SUV price cut: ఎస్‌యూవీలపై టాటా, మహీంద్రా బిగ్‌ డిస్కౌంట్‌

Tata motors- Mahindra price cut: ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీలైన టాటా, మహీంద్రా తమ ఎస్‌యూవీల ధరలను తగ్గించాయి.

Published : 10 Jul 2024 15:25 IST

SUV price cut | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ ఆటో మొబైల్‌ కంపెనీలు తమ ఎస్‌యూవీల ధరలను తగ్గిస్తున్నాయి. ప్రముఖ కంపెనీలైన టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఇప్పటికే వివిధ మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించాయి. డిమాండ్‌ను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎక్స్‌యూవీ 700ను తీసుకొచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏ7 శ్రేణి వాహన ధరలను రూ.2.లక్షల వరకు తగ్గించింది. ఈ మోడల్‌ ధరలు ఇకపై రూ.19.49 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు నెలల పాటు తగ్గించిన ధరలు అందుబాటులో ఉంటాయని మహీంద్రా ఓ ప్రకటనలో పేర్కొంది. మార్కెట్లో ఈ మోడల్‌ ఇప్పటికే విక్రయాల పరంగా 2 లక్షల మైలురాయిని అందుకుంది.

మరో ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటార్స్‌ సైతం తన ఫ్లాగ్‌షిప్‌ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.70వేల వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతో పాటు రూ.1.4 లక్షల విలువైన ప్రయోజనాలనూ అందిస్తోంది. టాటా మోటార్స్ తాజా నిర్ణయంతో పాపులర్‌ ఏయూవీలైన హ్యారియర్‌ (రూ.14.99 లక్షలు), సఫారీ (రూ.15.49 లక్షలు) ధరలు దిగొచ్చాయి. వీటితో పాటు నెక్సాన్‌.ఈవీ పైనా రూ.1.3 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు టాటా మోటార్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. పంచ్‌.ఈవీ పైనా రూ.30వేల వరకు ప్రయోజనాలను అందించనున్నట్లు తెలిపింది.

కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?

కారణం ఇదే..

దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో ప్రస్తుతం స్తబ్దత నెలకొంది. జూన్‌ నెల రిటైల్ సేల్స్‌లో కేవలం 0.73 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. పాసింజర్‌, కమర్షియల్‌ వాహన విక్రయాల్లో క్షీణత నమోదైంది. దీంతో ఇన్వెంటరీ పేరుకుపోతోంది. 62-67 రోజుల ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరుకుంది. ఈనేపథ్యంలో ఆయా కార్ల తయారీ కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటించడం గమనార్హం. దీంతో డిమాండ్‌ పెరుగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. మరోవైపు స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ కార్లకు రిజిస్ట్రేషన్‌ ఫీజుపై యూపీ ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడం ఆయా కంపెనీలకు కలిసొచ్చే అంశం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని