TCS: టీసీఎస్‌ బైబ్యాక్‌లో టాటా సన్స్‌కు ₹11 వేల కోట్ల ఆదాయం

ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ప్రకటించిన రూ.18,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌లో పాల్గొన్న ప్రమోటర్‌ సంస్థ టాటా సన్స్ రూ.11,164 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది....

Published : 29 Mar 2022 17:05 IST

దిల్లీ: ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) ప్రకటించిన రూ.18,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ (share buyback) ఆఫర్‌లో పాల్గొన్న ప్రమోటర్‌ సంస్థ టాటా సన్స్ (Tata Sons) రూ.11,164 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ సైతం 11.7 లక్షల షేర్లను టెండర్‌ చేసి రూ.528 కోట్లను రాబట్టుకుంది.

రూ.2 లక్షల కంటే తక్కువ విలువ చేసే షేర్లు ఉన్న చిన్న వాటాదార్లకు కేటాయించిన రిజర్వ్డ్‌ విభాగంలో 2.53 కోట్ల షేర్లకు టెండర్లు వచ్చాయి. ఈ విభాగానికి కేటాయించిన 60 లక్షల షేర్లతో పోలిస్తే 4.22 రెట్ల అధిక స్పందన లభించింది. ఇతర విభాగాల్లోనూ 8.1 రెట్ల అధిక షేర్లకు టెండర్లు వచ్చాయి. బైబ్యాక్‌లో ఒక్కో షేరు రూ.4,500 చొప్పున 4 కోట్ల షేర్లను టీసీఎస్‌ కొనుగోలు చేసింది. బైబ్యాక్‌ తర్వాత టీసీఎస్‌లో టాటా సన్స్‌ వాటా 72.19 శాతం నుంచి 72.30 శాతానికి పెరిగింది. ఇతర రిటైల్‌ షేర్‌హోల్డర్ల వాటా 27.81 శాతం నుంచి 27.7 శాతానికి తగ్గింది. అలాగే టీసీఎస్‌ మొత్తం పెయిడ్‌ అప్‌ క్యాపిటల్‌ 3.7 బిలియన్ షేర్ల నుంచి 3.66 బిలియన్‌ షేర్లకు తగ్గింది.

ఇంతకు ముందు 2020లో టీసీఎస్‌ చేపట్టిన రూ.16,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌లో టాటా సన్స్‌ రూ.9,997.5 కోట్ల విలువైన షేర్లు టెండర్‌ చేసింది. ఆ సమయంలో 5.33 కోట్లకు పైగా షేర్లను టీసీఎస్‌ కొనుగోలు చేయగా.. టాటా సన్స్‌ నుంచి 3,33,25,118 షేర్లు స్వీకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని