Air India-Vistara: ఎయిరిండియా, విస్తారా విలీనం.. ‘టాటా’, ఎస్‌ఐఏ మధ్య ఒప్పందం

టాటా సన్స్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఎయిరిండియా, విస్తారాను విలీనం చేయడానికి ఇరు సంస్థలు అంగీకరించాయి. 

Published : 29 Nov 2022 20:06 IST

దిల్లీ: భారత విమానయాన రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎయిరిండియా, విస్తారా విలీనానికి టాటా సన్స్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (SIA) మధ్య అంగీకారం కుదిరింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం ఖరారైనట్లు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. ఎస్‌ఐఏ అదనంగా మరో రూ.2.05 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. విలీనం తర్వాత ఏర్పడే ఎయిరిండియాలో ఎస్‌ఐఏకు 25.1 శాతం వాటా దక్కనుంది. అనుకున్నట్లుగా నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభిస్తే ఈ ఒప్పందం 2024 మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  ప్రస్తుతం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (SIA)తో కలిసి టాటా గ్రూప్‌ విస్తారాను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

ఎయిరిండియా కార్యకలాపాలను బలోపేతం చేయడం కోసం అవసరమైతే 2022-23, 2023-24లో అదనంగా మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇరుసంస్థలు అంగీకరించాయి. ఒకవేళ 25.1 శాతం వాటా కోసం అదనంగా ఇంకా ఏమైనా చెల్లించాల్సి వస్తే ఆ మొత్తాన్ని అదనపు పెట్టుబడుల కింద విలీనం తర్వాత ఇవ్వడానికి ఎస్‌ఐఏ అంగీకరించింది. తాజా ఒప్పందంతో టాటా, ఎస్‌ఐఏ మధ్య ఉన్న భాగస్వామ్యం మరింత బలోపేతం కానుంది. కార్యకలాపాలపరంగా చూస్తే విస్తారాతో పోలిస్తే ఎయిరిండియా ఐదింతలు పెద్ద సంస్థ.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా సన్స్‌.. దాన్ని పునరుద్ధరించే పనిలో ఉంది. అందులో భాగంగానే తాజా ఒప్పందం కుదుర్చుకొంది. విస్తారాతో పాటు ఎయిరేషియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను కూడా ఎయిరిండియాలోనే కలపాలన్నది టాటాల ప్రణాళిక! మరోవైపు ఇటీవలే 300 న్యారో-బాడీ విమానాల కోసం ఎయిరిండియా ఆర్డర్‌ చేసింది. వాణిజ్య విమానయాన చరిత్రలో ఇదొక అతిపెద్ద లావాదేవీ అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వచ్చే ఐదేళ్లలో కంపెనీ విమానాల సంఖ్యను మూడింతలకు పెంచుతామని కంపెనీ సీఈఓ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ గత నెలలో పేర్కొన్నారు. ఈ క్రమంలో 25 ఎయిర్‌బస్‌, ఐదు బోయింగ్‌ పెద్ద విమానాలను సైతం చేర్చుకునే యోచనలో ఎయిరిండియా ఉంది. మరోవైపు దాదాపు 1 బిలియన్‌ డాలర్ల నిధుల్ని సైతం సమీకరించే యత్నాల్లో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని