TATA Digital: అంచనాలు తప్పిన ‘టాటా డిజిటల్‌’ వ్యూహాలు..?

ఇ-కామర్స్‌పై పట్టుకోసం టాటా గ్రూప్‌ గత కొన్నేళ్లుగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో టాటా న్యూ సూపర్‌యాప్‌ను తీసుకొచ్చింది. కానీ, దాన్ని విడుదల చేసిన తొలి ఏడాదిలో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని సమాచారం.

Published : 11 Jan 2023 20:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాటా గ్రూప్‌ (TATA Group) ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సూపర్‌ యాప్‌ ‘టాటా న్యూ (TATA Neu)’ విక్రయాలు లక్ష్యాన్ని అందుకునే అవకాశం లేదని సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే వచ్చిన ఈ యాప్‌ నిర్దేశిత లక్ష్యంలో కనీసం 50 శాతం విక్రయాలను కూడా అందుకోలేకపోయిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కంపెనీ ఉన్నతోద్యోగి ఒకరు తెలిపారు. దీంతో టాటా గ్రూప్‌ తమ డిజిటల్‌ వ్యూహాలను పూర్తిగా సమీక్షించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ స్వయంగా ‘టాటా న్యూ (TATA Neu)’ ప్రాజెక్టును పర్యవేక్షించిన విషయం తెలిసిందే.

8 బి.డాలర్లకు.. 4 బి.డాలర్లే..

టాటా డిజిటల్‌ నిర్వహణలో ఉన్న ‘టాటా న్యూ (TATA Neu)’ 2022 ఏప్రిల్‌లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. 2023 మార్చి 31 నాటికి 8 బిలియన్‌ డాలర్ల విక్రయాలను అందుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ, తమ డిజిటల్‌ వేదికగా 4 బిలియన్‌ డాలర్లు విలువ చేసే అమ్మకాలు మాత్రమే జరిగే అవకాశం ఉందని ఇటీవల అంచనా వేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుత వ్యూహాలను పూర్తిగా పక్కనపెట్టి కొత్త ప్రణాళికలు రచించాలని టాటా డిజిటల్‌ సీఈఓ ప్రతీక్‌ పాల్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ విషయంపై టాటా గ్రూప్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

ఇ-కామర్స్‌పై పట్టుకోసం..

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఇ-కామర్స్‌ దిగ్గజాలకు పోటీ ఇవ్వడమే లక్ష్యంగా టాటా గ్రూప్‌ ‘టాటా న్యూ (TATA Neu)’ సూపర్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో చైనాకు చెందిన అలీపే, వీచాట్‌ తరహాలోనే దీన్ని తీర్చిదిద్దాలని యోచిస్తోంది. అయితే, విడుదలైన తొలిరోజుల్లో అనేక సాంకేతిక సమస్యలు ఎదురవ్వడంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇ-కామర్స్‌ రంగంపై పట్టు సాధించేందుకు గత మూడేళ్లుగా టాటా గ్రూప్‌ (TATA Group) యత్నిస్తోంది. ఈ క్రమంలో 12 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇ-గ్రోసర్‌ ‘బిగ్‌బాస్కెట్‌’, ఇ-ఫార్మసీ ‘1ఎంజీ’ని కొనుగోలు చేసింది. అయితే, టాటా గ్రూప్‌ (TATA Group) నకు చెందిన ఎలక్ట్రానిక్‌ వస్తువుల రిటైలర్‌ క్రోమా, బిగ్‌బాస్కెట్‌ల వృద్ధి అంచనాల కంటే నెమ్మదిగా సాగుతున్నట్లు సమాచారం. టాటా డిజిటల్‌ ఆదాయంలో ఈ రెండింటిదే మెజారిటీ వాటా. మరోవైపు వ్యాపార విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా టాటా గ్రూప్‌ (TATA Group) నిధులను సమీకరించలేకపోవడం కూడా లక్ష్యాలను అందుకోకపోవడానికి కారణమని కంపెనీతో సంబంధం ఉన్న ఓ ఉన్నతోద్యోగి తెలిపారు.

అప్పటికల్లా చక్కబెట్టాలని..

భారత వ్యాపార దిగ్గజాలైన గౌతమ్‌ అదానీ, ముకేశ్‌ అంబానీ సైతం సూపర్‌ యాప్‌లను తీసుకొచ్చే యోచనలో ఉన్నారు. ఈ మేరకు ఇప్పటికే అదానీ గ్రూప్‌, రిలయన్స్‌ స్పష్టమైన సంకేతాలిచ్చాయి. ఈ నేపథ్యంలో అవి రంగంలోకి రావడానికి ముందే టాటా న్యూ (TATA Neu)ను గాడిన పెట్టాలని టాటా గ్రూప్‌ (TATA Group) యోచిస్తోంది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. ఒకవేళ ఇది కుదరకపోతే.. టాటా డిజిటల్‌లో భాగమైన బిగ్‌బాస్కెట్‌ వంటి వ్యాపారాల్లో వాటాలను విక్రయించి నిధులను సమీకరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని