Tata Motors: ఉబర్‌తో టాటా మోటార్స్‌ బిగ్‌ డీల్‌.. 25వేల ఈవీలకు ఆర్డర్‌

Tata Motors MoU with Uber: ఉబర్‌తో టాటా మోటార్స్‌ ఒప్పందం కుదర్చుకుంది. దశలవారీగా 25 వేల విద్యుత్‌ కార్లను సరఫరా చేయనుంది.

Published : 20 Feb 2023 20:35 IST

దిల్లీ: విద్యుత్‌ వాహన రంగంలో తొలిసారి అతిపెద్ద డీల్‌ కుదిరింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ (Tata Motors), ట్యాక్సీ సేవలందించే ఉబర్‌ (Uber) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 25 వేల ఎక్స్‌ప్రెస్‌-టి (XPRES-T) విద్యుత్‌ వాహనాలను ఉబర్‌కు టాటా మోటార్స్‌ సరఫరా చేయనుంది. ఈ కార్లను ఉబర్‌ తన ప్రీమియం కేటగిరీ సర్వీసులకు గానూ వినియోగించుకోనుందని ఇరు సంస్థలు ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

టాటా సరఫరా చేసే ఈ విద్యుత్‌ వాహనాలను దిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌లో ఉబర్‌ నడపుతుంది. ఈ నెల నుంచి దశలవారీగా ఈ కార్లను టాటా మోటార్స్‌ సరఫరా చేయనుంది. ఇరు సంస్థల మధ్య ఎంత మొత్తానికి ఈ ఒప్పందం కుదిరిందీ వెల్లడించలేదు. దేశంలో విద్యుత్‌ వాహనాలకు ఊతమిచ్చేందుకు గానూ ఉబర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా మోటార్స్‌ పాసింజర్‌ వెహికల్స్‌ ఎండీ శైలేష్‌ చంద్ర ఈ సందర్భంగా తెలిపారు. దీనివల్ల తమ మార్కెట్‌ వాటా మరింత బలోపేతం అవుతుందన్నారు. నెట్‌ జీరో లక్ష్యాలను చేరుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఉబర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ప్రబ్‌జీత్‌ సింగ్‌ తెలిపారు.

టాటా మోటార్స్‌ 2021 జులైలో ఫ్లీట్‌ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్‌ బ్రాండ్‌ను తీసుకొచ్చింది. ఎక్స్‌ప్రెస్‌-T ఈవీ ఈ బ్రాండ్‌ నుంచి వచ్చిన తొలి వాహనం. ఈ సెడాన్‌ ధర రూ.13.04 లక్షల (ఎక్స్‌షోరూమ్‌ దిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో రెండు వేరియంట్స్‌ ఉన్నాయి. ఒక వేరియంట్‌ సింగిల్‌ ఛార్జ్‌తో 277 కిలోమీటర్లు వెళుతుంది. మరో వేరియంట్‌ 315 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని ధరను రూ.14.98 లక్షలుగా నిర్ణయించారు. ఫేమ్‌ సబ్సిడీ కింద 2.6 లక్షలు రాయితీ లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని