Tata Digital: టాటా డిజిటల్‌లో టాటా సన్స్‌ ₹5882 కోట్ల పెట్టుబడి

ఈ-కామర్స్‌ రంగంలో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పోటీపడేందుకు దేశీయ దిగ్గజం టాటా గ్రూప్‌ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తమ ఈ-కామర్స్‌ కంపెనీ టాటా డిజిటల్‌లో మార్చిలో టాటా సన్స్‌ రూ.5,882 కోట్లు పెట్టుబడిగా పెట్టింది....

Published : 09 Apr 2022 15:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ-కామర్స్‌ రంగంలో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పోటీపడేందుకు దేశీయ దిగ్గజం టాటా గ్రూప్‌ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తమ ఈ-కామర్స్‌ కంపెనీ టాటా డిజిటల్‌లో మార్చిలో టాటా సన్స్‌ రూ.5,882 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. ఇప్పటి వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ-కామర్స్‌లో టాటా గ్రూప్‌ ఒకేసారి ఇంత మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి. దీంతో టాటా డిజిటల్‌లో మొత్తం పెట్టుబడులు 2021-22లో రూ.11,872 కోట్లకు చేరింది.

మార్చి 30న భేటీ అయిన టాటా డిజిటల్‌ బోర్డు టాటా సన్స్‌కు రూ.10 ముఖ విలువ కలిగిన 5.88 బిలియన్ల ఫుల్లీ పెయిడ్‌-అప్‌ ఈక్విటీ షేర్లను కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. టాటా గ్రూప్‌ ఎలక్ట్రానిక్‌ రిటైల్‌ చైన్‌ క్రోమాలోనూ హోల్డింగ్‌ కంపెనీగా ఉన్న టాటా డిజిటల్‌లో టాటా సన్స్‌ గత ఆర్థిక సంవత్సరం పలు దశల్లో రూ.5,990 కోట్లు పెట్టుబడిగా పెట్టింది.

రోజురోజుకీ భారత్‌లో ఈ-కామర్స్‌ తద్వారా డిజిటల్‌ ఎకానమీ పుంజుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఈ రంగంలో రాణించేందుకు సిద్ధమైన టాటా గ్రూప్‌ ఏప్రిల్‌ 7న ‘టాటా న్యూ’ పేరిట సూపర్‌ యాప్‌ను కూడా విడుదల చేసింది. దీని ద్వారా ఎయిరేషియా, బిగ్‌బాస్కెట్‌, క్రోమా, ఐహెచ్‌సీఎల్‌, క్యూమిన్‌, స్టార్‌బక్స్‌, టాటా 1ఎంజీ, క్లిక్‌, టాటా ప్లే సహా అనేక సేవలు వినియోగదారులకు ఒకే వేదికపై అందుబాటులోకి రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని