iPhone: ఐఫోన్‌ తయారీ దిశగా వడివడిగా ‘టాటా’ అడుగులు!

బెంగళూరులో విస్ట్రోన్‌కు చెందిన ఐఫోన్‌ తయారీ కేంద్రాన్ని చేజిక్కించుకునే దిశగా టాటా గ్రూప్‌ వడి వడిగా అడుగులు వేస్తోంది.

Published : 10 Jan 2023 15:25 IST

దిల్లీ: భారత్‌లోనూ ఐఫోన్లు (iPhone) తయారవుతున్నప్పటికీ.. వాటిని విదేశీ కంపెనీలే చేపడుతున్నాయి. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌, విస్ట్రోన్‌, పెగాట్రాన్‌ దేశీయంగా తయారీ కేంద్రాలను నెలకొల్పి యాపిల్‌ (Apple) ఉత్పత్తుల్ని తీసుకొస్తున్నాయి. అయితే, టాటా గ్రూప్‌ (TATA Group) తొలి దేశీయ ఐఫోన్‌ (iPhone) తయారీ కంపెనీగా నిలిచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే విస్ట్రోన్‌తో ప్రారంభించిన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. బెంగళూరుకు సమీపంలో ఉన్న విస్ట్రోన్‌ కేంద్రంలో మెజారిటీ వాటాలు దక్కించుకునేందుకు టాటా గ్రూప్‌ (TATA Group) తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

మార్చి ఆఖరు కల్లా..

విస్ట్రోన్‌ సాయంతో తయారీ కార్యకలాపాలను పూర్తిగా చేజిక్కించుకోవాలన్నది టాటా గ్రూప్‌ యోచనగా తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్ తయారీలో చైనాకు పోటీ ఇవ్వాలన్న భారత ప్రణాళికలకు టాటా గ్రూప్‌ చేస్తున్న యత్నాలు దన్నుగా నిలవనున్నాయి. మార్చి 31 నాటికి టాటా- విస్ట్రోన్‌ చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఈ డీల్‌ ఖరారైతే ఐఫోన్ల తయారీని ‘టాటా ఎలక్ట్రానిక్స్‌’ చేపట్టే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే తయారీ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను కూడా టాటా గ్రూప్‌ ఉపయోగించుకునే అవకాశం ఉంది.

విస్ట్రోన్‌ అందుకే విక్రయిస్తోందా?

తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌, విస్ట్రోన్‌, పెగాట్రాన్‌ భారత్‌లో ఐఫోన్‌ తయారీని చేపడుతున్నాయి. అయితే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం సర్వర్ల తయారీ వంటి ఇతర విభాగాలకూ విస్తరించే యోచనలో విస్ట్రోన్‌ ఉంది. ఈ క్రమంలోనే భారత్‌లో ఐఫోన్‌ తయారీ నుంచి నిష్క్రమించాలని భావిస్తోందని సమాచారం. బెంగళూరుకు 50 కిలోమీటర్ల దూరంలో విస్ట్రోన్‌ తయారీ కేంద్రం ఉంది. ఒకవేళ ఒప్పందం ఖరారైతే.. ఎనిమిది ఐఫోన్‌ తయారీ లైన్లు టాటా చేతికి వెళ్లనున్నాయి. 10,000 మంది కార్మికులు కూడా టాటా గ్రూప్‌ యాజమాన్యం కింద పనిచేయనున్నారు.

యాపిల్‌- టాటా బంధం బలోపేతం..

యాపిల్‌తో సంబంధాలను టాటా మరింత పటిష్ఠం చేసుకుంటోంది. ఇప్పటికే హోసూర్‌లో ఐఫోన్‌లో ఉపయోగించుకునే పరికరాలను తయారు చేస్తోంది. ఇటీవలే అక్కడ భారీ ఎత్తున నియామకాలను చేపట్టింది. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్‌లోనే టాటా కొత్తగా ఐఫోన్‌ తయారీ లైన్లనూ జత చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు దేశవ్యాప్తంగా యాపిల్‌ స్టోర్లనూ ప్రారంభించనున్నట్లు ఇప్పటికే టాటా గ్రూప్‌ ప్రకటించింది. ఈ త్రైమాసికంలోనే ముంబయిలో తొలి స్టోర్‌ తెరవనున్నట్లు ఇటీవలే తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని