Tata motors: ఇక ఊళ్లకే కార్‌ షోరూమ్‌.. టాటా మోటార్స్‌ శ్రీకారం

గ్రామీణ ప్రాంతాల్లో కార్ల విక్రయాలు పెంచుకోవడానికి టాటా మోటార్స్‌ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా మొబైల్‌ షోరూమ్‌లను తీసుకొస్తోంది.

Published : 03 Mar 2022 19:21 IST

దిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో కార్ల విక్రయాలు పెంచుకోవడానికి టాటా మోటార్స్‌ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా మొబైల్‌ షోరూమ్‌లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా 100కు పైగా మొబైల్‌ షోరూమ్‌లను ప్రారంభిస్తున్నట్లు టాటా మోటార్స్‌ గురువారం తెలిపింది. షోరూమ్‌ ఆన్‌ వీల్స్‌ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమానికి అనుభవ్‌ అని నామకరణం చేసింది.

దేశవ్యాప్తంగా 103 మొబైల్‌ షోరూమ్‌లను ప్రారంభిస్తున్నట్లు టాటా మోటార్స్‌ పేర్కొంది. వీటి ద్వారా కంపెనీ డీలర్లు తమ మార్కెట్‌ను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించే వీలుంటుందని తెలిపింది. మొబైల్‌ షోరూమ్‌ల వద్ద కొత్త కారు మోడళ్ల వివరాలతో పాటు, అందుబాటులో ఉన్న ఫైనాన్స్‌ సదుపాయాలు, టెస్ట్‌ డ్రైవ్‌ బుకింగ్‌, ఎక్స్ష్చేంజీపై వచ్చే మొత్తం వంటి వివరాలు ఈ షోరూమ్‌ల వద్ద లభిస్తాయని టాటా మోటార్స్‌ పాసింజర్‌ వెహికల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌ కస్టమర్‌ కేర్‌) రాజన్‌ అంబా తెలిపారు. 

దీని ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల అభీష్టాలను తెలుసుకోవడంతో పాటు, విస్తరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ఇది పనికొస్తుందని అంబా పేర్కొన్నారు. దేశంలో విక్రయించే పాసింజర్‌ వెహికల్స్‌ 40 శాతం వాటా గ్రామీణ భారతం నుంచే ఉంటోందని, దీన్ని మరింత పెంచుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. టాటా మోటార్స్‌ సూచనల మేరకు, కంపెనీ పర్యవేక్షణలో ప్రస్తుతం ఉన్న డీలర్లే మొబైల్‌ షోరూమ్‌లను నిర్వహిస్తారని కంపెనీ పేర్కొంది. ప్రతి నెలా నిర్దేశిత రూట్లలో ఈ మొబైల్‌ షోరూమ్‌లు తిరుగుతాయని, లక్షిత గ్రామాలు, మండలాలను కవర్‌ చేస్తాయని తెలిపింది. ప్రతి మొబైల్‌ వ్యాన్‌లోనూ జీపీఎస్‌ ట్రాకర్‌ ఉంటుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని