TATA Nexon: టాటా నెక్సాన్‌ ఈవీ ధరల తగ్గింపు.. కొత్త ట్రిమ్‌ల జోడింపు!

ప్రత్యర్థి సంస్థలు కొత్త కార్లను ప్రవేశపెట్టిన నేపథ్యంలో టాటా మోటార్స్‌ తమ నెక్సాన్‌ ఈవీ ధరల శ్రేణిని తగ్గించింది. అలాగే కొత్త ట్రిమ్‌లను తీసుకొచ్చింది.

Published : 18 Jan 2023 19:28 IST

దిల్లీ: టాటా మోటార్స్ తమ నెక్సాన్ విద్యుత్‌ కార్ల శ్రేణిని మార్కెట్‌లో రీపొజిషన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. పోటీ సంస్థల నుంచి కొత్త కార్లు విడుదలైన నేపథ్యంలో నెక్సాన్‌ ఈవీ ధరల్లో మార్పులతో పాటు కొత్త ట్రిమ్‌లను జోడిస్తున్నట్లు తెలిపింది.

నెక్సాన్‌ ఈవీ శ్రేణి ధర ఇప్పుడు రూ. 14.49 లక్షల నుంచి ప్రారంభమైంది. నెక్సాన్‌ ఈవీ ప్రైమ్‌ ధరల శ్రేణి రూ. 14.49- 16.99 లక్షల (ఎక్స్‌-షోరూం) మధ్య ఉంది. అంతకుముందు వీటి ప్రారంభ ధర రూ.14.99 లక్షలుగా ఉండేది. ఈవీ మ్యాక్స్‌లో సంస్థ కొత్త ట్రిమ్‌లను తీసుకొచ్చింది. ధరల శ్రేణి రూ. 16.49 లక్షలు నుంచి రూ. 18.99 లక్షలుగా ఉంది. మ్యాక్స్‌ వేరియంట్ల ప్రయాణ రేంజ్‌ను 437 కి.మీ నుంచి 453 కి.మీకు పెంచే యోచనలో ఉన్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. కొత్త ఈవీ మ్యాక్స్‌లను కొనుగోలు చేసేవారికి 2023 ఫిబ్రవరి 15 నుంచి డీలర్‌షిప్‌లలో సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆ ప్రక్రియ పూర్తయితే రేంజ్‌ పెరుగుతుందని పేర్కొంది.

నెక్సాన్‌ ఈవీలోని అన్ని ట్రిమ్‌లకు ప్రస్తుతం బుకింగ్‌లు ప్రారంభమైనట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. కొత్తగా తీసుకొచ్చిన ఈవీ మ్యాక్స్‌ ఎక్స్‌ఎం వేరియంట్‌ డెలివరీలు 2023 ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపింది. మరోవైపు మహీంద్రా అండ్‌ మహీంద్రా ఇటీవలే ఎక్స్‌యూవీ 400ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 15.99 లక్షలు. ఈ ధరల శ్రేణిలోనే మరికొన్ని కంపెనీలు కూడా ఈ ఏడాది కార్లను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టాటా మోటార్స్‌ తమ నెక్సాన్‌ లైనప్‌లో మార్పులు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని