Tata Tech IPO: టాటా గ్రూప్‌ నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. 18 ఏళ్ల తర్వాత ఐపీఓ!

Tata Tech IPO: 18 సంవత్సరాల తర్వాత టాటా గ్రూప్‌ నుంచి ఓ కంపెనీ ఐపీఓకి రాబోతోంది. టాటా టెక్నాలజీస్‌ సెబీకి ఐపీఓ ముసాయిదా పత్రాలు సమర్పించింది.

Published : 10 Mar 2023 11:15 IST

ముంబయి: టాటా మోటార్స్‌ (TATA Motors) అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూ (Tata Technologies IPO)కు రాబోతోంది. ఈ మేరకు సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. టాటా మోటార్స్‌ (TATA Motors) సహా మరో ఇద్దరు ఇన్వెస్టర్లు 23.6 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను పబ్లిక్‌ ఇష్యూకు తెచ్చిన టాటా గ్రూప్‌ (TATA Group).. 18 ఏళ్ల తర్వాత మళ్లీ మరో సంస్థను ఐపీఓకు తీసుకొస్తోంది.

ఐపీఓ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కిందే జరగనుంది. టాటా మోటార్స్‌ 8,11,33,706 షేర్లు, ఆల్ఫా టీసీ హోల్డింగ్స్‌ 97,16,853 షేర్లు, టాటా క్యాపిటల్‌ గ్రోత్‌ ఫండ్‌ 48,58,425 షేర్లను వదులుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఐపీఓ ద్వారా ఎంత మొత్తం నిధులను సమీకరించాలనుకుంటున్నది మాత్రం తెలియరాలేదు. ఇటీవలి టాటా టెక్‌ బైబ్యాక్ ప్రకారం కంపెనీ విలువను రూ.16,080 కోట్లుగా అంచనా వేశారు. దాని ప్రకారం.. తాజా ఐపీఓ పరిమాణం రూ.3,800 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. జేఎం ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌, బీఓఎఫ్‌ఏ సెక్యూరిటీస్‌, సిటీ గ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా ఈ ఐపీఓకి బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

టాటా టెక్నాలజీస్‌ ఒక ప్రొడక్ట్‌ ఇంజినీరింగ్‌, డిజిటల్‌ సేవల సంస్థ. సీఈఓ వారెన్‌ హ్యారిస్‌ నేతృత్వం వహిస్తున్న ఈ సంస్థలో 11,000 మంది పనిచేస్తున్నారు. టాటా మోటార్స్‌, జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ సహా టాటా గ్రూప్‌లోని ఇతర సంస్థలకు ఇది ప్రధానంగా సేవలందిస్తోంది. టాటా టెక్నాలజీస్‌లో 2022 మార్చి 31 నాటికి టాటా మోటార్స్‌కు 72.48 శాతం వాటా ఉంది. ఆల్ఫా టీసీ హోల్డింగ్స్‌, టాటా క్యాపిటల్‌ గ్రోత్‌ ఫండ్‌లకు వరుసగా 8.96%, 4.48% చొప్పున వాటాలున్నాయి. టాటా మోటార్స్‌ ఫైనాన్స్‌, టాటా ఎంటర్‌ప్రైజెస్‌ ఓవర్సీస్‌, జెడ్రా కార్పొరేట్‌ సర్వీసెస్‌, ప్యాట్రిక్‌ రేమాన్‌ మెక్‌గోల్డ్‌రిక్‌ సంస్థలకు మిగిలిన వాటాలు ఉన్నాయి.

2022 డిసెంబరు 31తో ముగిసిన తొమ్మిది నెలల వ్యవధిలో కంపెనీ ఆదాయం రూ.3,052.29 కోట్లుగా నమోదైంది. నికర లాభం రూ.407 కోట్లకు చేరింది. కంపెనీకి 18 అంతర్జాతీయ డెలివరీ కేంద్రాలతో పాటు ఇంజినీరింగ్‌, పరిశోధన-అభివృద్ధి (ఈఆర్‌అండ్‌డీ) సేవలు, డిజిటల్‌ ఎంటర్‌ప్రైజ్‌ సర్వీసెస్‌ (డీఈఎస్‌), ఎడ్యుకేషన్‌ ఆఫరింగ్స్‌, వాల్యూ యాడెడ్‌ రీసెల్లింగ్‌ అండ్‌ ఐప్రొడక్ట్స్‌ ఆఫరింగ్స్‌ విభాగాల్లో వ్యాపారాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని