదేళ్లలో రూ.7లక్షల కోట్ల పెట్టుబడులు.. టాటా గ్రూప్‌ భారీ ప్రణాళికలు!

వచ్చే ఐదేళ్లలో దాదాపు 90 బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల లక్ష్యాన్ని టాటా గ్రూప్‌ నిర్దేశించుకున్నట్లు సమాచారం...

Updated : 16 Sep 2022 12:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికత వ్యాపార స్వరూపాల్నే మార్చేస్తోంది. ఇంధనం, కమ్యూనికేషన్‌, ఎఫ్‌ఎంసీజీ, రవాణా సహా అనేక రంగాల్లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అవకాశాల్ని చేజార్చుకోకుండా దేశీయ కంపెనీలు జాగ్రత్తపడుతున్నాయి. కొత్త పోకడలకు అనుగుణంగా వ్యూహాల్ని రచిస్తున్నాయి. నూతన రంగాల్లోకి పెట్టుబడులను మళ్లిస్తున్నాయి. వచ్చే కొన్నేళ్ల పాటు ప్రపంచ వేదికపై భారత్‌ హవా కొనసాగనుందన్న అంచనాలకు అనుగుణంగా దేశీయ కంపెనీలు తమని తాము తీర్చిదిద్దుకుంటున్నాయి. ఈ మేరకు భారీ ఎత్తున పెట్టుబడులను ప్రకటించాయి.

అంబానీ, అదానీలను మించి టాటా...

బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ వచ్చే ఐదేళ్లలో వివిధ రంగాల్లో 55 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. మరోవైపు ముకేశ్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సైతం 75 బిలియన్‌ డాలర్ల విలువ చేసే పెట్టుబడుల ప్రణాళికలను వెల్లడించింది. తాజాగా ఈ జాబితాలో మరో దేశీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌ కూడా చేరింది. ఈ కంపెనీ ఏకంగా 90 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.7.18 లక్షల కోట్లు) పెట్టుబడుల్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. మొబైల్‌ పరికరాల తయారీ, సెమీకండక్టర్లు, విద్యుత్తు వాహనాలు, బ్యాటరీలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ఇ-కామర్స్‌ రంగాల్లోకి వీటిని మళ్లించనుంది. ఇటీవల ‘ది ఎకానమిస్ట్‌’కు ఇచ్చిన ముఖాముఖిలో టాటా గ్రూప్‌ సంస్థల హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ఈ వివరాలను పంచుకున్నారు. టాటా గ్రూప్‌ దేశీయ విపణిపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.

ఐఫోన్‌తో మొబైల్‌ పరికరాల తయారీలోకి..

యాపిల్‌కు పరికరాలను సరఫరా చేసే తైవాన్‌ సంస్థ విస్ట్రన్‌ కార్ప్‌తో టాటా గ్రూప్‌ చర్చలు జరుపుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విస్ట్రన్‌తో కలిసి భారత్‌లో ఎలక్ట్రానిక్స్‌ ప్లాంటు నెలకొల్పి, అందులో ఐఫోన్ల అసెంబ్లింగ్‌ చేపట్టాలని టాటా గ్రూపు భావిస్తోందని సమాచారం. విస్ట్రన్‌తో ఒప్పందానికి సంబంధించి టాటాల చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది. టాటా గ్రూపు భారత్‌లోని విస్ట్రన్‌ కార్యకలాపాల్లో వాటా కొనుగోలు చేస్తుందా లేదంటే కొత్త అసెంబ్లింగ్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై టాటా గ్రూప్‌ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

వచ్చే ఐదేళ్లలో 60% స్వచ్ఛ ఇంధనం..

మరోవైపు దేశవ్యాప్తంగా 350 జాతీయ రహదారుల వెంట 450 ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు టాటా పవర్‌ వెల్లడించింది. 2023 నాటికి ఈ సంఖ్యను 6,500 పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఐదేళ్లలో టాటా వపర్‌ హరిత ఇంధన రంగంలో రూ.75,000 కోట్లు వెచ్చించనున్నట్లు చంద్రశేఖరన్‌ తాజాగా వెల్లడించారు. దీంట్లో రూ.10,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలోనూ నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా టాటా గ్రూప్‌ ముందుకు సాగుతోంది. గత ఏడాది కొత్తగా 707 మెగావాట్ల సామర్థ్యాన్ని జోడించుకుంది. దీంతో కంపెనీ మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యంలో హరిత, స్వచ్ఛ ఇంధన వాటా 34 శాతానికి చేరినట్లు ఛైర్మన్‌ తెలిపారు. ఈ వాటాను వచ్చే ఐదేళ్లలో 60 శాతానికి పెంచుకోనున్నట్లు వెల్లడించారు.

తమిళనాడులో ప్లాంటు..

తమిళనాడులోని కృష్ణగిరిలో మొబైల్‌ఫోన్‌ పరికరాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు టాటా ఎలక్ట్రానిక్స్‌ ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కేంద్రంలోనే తాజాగా ఐఫోన్‌ తయారీని కూడా చేపట్టేందుకు టాటా గ్రూప్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుతో తమిళనాడులో దాదాపు 20 వేల ఉద్యోగాల కల్పన జరగనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని